డిశంబరు-జనవరి నాటికి నాడు-నేడు పనులు పూర్తి కావాలి.

 డిశంబరు-జనవరి నాటికి నాడు-నేడు పనులు పూర్తి కావాలి



" ఈనెలాఖరుకు నూరుశాతం ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలి


* విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఐరెన్ ఫోలిక్  మాత్రలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయండి


* బడి ఈడు కలిగిన పిల్లలను బడికి  పంపని  తల్లి దండ్రులకు భవిష్యత్తులో ప్రభుత్వ పధకాలు రావనే సందేశాన్ని ఇచ్చి వారిలో అవగాహన కలిగించాలి


* నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన మరుగుదొడ్లను వినియోగించని   పాఠశాలలు,మండల అధికారులపై చర్యలు తీసుకోండి


* మండల కేంద్రాలు,పెద్ద పంచాయితీల్లోని ఉన్నత పాఠశాలల్లో క్రీడా సౌకర్యాలు కల్పనకు కృషి చేయాలి


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి.


విజయవాడ,8 జూలై (ప్రజా అమరావతి): రాష్ట్రం లోని వివిధ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నీ వచ్చే డిశంబరు-జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.శనివారం  విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన పాఠశాల విద్యా శాఖపై సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ప్రధానంగా నాడు-నేడు,విద్యా కానుక కిట్ల పంపిణీ,ఉపాధ్యాయుల గ్రీవియెన్సైస్,పాఠశాల విద్యకు సంబంధించి ఎన్రోల్మెంట్ డ్రైవ్ దాని ప్రభావం,సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వంటి అంశాలపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ నాడు-నేడు కింద చేపట్టిన పనులన్నీ వచ్చే డిశంబరు-జనవరి నాటికి పూర్తి చేయాలని పునరుద్ఘాటించారు. వాలంటీర్ల ద్వారా చేపట్టిన నూరు శాతం ఎన్రోల్మెంట్ ప్రక్రియను ఈనెలాఖరు లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అదే విధంగా బడిఈడు కలిగిన పిల్లలంతా బడిలో ఉండాలని లేకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పధకాలు రావనే సందేశాన్ని తల్లి దండ్రులకు తెలియజేసి పిల్లందరినీ బడికి పంపేలా చూడాలని సిఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేశారు.


నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన మరుగుదొడ్లను వినియోగించని పాఠశాలలు,సంబంధిత మండల విద్యాశాఖ అధికారులపై చర్యలకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఇందుకు సంబంధించి ముందుగా అన్ని పాఠశాలలకు ఒక సర్క్యులర్ ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఆదేశించారు.


విద్యార్థుల్లో రక్త హీణతను నివారించేందుకు విద్యార్థులందరికీ ఐరెన్ ఫోలిక్ మాత్రలు పంపిణీ చేయడం తోపాటు మధ్యాహ్న భోజన పధకంలో మరింత పౌష్టికత ఉండేలా చూడాలని చెప్పారు.


పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని కలిగించి వారిలోని క్రీడా ప్రతిభను వెలికి తీసి మంచి క్రీడా కారులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని సిఎస్ స్పష్టం చేశారు.ఇందుకు గాను క్రీడా పరమైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేందుకు వీలుగా మండలం కేంద్రాలు,పెద్ద గ్రామ పంచాయతీల్లోని ఒకటి రెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఉన్నత పాఠశాలలను గుర్తించి నివేదిక సిద్దం చేయాలని ఆదేశించారు.


ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఒక మహిళా జూనియర్ కళాశాల సహా మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులో ఉండేలా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.మండల స్థాయిలో మహిళా జూనియర్ కళాశాల అందుబాటులో ఉంటే     యుక్త వయస్సు రాకుండానే వివాహాలు చేసే ప్రయత్నాలను నివారించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.


విద్యాశాఖకు సంబంధించి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను డిశంబరు నెలాఖరు లోగా సాధించేందుకు కృషి చేయాలని సిఎస్ సూచించారు. ప్రస్తుతం విద్యాశాఖకు సంబంధించి ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వాటిని వచ్చే విద్యా సంవత్సరం నాటికి అధిక మించేందుకు కృషి చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.


విద్యార్థులకు అవసరమైన వివిధ రకాల ప్రభుత్వ సర్టిఫికేట్ల ను డిజి లాకర్ విధానంలో ఆన్లైన్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని దీనిపై త్వరలో సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు.


ఈసమావేశంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ముందుగా జిల్లాల వారీ ఎన్రోల్మెంట్ ప్రక్రియను వివరించారు. వాలంటీర్ల ద్వారా చేపట్టిన 5-18 ఏళ్ళ వయస్సు కలిగిన పిల్లల నూరు శాతం గ్రాస్ ఎన్రోల్మెంట్ ప్రక్రియను జూలై నెలాఖరు లోగా పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలు,డిమాండ్లను చాలా వరకు వారితో చర్చించి పరిష్కరించామని మరికొన్ని విధాన పరమైన అంశాలను రాష్ట్ర స్థాయిలో చర్చించి పరిష్కారం చేయాల్సి ఉందని తెలిపారు.


 విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు పధకం గురించి పాఠశాల మౌలిక సదుపాయాల కమీషనర్ కె.భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల ఉన్నత పాఠశాలలు,4వేల ప్రాధమి కోన్నత పాఠశాలలు సహా మొత్తం 45 వేల పాఠశాలలకు గారు మొదటి విడత నాడు నేడు కింద 15 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కు ఎంపిక చేశామని తెలిపారు. ఆయా పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం,రన్నింగ్ వాటర్ తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం,అదనపు తరగతులు నిర్మాణం,డిజిటల్ తరగతులు, కిచెన్,కాంపౌండ్ గోడ నిర్మాణం వంటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. అదే విధంగా రెండవ విడత కింద మరో 16 వేల పాఠశాలల్లో నాడు నేడు కింద మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నా మని తెలిపారు.3వ విడతలో మిగతా సుమారు 14 వేల పాఠశాలల్లో సౌకర్యాలన్నీ సమకూరుస్తామని చెప్పారు. ఇప్పటికే 38 శాతం సివిల్ పనులు పూర్తి అయ్యాయని మొత్తం పనులన్నీ వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమీషనర్ భాస్కర్ వివరించారు. సుస్థిరాభివృధ్థి లక్ష్యాలను కూడా డిసెంబర్ నాటికి అధికమిస్తామని వివరించారు.


ఈసమావేశంలో రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ పూర్తయిందని వివరించారు.విద్యార్దులకు అవసరమైన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్,మార్కుల మెమో, మైగ్రేషన్ వంటి వివిధ రకాల సర్టిఫికేట్లను జాప్యం లేకుండా డిజి లాకర్ విధానంలో ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా కసరత్తు చేస్తున్నామని తెలిపారు.


ఈసమావేశంలో మీనా,జీవన్ సహా పలువురు పాఠశాల విద్యా శాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.



Comments