అధిక ప్రాధాన్యత అంశాల పరిష్కారంలో అధికారులు శ్రద్ధ వహించాలి.

 అధిక ప్రాధాన్యత అంశాల పరిష్కారంలో అధికారులు శ్రద్ధ వహించాలి


-- నియోజకవర్గస్థాయి సమావేశాలతో చాలా వరకు సమస్యలు పరిష్కారం

-- సాలూరు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మంత్రి అమర్నాథ్ వెల్లడి

పార్వతీపురం, జూలై 25 (ప్రజా అమరావతి): అధిక ప్రాధాన్యత క్రమంలో ఉన్న సమస్యల పరిష్కారం పట్ల అధికారులు శ్రద్ధ వహించాలని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం  జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి రాష్ట్ర గుడివాడ అమర్నాథ్ అధ్యక్షతన జరిగింది. నియోజక వర్గ స్థాయిలో సమీక్షలు చేసి సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. మూడు నెలలలోపు రాష్ట్రంలోని అనేక సమస్యలు పరిష్కారం కావాలని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్య మంత్రి స్థాయి, ప్రభుత్వ స్థాయిలో ఉన్న అంశాలు నియోజకవర్గ స్థాయి సమావేశంలోప్రస్తుతానికి ప్రస్తావనకు రావడం వలన ఉన్నత స్థాయిలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.  మన్యం జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించడం పట్ల మంత్రి అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా అధికారులకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. జిల్లా  అధికారులు చక్కగా పని చేస్తున్నారని, సమస్యల పరిష్కారానికి అదే స్ధాయిలో కృషి చేయాలని ఆయన కోరారు. సాలూరులో 1.5 ఎకరాల స్థలంలో  ట్రక్ బే ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికనుతనకు అందజేయాలని మంత్రి అమర్నాథ్ కోరారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర మాట్లాడుతూ సమస్యలు త్వరగా పరిష్కారం చేయుటకు అధికారులు కృషి చేయాలన్నారు. ఉన్నత అధికారులకు పంపిన సమస్యల స్థితిగతులు పరిశీలించి సమాచారం అందించాలని సూచించారు. అత్యంత ప్రాధాన్యత పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలని ఆయన అన్నారు. పెద్దగెడ్డ రిజర్వాయరు పునరావాస పనులు ఇంకా పూర్తి కాకపోవడాన్ని ఉదహరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులను సంప్రదించడం వలన సానుకూలంగా, వేగంగా పనులు జరుగుతాయని ఆయన చెప్పారు. 24 అంగన్వాడీ భవనాలు చిన్న పనులు పూర్తి చేయక అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సాలూరు - మక్కువ రహదారి రూ.55 కోట్లతో మంజూరు అయిందని, వాటి పనులు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. పనులు త్వరగా చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. పెద్దగెడ్డ రిజర్వాయరు పునరావాస పనులు, చెరుకుపల్లి గెడ్డ పనులు, అక్వాడేక్ట్ పనులు ప్రాధాన్యతలో చేపట్టాలని ఆయన అన్నారు. సురాపాడు పై ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. పాఠశాలల్లో ప్రహారీ గోడలు, గేట్లు, సి.సి కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉండాలని, ఈ మేరకు జి.ఓ 40 జారీ చేశామని ఆయన అన్నారు. వీటిపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో అనుకోని సంఘటనలు జరిగాయని ఆయన తెలిపారు. సాలూరు ఆసుపత్రి భవనాలు నవంబరు నాటికి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు సైతం పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. పాచిపెంటతో పాటు అవసరం ఉన్న ఆసుపత్రులను సామాజిక ఆసుపత్రులు అప్ గ్రేడ్ చేయుటకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా గిరిజన ప్రాంతంలో చేపట్టిన టిడ్కో గృహాలు అని, వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. జిజిఎంపిలో డికెటి పట్టల కోసం ఆర్జీలు అందాయని, వాటికి పట్టాలు మంజూరు చేయాలని అన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ చేపడుతున్న రహదారి పనులు అన్ని జిల్లాల్లో ప్రారంభం అయ్యాయన్నారు. అంగన్వాడీ భవనాలు మరమ్మతుల నివేదిక సమర్పిస్తే వాటిని జిల్లా పరిషత్ నుండి మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పెదభద్ర మరియు ఇతర గ్రామాలకు వెళ్ళే నీటి పథకం నుండి 10 గ్రామాలకు నీటిని సరఫరా చేయుటకు జల జీవన్ మిషన్ లో ప్రతిపాదించాలని ఆయన సూచించారు. 

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ శాఖల వారీగా వచ్చే ప్రతిపాదనలు, వాటిపై చర్యలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. ప్రాధాన్యతా భవనాలు పూర్తి చేయాలని ఆయన సూచించారు. పాత అంచనాలు పరిశీలించి పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ భవనాలు స్థితిగతుల నివేదిక సమర్పించాలని, వాటికి అవసరమగు నిధులు అంచనా వేయాలని ఆయన పేర్కొన్నారు. దలైవలస వద్ద పెడ్డగెడ్డ పై డైవర్షన్ లో ముంపుకు గురి అవుతున్న భూములకు, ప్రత్యామ్నాయ భూమి ఇచుటకు భూములను గుర్తించాలని ఆర్.డి.ఓ ను ఆదేశించారు. ప్రహారీ గోడలు, గేట్లు లేని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ కార్యనిర్వహణ ఇంజినీర్ గుమ్మడం గృహ కాలనీ పరిశీలించి విద్యుత్ కల్పించుట చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. 

జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు మాట్లాడుతూ సాలూరు నియోజక వర్గంలో మూడు మండలాల్లో 33 గ్రామాల నుంచి 341 మంది లబ్ధిదారులకు 368 ఎకరాలు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ క్రింద పంపిణీ చేయడం జరిగిందన్నారు. తదుపరి చేసిన సర్వేలో 69 మంది లబ్ధిదారులు కొత్తగా వచ్చారని, తదుపరి సబ్ డివిజన్ సమావేశంలో పరిశీలించి మంజూరు చేస్తామని చెప్పారు. 

చిలక మెండంగి, బంద మెండంగి, తాడిపుట్టి, దోయవర్ మీదుగా మక్కువ మండలం బాగుజోల నుండి సాలూరు మండలం సిరివర వరకు రూ.13 కోట్లతో రహదారి, సాలూరు నుండి చిన పారన్నవలస రహదారిలో వేగావతిపై అసంపూర్ణంగా ఉన్న శివరాంపురం బ్రిడ్జిని రూ.5.95 కోట్లతో నిర్మించుటకు అంచనాలు తయారు చేయడం జరిగిందని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి తెలిపారు. 45 సచివాలయాల భవనాలు, 44 రైతు భరోసా కేంద్రాలు, 39 వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణం జరుగుతున్నాయని, 278 గడప గడపకు మన ప్రభుత్వం పనులు జరుగుతున్నాయని చెప్పారు. 

రహదారులు భవనాలు శాఖ ఆధ్వర్యంలో 7 రహదారులు రూ.15.40 కోట్లతో నిర్మించడం జరిగిందని ఆర్ అండ్ బి అధికారులు చెప్పారు

పెద్దగెడ్డ రిజర్వాయరు పునరావాస పనులు రూ.7.92 కోట్లకు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని,  చెరుకుపల్లి గెడ్డ పనులు రూ.4.67 కోట్లతో ప్రతిపాదించగా ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని,  వి.ఆర్.ఎస్ పై అక్వడేక్ట్ పనులు రూ.5.70 కోట్లతో పరిపాలన ఆమోదం ఇచ్చామని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారి ఆర్.అప్పారావు తెలిపారు. అడారుగెడ్డకు దుగ్గేరు వద్ద ఆనకట్ట కట్టుటకు రూ.4.50 కోట్లతోను, దలైవలస వద్ద పెడ్డగెడ్డ పై డైవర్షన్ స్ట్రక్చర్ నిర్మాణానికి రూ.3 కోట్లతో నిర్మించుటకు ప్రతిపాదించామని అన్నారు. ఇచ్చట గిరిజనులు సాగు చేస్తున్న భూములు ముంపుకు గురి అవుతాయని, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని అన్నారు. 

పెదభద్ర,  ఇతర గ్రామాలకు వెళ్ళే నీటి పథకం నుండి 10 గ్రామాలకు నీటిని సరఫరా చేయుటకు రూ.12.08 కోట్లతో అభివృద్ది చేయుటకు ప్రతిపాదించామని ఆర్. డబ్ల్యు. ఎస్ ఇంజినీరింగ్ అధికారి ప్రభాకర రావు తెలిపారు. 

 నియోజకవర్గంలో 22 రహదారులు అసంపూర్తిగా ఉన్నాయని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి శాంతీశ్వర రావు తెలిపారు. వర్షా కాలం ముగియగానే పనులు పూర్తి చేస్తామని అన్నారు. ఇ.ఏ గ్రాంట్ లో వచ్చిన ఏడు రహదారుల్లో నాలుగు రహదారులు ప్రారంభించామని ఆయన చెప్పారు. 

22 బ్లాకుల్లో 1248 టిడ్కో గృహాలు నిర్మాణం జరుగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి అవుతాయని డి.ఇ తెలిపారు. మౌళిక సదుపాయాలు కల్పనకు రూ.7.76 కోట్లతో పనులు మంజూరు అయ్యాయని ఆమె తెలిపారు. 


సాలూరు మునిసిపాలిటి లో రూ.4 కోట్లతో పార్కు నిర్మాణానికి ప్రతిపాదించామని మునిసిపల్ కమీషనర్ శంకర రావు తెలిపారు. సాలూరు అత్యధిక లారీలు ఉన్న ప్రాంతమని, ఆటో నగర్ అవసరమని, రూ.10 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు.

ఈ సంధర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గృహ అవసరాలు ఎక్కువగా ఉన్నందున, ఇప్పటికే స్వంత స్థలాలుగా గుర్తించిన లబ్దిదారులతో పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అందిన అర్జీలను కూడా మంజూరు చేయాలని సమావేశంలో తీర్మానించారు*

గిరి శిఖర ప్రాంతాలు వంటి విభిన్న భౌగోళిక ప్రాంతాలు ఉన్న దృష్ట్యా యూనిట్ ఖరీదు అదనంగా కొంత మొత్తం మంజూరుకు తీర్మానించడం జరిగింది*

ఇపిడిసిఎల్ సాలూరులో ప్రస్తుతం  పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఒకే విభాగం నుండి సేవలు అందిస్తున్నందున ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా రెండుగా విభజించాలని తీర్మానించడం జరిగింది*

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి. విష్ణు చరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి. వాగ్దేవి, జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ రాజ్ కుమార్, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ఇన్ ఛార్జ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.రమేష్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ,జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, ఏపిఎంఐపి పిడి ఎల్. శ్రీనివాస రావు, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్,  జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, జిల్లా ప్రణాళిక అధికారి పి. వీర రాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి శ్రీనివాస రావు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్, జిల్లా బిసి సంక్షేమ సాధికారిత అధికారి ఎస్.కృష్ణ, జిల్లా కార్మిక శాఖ అధికారి కె. రామ కృష్ణా రావు, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారి ఎం.జేమ్స్,  గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారి జె.శాంతీశ్వర రావు, సాలూరు నియోజకవర్గ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments