జగన్ ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాలకు రాష్ట్రం బలయ్యింది.*జగన్ ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాలకు రాష్ట్రం బలయ్యింది


*


*అసమర్థతతో పోలవరాన్ని.....కక్షతో అమరావతిని నాశనం చేసి రాష్ట్రానికి నష్టం చేశారు*


*అధికారంలోకి వచ్చాక సవాళ్లను అధిగమించి సంపద సృష్టిస్తాం... సంక్షేమం చేస్తాం*


*జల్లికట్టుకోసం తమిళనాడు ఏకం అయ్యింది...రాష్ట్రం కోసం మనం ఏకం కాలేమా?*


*నాకు రాష్ట్రమే ఫస్ట్....దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతా!*


*వాలంటీర్లు కు ప్రజల వ్యక్తిగత సమాచారం ఎందుకు? ప్రజలపై నిఘా పెడతాము అంటే సహించం*


*మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళల జీవితాల్లో పెను మార్పులు*


*మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి):- రాష్ట్ర విభజన సమయంలో ప్రజలు బాధను అనుభవించారు...రాష్ట్రం కూడా నష్టపోయింది...కానీ  రాష్ట్రానికి విభజనతో జరిగిన నష్టం కంటే  వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సిఎం జగన్ మూర్ఖపు నిర్ణయాలకు రాష్ట్రం బలయ్యిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తన అసమర్థతో పోలవరాన్ని....కక్షతో అమరావతిని నాశనం చేశారని చంద్రబాబు అన్నారు. దీని వల్ల అంతిమంగా నష్టపోయింది రాష్ట్రం, ప్రజలే అని ఆయన అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో చంద్రబాబు నాయుడు చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, పాలనా వ్యవహారాలు, ప్రజల సమస్యలు, టీడీపీ నిర్వహించబోయే కార్యక్రమాలపై వారితో తన ఆలోచనలు పంచుకున్నారు.

 

*మహిళల జీవితాలు మార్చేలా మహాశక్తి:-*

మహానాడులో భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బస్సు యాత్ర నడుస్తుందని....మహిళలకు ప్రకటించిన పథకాలపై ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈనెల 14వ తేదీన పార్టీ కార్యాలయంలో మహాశక్తి కార్యక్రమంపై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. బస్సులు, కార్ల ద్వారా మహిళా నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు పర్యటనలు చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా వేలాది గ్రామాల్లో డోర్ టు డోర్ ప్రచారం ఉంటుందని చెప్పారు. అన్ని అంశాలు చర్చించి మహిళలకు సంబంధించి తల్లికివందనం, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆడబిడ్డ పథకం కింద నెలకు రూ. 1500, ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాలు ప్రకటించినట్లు తెలిపారు. ఇవి మహిళల జీవితాల్లో...వారి కుటుంబాల్లో పెనుమార్పులు తెస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయా పథకాల అమలు ప్రభావాన్ని, ఫలితాలను వివరించారు. మహిళలకు ఇప్పుడు ప్రకటించిన పథకాలే కాకుండా...ఇంకా ఏం చేయవచ్చు అనేవిషయంలో కూడా ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. దసరా రోజున పూర్తి మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు  తెలిపారు. 


*సవాళ్లను అధిగమించి...సంపద సృష్టిస్తాం....సంక్షేమం చేస్తాం*

వైసీపీ ప్రభుత్వ విధ్వంసం కారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సవాళ్లు ఉంటాయని...అయితే తనకు ఉన్న బ్రాండ్ తో, పాలసీలతో వేగంగా సంపద సృష్టి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. తద్వారా మెరుగ్గా సంక్షేమ పథకాలు అందిస్తాం అన్నారు. సోలార్ విద్యుత్ ను సమర్థవంతంగా వినియోగించుకుంటే...విద్యుత్ చార్జీలకు తగ్గించవచ్చని తాను గతంలో ప్రణాళికలు రచించి..వాటిని అమలు చేశానని అన్నారు. అందుకే గత ఐదేళ్ల పాలనలో తాము విద్యుత్ చార్జీలు పెంచలేదు అని చెప్పారు. ఇప్పుడు 50 వేల కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీల భారం పడడానికి కారణం జగన్ ప్రభుత్వ విధానాలు కాదా అని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు. సోలార్ ఎనర్జీ విషయంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సూచనలకు అనుగుణంగానే తాను సోలార్ విద్యుత్ ను గత ప్రభుత్వ హయాంలో ప్రొత్సహించినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ వస్తే.....విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని తెలిపారు.

*కక్ష పూరిత రాజకీయాలతో రాజధాని లేని రాష్ట్రంగా ఎపి*


ఒక విజన్ తో నాడు హైదరాబాద్ ను అభివృద్ది చేశామని ఆ ఫలితాలు మన కళ్ల ముందు ఉన్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి రాజధాని మనకు ఉండాలని, పెట్టుబడులకు, ఉద్యోగాల కల్పనకు కేంద్రం కావాలని తాను అమరావతిని తలపెట్టినట్లు చెప్పారు. అయితే జగన్ తన కక్ష పూరిత రాజకీయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని అన్నారు. దీని వల్ల నష్టపోయింది ప్రజలు, రాష్ట్రం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆస్తిని నాశనం చేసే హక్కు జగన్ కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా పడిందని...అది ఎప్పుడు తేలుతుందో తెలీదు అని అన్నారు. ఈ కారణంగా 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేసిన పాపం జగన్ దే అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మారుమూల ప్రాంతంలో కూడా ఎకరం అమ్మితే రూ.50 లక్షలు వస్తుందని...కానీ నేడు ఎపిలో 10 ఎకరాలు అమ్మినా ఆ సొమ్ము వచ్చే పరిస్థితి లేదు అన్నారు. ఒక కియా పరిశ్రమ తెస్తే అక్కడ భూములు రేట్లు పెరిగాయి.....సంపద సృష్టి అంటే ఇదే కదా అని ప్రశ్నించారు. ఒక మూర్ఖుడి నిర్ణయానికి తెలుగు జాతి బలి అవ్వాలా...దీనిపై జనం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. తాను ఈ వ్యాఖ్యలు జగన్ పై ఉక్రోషంతో చేయడం లేదని...జరుగుతున్న నష్టం వల్ల అవేదనతో అంటున్నాను అని చంద్రబాబు అన్నారు. 


*పోలవరం పాపం జగన్ దే*

రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును జగన్ తన అసమర్థతతో నాశనం చేశారని చంద్రబాబు నాయడు అన్నారు. పోలవర పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు నీరు అందేదని అన్నారు. నదుల అనుసంధానంలో భాగంగా తాను ప్రతిపాదించిన ప్రణాళికను చేపట్టి ఉంటే నీటి కరువు అనేది ఉండేది కాదని అన్నారు. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి...నీటిని నింపి ఉంటే...వర్షాభావాన్ని సులభంగా అధిగమించవచ్చు అన్నారు. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకుందని...ఎపి మాత్రం పోలవరాన్ని పూర్తి చేయలేకపోయింది అన్నారు.


*జగన్ తాజా దోపిడీ అనంతపురం లేపాక్షి హబ్*

జగన్ దోపిడికీ హద్దే లేకుండా పోతుందని....ఇసుక, మద్యం, గనులు దోచుకుంటున్నా జగన్ కు చాలలేదని అన్నారు. కృష్ణపట్నం, గంగవరం, దస్ పల్లా భూములు, ఇలా అన్నింటిలోను జగన్ అవినీతికి పాల్పడ్డారు అన్నారు. ఇది చాలదు అన్నట్లు 8 వేల ఎకరాల లేపాక్షి భూములను మింగేశాడని అన్నారు. బెంగుళూరు ఎయిర్ పోర్టుకు దగ్గర్లో 8 వేల ఎకరాలు అంటే కనీసం 10 నుంచి 20 వేల కోట్ల రూపాయాల ఆస్తి అని అన్నారు. ఈ స్దాయి అవినీతికి పాల్పడ్డవారిని మీడియా కూడా గట్టిగా ప్రశ్నించాలని అన్నారు. 


*పెద్ద నోట్ల రద్దు జరగాలి*

ఎన్నికల్లో నోట్ల పంపిణీకి, అక్రమాలకు చెక్ పెట్టాలి అంటే పెద్ద నోట్ల రద్దు జరగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉంటున్నాయి అని ప్రశ్నించారు. జగన్ లాంటి వాళ్లను అడ్డుకోవాలి అంటే ఈ తరహా సంస్కరణలు రావాలి అని అన్నారు.


*దొంగ ఓట్ల పై పోరాటం*

రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారంపై పోరాటం తీవ్రతరం చేస్తాం అన్నారు. దొంగ ఓట్లపై కూడా వైసీపీ ఎదురు దాడి చేస్తోందని...ఆ పార్టీకి అది ఒక్కటే తెలుసని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విషయంలో డిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా వదిలేది లేదు అన్నారు. ఓట్ల అక్రమాలను అడ్డుకోలేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తన నిబద్దతను కోల్పోతుంది అన్నారు.


*వాలంటీర్లతో పొలిటికల్ పనులా?*

రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ తప్పుడు పనులకు, రాజకీయ వ్యవహారాలకు పనిచేయడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టారు. వాలంటీర్లు అంటే ప్రభుత్వ సొమ్ముతో జీతం తీసుకుంటున్నారు...ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ...రాజకీయ పార్టీకి ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్లు ఎలా సేకరిస్తారని...దీన్ని సహించేది లేదు అన్నారు. ప్రతి వ్యక్తి వ్యక్తిగత సమాచారం వాలంటీర్లు సేకరించడం, దాన్ని రాజకీయ పక్షాలతో పంచుకోవడం అత్యంత ప్రమాదకరం అని చంద్రబాబు నాయుడు అన్నారు. వాలంటీర్ల సేవలను గౌరవిస్తాం.....కానీ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తాం, ప్రజలపై నిఘా పెడతాం అంటే సహించబోమని అన్నారు. 


*రాష్ట్రమే నాకు ఫస్ట్*

వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు ఉంటుందా అని చిట్ చాట్ లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తాను ఇప్పుడు పొత్తుల గురించి ఏమీ చెప్పలేనని...తనకు రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలే ఫస్ట్ అని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిన సమయంలో తాను తిరిగి దాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ పొలిటీషియన్ గా అది తన బాధ్యత అని....ఒక వేళ ఆ పని తాను సమర్థవంతంగా చేయలేకపోతే తరువాత ఆ బాధ నాకు ఎప్పటికీ ఉండి పోతుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు.


*పద్మవిభూషన్ కు ఇచ్చే గౌరవం ఇదేనా?*

జగన్ తనను ప్రశ్నించేవారిపై దాడులు చేయడమే విధానంగా పెట్టుకున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి దాడి చేస్తున్నారని...తాను అడిగితే కూడా అదే తీరున వ్యవహరించారని అన్నారు. తాను అడిగాననే ప్రజావేదిక కూల్చివేశారని...తాను ఉంటున్నాను అని అద్దె ఇంటిపై అవినీతి ఆరోపణలు చేసి తనకు మరక అంటించే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను మీడియా సంస్థగా ఈనాడు ప్రశ్నిస్తుందనే అక్కసుతో...మార్గదర్శిపై కేసులు పెట్టారని అన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ చందాదారులకు నోటీసులు ఇవ్వడంపై ఆయన మండి పడ్డారు. అసలు వారిని ప్రశ్నించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. పద్మవిభూషన్ రామోజీ రావు వంటి వారిని గౌరవించుకునే విధానం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. తన వేధింపులకు సహకరించాలని అధికారులపై జగన్ ఒత్తిడి తెస్తున్నారని...ఇందులో భాగంగానే సిఐడి చీఫ్ సంజయ్ అనారోగ్యం పాలయ్యారని అన్నారు.అధికారులు భయంతో నిబంధనలకు విరుద్దంగా జగన్ కోసం పనిచేస్తున్నారని అన్నారు.


దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ చిట్ చాట్ లో మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మీడియా భాగస్వామ్యాన్ని గుర్తు చేశారు. మీడియా వాళ్ళు కేసులకో, ఒత్తిళ్లకో భయపడితే....రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళు అవుతారని చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments