మెడిక‌ల్ క‌ళాశాల ప‌నులు వేగ‌వంతం కావాలి - నాణ్య‌త‌లో రాజీ లేకుండా ప‌నులు నిర్వ‌హించాలి.*మెడిక‌ల్ క‌ళాశాల ప‌నులు వేగ‌వంతం కావాలి - నాణ్య‌త‌లో రాజీ లేకుండా  ప‌నులు నిర్వ‌హించాలి**జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి ఆదేశాలు*


విజ‌య‌న‌గ‌రం, జూలై 18 (ప్రజా అమరావతి):


న‌గ‌రంలోని గాజుల‌రేగ వ‌ద్ద నిర్మాణంలో వున్న ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల ప‌నులు వేగ‌వంతం చేసి నిర్దేశిత గ‌డువులోగా పూర్తిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి  నాగ‌ల‌క్ష్మి ఎస్ నిర్మాణ సంస్థ ప్ర‌తినిధుల‌ను ఆదేశించారు. విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ‌మై వైద్య విద్యార్ధులు వ‌చ్చే లోగానే పెండింగ్‌లోని నిర్మాణ‌ ప‌నుల‌న్నీ పూర్తికావాల‌న్నారు. అదే స‌మ‌యంలో ప‌నుల నాణ్య‌త‌లో ఎక్క‌డా రాజీ లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని వైద్య ఆరోగ్య‌ ఇంజ‌నీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. నిర్మాణంలోని ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల భ‌వ‌నాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌మ‌తి నాగ‌ల‌క్ష్మి మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. గ‌త ప‌ర్య‌ట‌న నాటికి ప్ర‌స్తుత ప‌ర్య‌ట‌న స‌మయానికి ప‌నుల్లో సాధించిన ప్ర‌గ‌తిని తెలుసుకున్నారు. వైద్య క‌ళాశాల‌లో ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో చేరే విద్యార్ధుల‌కు అవ‌స‌ర‌మైన త‌ర‌గ‌తి గ‌దులు, లేబొరేట‌రీలు ఏ ద‌శ‌లో వున్న‌దీ ప‌రిశీలించారు. లెక్చ‌ర్ హాళ్లు, లేబొరేట‌రీలు జూలై 25  నాటికి ప‌నులు పూర్తిచేసి సిద్ధంచేస్తామ‌ని నిర్మాణ సంస్థ ఎన్‌.సి.సి. మేనేజ‌ర్ శ్రీ‌నివాస్ వివ‌రించారు. బోధ‌న సిబ్బంది గ‌దుల‌ను 27 నాటికి పూర్తిచేస్తామ‌ని తెలిపారు. ఫిజియాల‌జీ, ఎనట‌మీ గ‌దులు మాత్ర‌మే కొంత ప‌నులు పెండింగ్ వున్నాయ‌ని, వాటిని కూడా నెలాఖ‌రు క‌ల్లా పూర్తిచేస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం నిర్మాణ ప‌నుల్లో 720 మంది కార్మికులు వున్నార‌ని, నిర్మాణ ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాలు, సామాగ్రి అంతా సిద్ధంగా వుంద‌న్నారు.


విద్యార్ధుల హాస్ట‌ల్ భ‌వ‌నాల‌ను, డైనింగ్ రూంల‌ను కూడా క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. 27వ తేదీ నాటికి వీటి నిర్మాణం పూర్తిచేయ‌గ‌ల‌మ‌ని నిర్మాణ సంస్థ ప్ర‌తినిధులు వివ‌రించారు. లెక్చ‌ర్ హాలులో ఇంట‌రాక్టివ్ ప్యాన‌ల్‌, స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నామ‌ని సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. గ‌చ్చుల‌కు టైల్స్ వేసేట‌పుడు వాటి మ‌ధ్య ఖాళీలు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. క‌ళాశాల‌కు నీటి స‌ర‌ఫ‌రాపై క‌లెక్ట‌ర్ ఆరా తీశారు. ఇప్ప‌టికే బోర్లు వేశామ‌ని నెలాఖ‌రుక‌ల్లా నీటిస‌ర‌ఫ‌రా ప‌నులు పూర్త‌వుతాయ‌ని ఇంజ‌నీర్లు వివ‌రించారు. వైద్య క‌ళాశాల‌లో ప్ర‌వేశానికి నిర్మించ‌నున్న ర‌హ‌దారిపై క‌లెక్ట‌ర్ ఆరా తీశారు. రోడ్డు నిర్మాణానికి అంచ‌నాలు రూపొందించామ‌ని  డి.ఇ. కుమార్ చెప్పారు.


ఈ ప‌ర్య‌ట‌న‌లో వైద్య క‌ళాశాల ప్రిన్సిపాల్ డా.ప‌ద్మ‌లీల‌, ఏపిఎంఎస్ఐడిసి డి.ఇ. కుమార్, వైద్య క‌ళాశాల సిబ్బంది పాల్గొన్నారు.


 Comments