స్పందన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి.మచిలీపట్నం ఆగస్టు 7 (ప్రజా అమరావతి):


స్పందన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాల


ని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.


సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శివ నారాయణ రెడ్డి లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి విజ్ఞాపన పత్రాలు  స్వీకరించారు.


ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించారు.   సంబంధిత అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.


జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 185 అర్జీలు స్వీకరించినది.  వాటిలో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:


మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో 10 మంది దివ్యాంగులకు మంజూరైన మూడు చక్రాల మోటారు వాహనాలను పంపిణీ చేయాలని కోరుతూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కృష్ణా జిల్లా కమిటీ కార్యదర్శి ఎన్. సత్యనారాయణ, కెవి రామమూర్తి, ఎం శివశంకరరావు, సిహెచ్ ఆదినారాయణ ప్రసాద్, తదితరులు వినతి పత్రం అందజేశారు


గూడూరు మండలం కలపటం గ్రామానికి చెందిన రైతు మాదాసు అర్జున్ రావు మాట్లాడుతూ మల్లాపూర్ కాలువ ముక్కోలు బ్రాంచ్ కు ఒక చుక్క నీరు విడుదల చేయలేదని ఫిర్యాదు చేస్తూ నీటిని విడుదల చేయాలని కోరుతూ అర్జీని అందజేశారు.


మచిలీపట్నం గ్రామ సచివాలయాలకు చెందిన సంక్షేమ, అభివృద్ధి, డేటా ప్రాసెసింగ్ సహాయకులు తమకు బూతు స్థాయి అధికారులుగా నియమించారని వివిధ రకాలుగా విధులు, ఒత్తిళ్లు వస్తున్నందున ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు.


మచిలీపట్నం సిడింబి అగ్రహారానికి చెందిన పీవీ ఫణికుమార్,  బాలాజీ మరికొందరు మాట్లాడుతూ నగరంలో మంజూరైన రెండు ఎకరాలలో  స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనము, పరిపాలన సముదాయము నిర్మించేందుకు అవసరమైన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం ఇవ్వమని పలుమార్లు కోరినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వడం లేదని  తెలియజేస్తూ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు.


రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృష్ణాజిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు బి సుబ్రహ్మణ్యం పలువురు కార్మికులు మాట్లాడుతూ తమకుమునిసిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్  ఆప్కాస్ సిబ్బందిని  శాశ్వతం చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన విüవేతనం చెల్లించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పింఛను కొనసాగించాలని, పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ కార్మికుల హెల్త్ అలవెన్స్ చెల్లించాలని కోరుతూ అర్జీ అందజేశారు


కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకు సెంటర్ నివాసులు ఆర్ వి వి రామచంద్ర రావు, పొన్నపల్లి వెంకట నాగరాజు, సీతాల తాతాజీ మాట్లాడుతూ అసంపూర్తిగా వదిలివేసిన 216 జాతీయ రహదారి సర్వీస్ రోడ్డును తక్షణం నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకొని ప్రజల ఇబ్బందులను తీర్చాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.


ఈ సందర్భంగా  కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి  వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలన్నారు.

 ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతుంటే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు స్పందన కార్యక్రమానికి రాకపోవడం సరైనది కాదని హెచ్చరిస్తూ ఇకపై పునరావృతం కాకుండా చూడాలని వ్యవసాయ శాఖ డిడి మనోహర్ కు కలెక్టర్ సూచించారు.

  

మచిలీపట్నం నియోజకవర్గంలోని దివ్యాంగులకు మంజూరైన మూడు చక్రాల మోటారు వాహనాలను ఈ వారంలోగా పంపిణీ చేయుటకు తగిన చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ దివ్యాంగులకు తెలిపారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వయోజన వృద్ధులు దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో 9 మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో జ్యోతిబసు, డి ఆర్ డి ఎ డ్వామా పిడిలు పిఎస్ఆర్ ప్రసాద్, జి వి సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, ముడా వీసి రాజ్యలక్ష్మి, డిఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, డీఈవో తెహరా సుల్తానా, వృద్ధులు దివ్యాంగుల శాఖ ఏడి కామరాజు, డి సి హెచ్ ఎస్ ఇందిరా దేవి,  ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు  చంద్రలీల, శ్రీనివాసరావు పంచాయతీరాజ్ ఎస్ ఈ విజయకుమారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


Comments