ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు జగన్ తగిన గౌరవం కల్పించారు.బంటుమిల్లి: జూలై 22 (ప్రజా అమరావతి);


*ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు జగన్ తగిన గౌరవం కల్పించారు.**బంటుమిల్లి బస్ స్టేషన్ ను త్వరలో ఆధునికరిస్తాం ..*


*నూతన పెట్రోల్ డీజిల్ బంకు ప్రారంభోత్సవంలో మంత్రి జోగి రమేష్*


అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులు, కార్మికులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తగిన గౌరవం కల్పించారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.


బంటుమిల్లి బస్ స్టేషన్ పక్కనే గల సువిశాలమైన ప్రాంతంలో ఏపీఎస్ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ వారి పెట్రోల్ డీజిల్ బంకును శనివారం మంత్రి ప్రారంభించారు. బంకు ఏర్పాటుకు కృషిచేసిన ప్రతి ఒక్కరినీ మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ డీజిల్ బంకు ఆర్టీసీ సంస్థ మనుగడకు ఎంతో తోడ్పాటును అందిస్తుందని అన్నారు. కల్తీ లేని నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించడంలో వినియోగదారుల విశ్వాసనీయతను పెంపొందించుకోవాలని ఆశించారు. త్వరలో సీఎన్ జీ గ్యాస్ బంకును సైతం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రికి నిర్వాహకులు తెలిపారు.


తాను ఆర్టీసీ జోనల్ చైర్మన్ గా ఉన్న రోజుల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి మనుగడ లేని ఆర్టీసీ సంస్థకు జీవం పోశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలకులు ఆర్టీసీని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం  చేశారని, అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని  ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తగిన గౌరవం కల్పించారని పేర్కొన్నారు.


వివిధ జిల్లాలు, మండలాలకు ప్రయాణికుల  రాకపోకలలో ముఖ్య కేంద్రమైన బంటుమిల్లి బస్ స్టేషన్ ను అన్ని సౌకర్యాలతో త్వరలో ఆధునీకరించనున్నామని మంత్రి వెల్లడించారు.


ఈ కార్యక్రమంలో విజయవాడ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోన్-2 కె గోపినాథ్ రెడ్డి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ రీజినల్ ఆఫీసర్ ఆదిత్య ఆనంద్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రెబ్బా అంబేద్కర్,  జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఏ.వాణిశ్రీ, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్, మచిలీపట్నం డిపో మేనేజర్ పి.పెద్దిరాజు, బంటుమిల్లి ఎంపీపీ వెలివెల చినబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Comments