ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా ఉంది.





- సచివాలయంలో ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం

- సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ సీదిరి అప్పలరాజు, శ్రీ కారుమూరు నాగేశ్వరరావు

- ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా ఉంది


- సాధికారిత కమిటీ నిర్ణయాలతో ధరల స్థిరీకరణ

- రాష్ట్ర వ్యాప్తంగా 1715 ఆక్వా హబ్ లు, 111 అవుట్ లెట్లు ఏర్పాటు

- అర్హత ఉన్న ఆక్వా రైతులకు ఏటా రూ.956 కోట్ల విద్యుత్ సబ్సిడీ

- రాష్ట్రంలో డోమెస్టిక్ మార్కెట్ ను పెంచేందుకు చర్యలు

- రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో చర్చించి రేట్ల ఖరారు

- ఇకపై కౌంట్ వారీగా రేట్లు అమలుకు సన్నాహాలు

- కనీసం పదిరోజుల పాటు ఆ రేటు కొనసాగుతుంది.

- ఎగుమతిదారులు నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేసేలా చర్యలు

- ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించేందుకు చర్యలు

- కేజ్ కల్చర్ పైన కూడా దృష్టి సారించాలి


: సాధికారిత కమిటీ భేటీలో మంత్రులు


అమరావతి (ప్రజా అమరావతి):

ఆక్వా సాధికారిత కమిటీ ద్వారా ఆక్వా ఉత్పత్తులపై సమీక్షించి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులకు మేలు జరుగుతోందని మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ సీదిరి అప్పలరాజు, శ్రీ కారుమూరు నాగేశ్వరరావులు పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం ఆక్వా సాధికారిత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 60 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని అన్నారు. రాష్ట్రానికి కూడా ఆక్వా ఉత్పత్తుల ద్వారా రెవెన్యూ లభిస్తోందని అన్నారు.

గతంలో ఆక్వా ఫీడ్, సీడ్ తయారీదారులు ఇష్టారాజ్యంగా రేట్లను నిర్ణయించడం, ప్రాసెసింగ్ యూనిట్లు కూడా కొనుగోలు రేట్లను తమ నియంత్రణలో ఉంచుకోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయే పరిస్థితి ఉండేదని అన్నారు. ఈ పరిస్థితిని మార్చాలని సీఎం శ్రీ వైయస్ జగన్ గారు ఆక్వా సాధికారిత కమిటీని ఏర్పాటు చేసి, ఆక్వారంగంను ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 

ఆక్వా రంగంలో రేట్లను క్రమబద్దం చేయడం ద్వారా రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. సీడ్, ఫీడ్ రేట్లు హేతుబద్దంగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అలాగే మధ్యదళారీల ప్రమేయాన్ని కట్టడి చేయడం, ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సంయుక్త సమావేశాలు నిర్వహించడం వల్ల ధరలను స్థిరీకరించామని అన్నారు. ఈ సమావేశాల్లో కౌంట్ల వారీగా రేటును ఖరారు చేసి, కనీసం పదిరోజుల పాటు ఆ రేటు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఆక్వారైతుకు విద్యుత్ సబ్సిడీని అందించాలని సూచించారు. ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏటా రూ.956 కోట్లు సబ్సిడీగా ఇస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,754 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, ఈ-ఫిష్ సర్వే ద్వారా 46,455 కనెక్షన్లు యాక్టీవ్ గా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. అర్హతే ప్రామాణికంగా అందరికీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని, దీనిలో ఎక్కడైనా సమస్యలు ఉంటే తక్షణం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఆక్వా ప్రాసెసింగ్ లో కేరళ, గుజరాత్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని, వాటిని పరిశీలించి, రాష్ట్రంలో కూడా ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలని సూచించారు. కేజ్ కల్చర్ ను ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్ట్రంలో ఎనిమిది ఫిషింగ్ హార్బర్ లను సీఎం శ్రీ వైయస్ జగన్ గారు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారని, దీని ద్వారా మెరైన్ ఆక్వా ఉత్పత్తులను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1715 ఆక్వా హబ్ లు, 111 అవుట్ లెట్లు పనిచేస్తున్నాయని, దీనిని మరింతగా పెంచుకోవాలని అన్నారు. ఈ ఆక్వాహబ్ ల ద్వారా జరుగుతున్న టర్నోవర్ పైన కూడా నివేదికను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో యుఎస్ మార్కెట్లు ఓపెన్ అవుతున్నాయని, ప్రస్తుతం ఉన్న ఆక్వా రేటు మరో పది రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని అన్నారు. విదేశీ ఎగుమతుల ద్వారా దేశీయ మార్కెట్ లో ఆక్వా ఉత్పత్తులకు రేట్లు పెరుగుతాయని, దీనివల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ సమావేశంలో స్సెషల్ చీఫ్ సెక్రటరీలు నీరబ్ కుమార్ ప్రసాద్, గోపాలకృష్ణ ద్వివేది, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పర్యావరణశాఖ సిఇ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments