డ్రైనేజీ కాలువల్లో పూడికలు, గుర్రపు డెక్కలు పూర్తిగా తొలగించి నీరు సజావుగా పారెందుకు తగిన చర్యలు చేపట్టాలి.



మచిలీపట్నం జూలై 22 (ప్రజా అమరావతి);


జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా

డ్రైనేజీ కాలువల్లో పూడికలు,  గుర్రపు డెక్కలు పూర్తిగా తొలగించి నీరు సజావుగా పారెందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.  



శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ పామర్రు నియోజకవర్గ  మొవ్వ మండలం పెదరాయుడు తోట కోళ్ల పాలెం, రామన్నపేట గ్రామాల పరిధిలోని ఉప్పైకోడు మీడియం డ్రైనేజీ కాలువను పరిశీలించారు.


ఈ సందర్భంగా  జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ జన్ను రాఘవరావు గ్రామ రైతులతో కలసి మాట్లాడుతూ డ్రైనేజీ కాలువ తూడుతో నిండిపోయిందని కాలువకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు వాలుపడి, తుంటికాడ, గుర్రపు డెక్కల తో   నీరు సజావుగా పారడం లేదని అడ్డంకులని తొలగించేలా  చూడాలని కలెక్టర్ ను కోరారు.


దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ కాలువలో పూడికతీత వెంటనే చేపట్టాలని, చెట్ల కొమ్మలను గుర్రపు డెక్కలను తొలగించి నీరు సజావుగా ప్రవహించేలా  చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రతి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో డ్రైనేజీ కాలువ సమస్యల విషయం తమ దృష్టికి తెచ్చి దాన్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ కోరారన్నారు.


జిల్లాలో నీటిపారుదల, డ్రైనేజీ కాలువలకు సంబంధించి ఇదివరకే పనులు పొందిన  కాంట్రాక్టర్లు తక్షణమే వారి పనులు మొదలు పెట్టాలని ఆదేశించామన్నారు. గతంలో సాధారణంగా అప్పగించిన పనులు సంవత్సరమంతా  చేసేవారని ఇకపై అలా కాకుండా ప్రతి 15 రోజులకు ఎంత పని చేయాలి అని నిర్దేశిస్తూ కొంత లక్ష్యాన్ని కేటాయించామని దాన్ని ఆ విధంగా చేస్తున్నది లేనిది పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.

వచ్చే సంవత్సరం కాలువలకు నీరు వదలకముందే పూడికలు గుర్రపు డెక్కలు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపామని ఇంకా రాలేదని అది వచ్చేలోగా ఏదో ఒక బడ్జెట్ తో కాలువల్లో పూడికలు, గుర్రపు డెక్కలు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల ఆదుకుంటామన్నారు.

ఈ సంవత్సరం డ్రైనేజీ వ్యవస్థకు ప్రాధాన్యతనిస్తూ వాన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు డ్రైనేజీ కాలువను సిద్ధం చేసుకుంటామన్నారు.


జిల్లాలో పది లక్షల టన్నుల వరి ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతుందని డ్రైనేజీ కాలువను  బాగుపరుచుకునేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.

సిబ్బంది కొరత ఉన్నచోట  గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ సహాయకుల సేవలను వినియోగించుకుంటామన్నారు.


ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా నీటిపారుదల డ్రైనేజీ ఈ.ఈ. విజయలక్ష్మి, ఎంపీడీవో సుధా ప్రవీణ్ తహసిల్దారు వీరాంజనేయ ప్రసాద్ సర్పంచ్ తాత స్వప్న,  ఖాజా ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు పాల్గొన్నారు


Comments