జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ల నిర్వహణ పనుల పురోగతిపై కలెక్టర్ సీరియస్.


మచిలీపట్నం, జూలై 17 (ప్రజా అమరావతి);


*జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ల నిర్వహణ పనుల పురోగతిపై కలెక్టర్ సీరియస్


*


జిల్లాలో సాగునీటి కాలువలు డ్రైన్ల నిర్వహణ పనులలో తీవ్ర జాప్యం పట్ల జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.


సోమవారం కలెక్టరేట్ లో జల వనరుల శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ల నిర్వహణ పనులు పురోగతి సమీక్షించారు. కృష్ణ మధ్య విభాగం బందరు కాలువ క్రింద 33 పనులు చేపట్టిందని అన్నారు. యనమలకుదురు నుండి ప్రారంభమయ్యే ఈ పనులు అన్ని గ్రౌండ్ అయినప్పటికీ, పనులు ఆశించిన మేరకు ప్రగతి లేకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖరీఫ్ పనులు ప్రారంభమైనా జిల్లాలో సాగునీటి కాలువలు డ్రైనేజీ లలో గుర్రపు డెక్క, తూడు తొలగింపు పనులు, పూడికతీత పనులు ఆలస్యం కావడం పట్ల, అధికారుల పర్యవేక్షణ సరిగా లేదని సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని అన్నారు. ఒక్కొక్క పని వారీగా కాంట్రాక్టర్ వివరాలు, వారికి వివిధ దశల్లో నిర్దేశించిన గడువు వివరాలు, ఇంతవరకు పూర్తయిన పనుల శాతం, మిగతా పనుల వివరాలతో మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజనీరును ఆదేశించారు. 


వారంలోగా మరల పనుల పురోగతిపై సమీక్షిస్తామన్నారు. ఈలోగా గుత్తేదారులతో అగ్రిమెంట్లన్నీ పూర్తి కావాలన్నారు. వారికి పనుల వివిధ దశల్లో గడువు నిర్దేశించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా గుత్తేదారులు పనులు పూర్తి చేసేలా సమగ్ర పర్యవేక్షణ చేయాలని అన్నారు. గడువులోగా పనులు పూర్తి చేయని గుత్తేదారులకు నోటీసులు జారీ చేయడం, అప్పటికి స్పందించకపోతే తదుపరి చర్యలు ఉంటాయన్నారు. 


ఇరిగేషన్ కెనాల్స్ బ్రాంచ్ కెనాల్స్ ఆక్రమించి కాలువను కుదించి సరిగా నీటి ప్రవాహం లేకుండా చేసే చర్యలు, ఆక్రమణలు అరికట్టాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామన్నారు.


ఈ సమావేశంలో జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరు టి జే హెచ్ ప్రసాద్ బాబు, ఈ ఈ కృష్ణారావు, డ్రైనేజీ ఈ ఈ విజయలక్ష్మి, ఇరిగేషన్ డిఈలు డిపిఓ నాగేశ్వర నాయక్ పాల్గొన్నారు.


Comments