ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సర ప్రవేశాల జాబితా విడుదల



ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సర ప్రవేశాల జాబితా విడుదల


రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీల్లో 4,400 మంది ప్రధమ సంవత్సర ప్రవేశాలకు ఎంపిక

ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు  ఈ నెల 20 నుంచి 25 వరకు కౌన్సిలింగ్

టాప్ – 20లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే నిలిచారు.

ఇప్పటికే ట్రిపుల్ ఐటీల్లో పీజీ, పిహెచ్ డీ కోర్స్ లు 

- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

విజయవాడ (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీలలో ఇప్పటికే పీజీ, పీహెచ్ డి ప్రవేశపెట్టామని  రాష్ట్ర విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని హోటల్ లెమన్ ట్రీ ప్రీమియర్ లో రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ మొదటి సంవత్సర ప్రవేశాల జాబితాను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం విడుదల చేశారు. 

ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో చూపిన ప్రతిభ, రోస్టర్ ఆధారంగా ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరానికి ప్రవేశాలు చేపట్టామన్నారు. 2023—2024 ఏడాది ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా 38,355 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలైన నూజివీడు, ఆర్.కె. వ్యాలీ(ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్ లలో మొత్తం 4,400 సీట్లు ఉన్నాయని, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావటం ట్రిపుల్ ఐటీ లో ఉన్న పోటీకి నిదర్శనమని తెలిపారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 23,628 (83 శాతం)మంది దరఖాస్తు చేసుకోగా, 14,727 (17 శాతం) మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఇక మెరిట్ ప్రకారం చూస్తే పదవ తరగతిలో 599 మార్కులు వచ్చిన విద్యార్థి ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవటం గర్వకారణమన్నారు. అలాగే జనరల్ విద్యార్థుల కటాఫ్ మార్కులు 583 అని తెలిపారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశ జాబితాలో టాప్ - 20 అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులవే కావటం రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు.

 

                   ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సర ప్రవేశాల కౌన్సిలింగ్ ఈ నెల 20 నుంచి 25 వరకు నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మొదటి సంవత్సర అకాడమిక్ తరగతులు ఆగస్టు నెల మొదటి వారంలో ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 20,21 తేదీల్లో నూజివీడు, 21,22 తేదీల్లో ఆర్.కె. వ్యాలీ(ఇడుపులపాయ), 24,25 తేదీల్లో ఒంగోలు క్యాంపస్ ఇంటర్యూలు ఆర్.కె. వ్యాలీ క్యాంపస్ లో, 24,25 తేదీల్లో శ్రీకాకుళం క్యాంపస్ లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని వివరించారు. ప్రతి క్యాంపస్ లో 1100 సీట్లు ఉన్నాయని వాటిలో 911 జనరల్ కు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం 4400 సీట్లలో బాలికలకు 63.98 శాతం, బాలురకు 36.01 శాతం ప్రవేశాలు కల్పించినట్లు మంత్రి చెప్పారు. 

                     రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమాల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ట్రిపుల్ ఐటీల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అలాగే అధ్యాపకుల నియామకాలు త్వరలోనే చేపట్టనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నిర్మాణానికి అతి త్వరలో టెండర్లు పిలవటమే కాకుండా త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఉన్నత విద్యలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు విద్యా కానుక మూడవ విడతతో పాటు నాల్గవ విడత నిధులు కూడా విడుదల చేస్తున్నామన్నారు. దీంతో అకాడమిక్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో తీసకుంటున్న విప్లవాత్మక చర్యల ఫలితంగా దేశం మొత్తం రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. మనబడి నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయని, ప్రతి రోజూ మెనూ మార్చి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించటంతో పాటు పౌష్టికాహర లోపం లేకుండా ఉండటానికి వారానికి మూడు రోజులు చిక్కితో పాటు రాగిజావ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఫౌండేషన్ విద్య పటిష్టంగా ఉన్నప్పుడే గ్లోబల్ పోటీలో తట్టుకోగలరని, అందుకు అవరసమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐటీ విద్య మిధ్యగా మిగిలిపోకూడదన్న సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీకి పునాది వేశారన్న విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు.

                  కార్యక్రమంలో ఛాన్స్ లర్ ప్రొఫెసర్ కె.సి. రెడ్డి, వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ ఎం. విజయ్ కుమార్, ప్రొఫెసర్ లు సంధ్యారాణి, జయరామిరెడ్డి, జగదీశ్వరరావు, గోపాలరాజు, జి.వి.ఆర్. శ్రీనివాసరావు, ఆర్.జె.కె.టి ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. 


Comments