షెడ్యూల్-13 విద్యా సంస్థల్లో త్వరగా మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయండి:సిఎస్

 షెడ్యూల్-13 విద్యా సంస్థల్లో త్వరగా మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేయండి:సిఎస్


అమరావతి,23 ఆగష్టు (ప్రజా అమరావతి):రాష్ట్ర విభజనలో భాగంగా షెడ్యూల్-13లో పేర్కొన్నవిద్యా సంస్థల్లో త్వరిగతిన మౌలిక సదుపాయాల కల్పన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈఅంశంపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా షెడ్యూల్-13లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ కేంద్ర విద్యా సంస్థల్లో జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు రహదార్లు,విద్యుత్,నీటి వసతి,కాంపౌండ్ గోడలు నిర్మాణం వంటి పలు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల ప్రగతిని సిఎస్ సమీక్షించారు.ప్రతి కేంద్ర విద్యా సంస్థ వారీగా మౌలిక సదుపాయాల కల్పన పనుల ప్రగతిని సమీక్షిస్తూ నిర్దేశిత గడువు ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కేంద్ర విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు,ఇతర అంశాలకు సంబంధించి పూర్తి చేయాల్సిన పనులపై జిల్లా కలక్టర్లు,సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం చర్చించుకుని సకాలంలో పనులు పూర్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇకపై ప్రతి నెలా ఆఖరి సోమవారం షెడ్యూల్-13 విద్యా సంస్థల పనుల ప్రగతిని సమీక్షించడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.

తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) పనులు,మౌలిక సదుపాయాల కల్పన పనుల ప్రగతిని సిఎస్ డా.జవహర్ రెడ్డి ఆయా అధికారులతో సమీక్షించారు.అలాగే తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, (ఎన్ఐటి),విశాఖపట్నంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐయం),తిరుపతిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఇఆర్),అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటి(సియుఎపి),కర్నూలులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యు ఫాక్చరింగ్(ఐఐఐటిడియం)సంస్థ పనులను సమీక్షించారు. విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నసెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటి(సిటియుఎపి),అలాగే  విశాఖపట్నంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐపిఇ), మంగళగిరిలో ఏర్పాటైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్),ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలో ఏర్పాటు చేస్తున్ననేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడియం)ల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులపై సమీక్షించారు.

ఈసమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,జిఎడి(ఎస్ఆర్) ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమ్ చంద్రారెడ్డి,రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామల రావు,టిఆర్అండ్బి కార్యదర్శి ప్రద్యుమ్న,పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్,విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బిఆర్.అంబేద్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.వీడియో లింక్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments