మ‌రింత మెరుగ్గా టీచింగ్ ఆస్ప‌త్రుల ప‌ర్య‌వేక్ష‌ణ.

 *మ‌రింత మెరుగ్గా టీచింగ్ ఆస్ప‌త్రుల ప‌ర్య‌వేక్ష‌ణ


*

*జేడీల నియామ‌కాల‌కు చ‌ర్య‌లు*

*స‌ర్వీసు ప్రొవైడ‌ర్ల సేవ‌ల‌పై నిరంత‌ర నిఘా*

*అన్ని చోట్లా సీటీ, ఎమ్మారై స్కానింగ్ లు త‌ప్ప‌నిస‌రి*

*కొత్త మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో వ‌స‌తుల‌న్నీ సిద్ధం చేయండి*

*త‌ర‌గుతులు ప్రారంభ‌మ‌య్యేనాటికి ఏ కొర‌తా రాకూడ‌దు*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

*టీచింగ్ ఆస్ప‌త్రులు, ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌పై రివ్యూ*

అమరావతి (ప్రజా అమరావతి);

టీచింగ్ ఆస్ప‌త్రుల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ‌ను మ‌రింత‌గా పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్ లో ఉన్న వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమ‌వారం డీఎంఈ విభాగంపై మంత్రి విడ‌ద‌ల ర‌జిని పూర్తిస్థాయి స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ టీచింగ్ ఆస్ప‌త్రులు మ‌రింత మెరుగ్గా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల కోసం ఈ ఆస్ప‌త్రుల్లో అందిస్తున్న సేవ‌ల‌పై నిఘాను మ‌రింత‌గా పెంచ‌బోతున్నామ‌న్నారు. స‌ర్వీసు ప్రొవైడ‌ర్లు అందిస్తున్న సేవ‌ల్లో నాణ్య‌త‌పై ప‌ర్య‌వేక్ష‌ణ కోసం కొత్త‌గా జేడీల నియామ‌కానికి సంబంధించి నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపామ‌ని చెప్పారు. అన్ని టీచింగ్ ఆస్ప‌త్రుల్లో సీటీ, ఎమ్మారై స్కానింగ్ సేవ‌లు క‌చ్చితంగా ఉచితంగా అందాల‌ని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అన్ని టీచింగ్ ఆస్పత్ర‌ల్లో ప్ర‌భుత్వ‌మే సొంతంగా సీటీ, ఎమ్మారై స్కానింగ్‌లు తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని తెలిపారు. పీపీపీ ప‌ద్ధ‌తికి స్వ‌స్థి ప‌లికేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. 


*శానిటేష‌న్‌, సెక్యూరిటీ ఏజెన్సీల ప‌నితీరు మెరుగ‌వ్వాలి*

అన్ని టీచింగ్ ఆస్ప‌త్రుల్లో శానిటేష‌న్‌, సెక్యూరిటీ ఏజెన్సీల ప‌నితీరు మెరుగ‌వ్వాల‌ని చెప్పారు. సీజ‌న‌ల్ వ్యాధుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. డెంగీ, మలేరియాలాంటి విష‌జ్వ‌రాల‌కు సంబంధించి చికిత్స అందించేందుకు అన్ని ఆస్ప‌త్రుల్లో ప‌దేసి బెడ్ల సామ‌ర్థ్యంతో ప్ర‌త్యేక వార్డులు ఏర్పాటుచేయాల‌ని ఆదేశాలు జారీచేశారు. కొత్త మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో అన్ని వ‌స‌తుల‌ను ఈ నెలాఖ‌రులోగా స‌మ‌కూర్చాల‌ని చెప్పారు. వ‌చ్చే నెల నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో చిన్న స‌మ‌స్య కూడా విద్యార్థుల‌కు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్య‌త మ‌న‌పైనే ఉంద‌ని పేర్కొన్నారు. శానిటేష‌న్‌, సెక్యూరిటీ ఏజెన్సీలు ప్ర‌భుత్వంతో కుదుర్చుకున్న ఎంవోయూ ప్రకారం ప‌నిచేయాల‌ని చెప్పారు. నిబంధ‌న‌లు పాటించ‌ని వారిపై చ‌ర్య‌లు తప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. కొత్త టీచింగ్ ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య‌శ్రీ కింద సేవ‌లు పెంచాల‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య‌శాఖ‌ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ మంజుల‌, డీఎంఈ న‌ర‌సింహం, వైఎస్సార్ ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం వీసీ డాక్ట‌ర్ బాబ్జి, రిజిస్ట్రార్ డాక్ట‌ర్ రాధికారెడ్డి, డీఎంఈ కార్యాల‌య అధికారులు పాల్గొన్నారు.

Comments