మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోన్న ప్రభుత్వం.


విజయవాడ (ప్రజా అమరావతి);


*మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోన్న ప్రభుత్వం


*


*సెర్ప్ ద్వారా అమలు చేస్తోన్న 4 పథకాలతో రాష్ట్ర మహిళలకు రూ. 64 వేల కోట్లకు పైగా లబ్ధి*


*మహిళా సాధికారతకు అద్దం పడుతున్న వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నావడ్డీ, జగనన్న అమ్మఒడి పథకాలు*


*ప్రతి ఏటా పొదుపు సంఘాలకు సుమారు రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు.. ఎటువంటి పూచీకత్తు లేకుండా ఒక్కో సంఘానికి రూ.20 లక్షల వరకు రుణం.. నూటికి 99.55% రుణాల రికవరీతో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానం.*


*2019 నుంచి ఇప్పటివరకు పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలు అక్షరాలా రూ.1,16,667 కోట్లు*


- *శ్రీ. ఎం.డి. ఇంతియాజ్, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ముఖ్యకార్యనిర్వహణాధికారి (సీఈవో)*


                         ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి లక్ష్యంగా మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని సెర్ప్ సీఈవో ఎం.డి.ఇంతియాజ్ అన్నారు. మంగళవారం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, రెండవ అంతస్తులోని సెర్ప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.


ఈ సందర్భంగా ఎం.డి. ఇంతియాజ్ మాట్లాడుతూ  ప్రతి మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్ది, వారి కుటుంబాల్లో ఆర్థిక సుస్థిరతను, ఆనందాన్ని తీసుకురావడమే లక్ష్యంగా సెర్ప్ పని చేస్తోందన్నారు. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నావడ్డీ, జగనన్న అమ్మఒడి పథకాలు సెర్ప్ ద్వారా విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు వైఎస్సార్ సున్నా వడ్డీ క్రింద రూ.4,969.05  కోట్లు, జగనన్న అమ్మఒడి క్రింద రూ.26,067.28 కోట్లు,  వైఎస్సార్ చేయూత క్రింద రు.14,129 కోట్లు, వైఎస్సార్ ఆసరా క్రింద రూ.19,178 కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మహిళలకు నాలుగేళ్లలో కేవలం ఈ 4 పథకాల ద్వారా మాత్రమే రూ.64,343.33 కోట్ల లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం అందించిందని వెల్లడించారు.


మహిళా సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ఏరియాల్లోని అర్హత గల మహిళా సంఘాలకు వైఎస్సార్ సున్నావడ్డీ ద్వారా ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందన్నారు. ఈ మేరకు వడ్డీ రేట్లు తగ్గించేలా బ్యాంకులను ఒప్పించడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆర్బీఐకి లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం చొరవతో వడ్డీ రేట్లను రూ.3 లక్షల వరకు రుణాలకు 7% గాను, రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు 9% గాను రూ.5 లక్షలకు పైన 9.75% నుంచి 11% వరకు తగ్గించడం జరిగిందన్నారు. గతంలో ఇది 13.50% గా ఉండేదని గుర్తుచేశారు. గడిచిన నాలుగేళ్లలో మహిళా సంఘాలు బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీని వారి తరపున రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు. తద్వారా సుమారు 1.05 కోట్ల మహిళలకు లబ్ధి చేకూరిందని తెలిపారు.. 


ఎస్‌ఎల్ బీసీ నివేదిక ప్రకారం ఏప్రిల్ 11, 2019 ఎన్నికల నాటికి మహిళా సంఘాలకు ఉన్న రూ. 25,571 కోట్ల బకాయిలను వైఎస్సార్ ఆసరా ద్వారా 4  విడతల్లో చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,178 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్నారు. క్రమం తప్పకుండా వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లిస్తున్నందున గతంలో నిర్వీర్యమైన పొదుపు సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారి మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు (NPA) 18.36% నుండి 0.33% కి తగ్గాయని తెలిపారు. గతంలో ‘సి’ మరియు ‘డి’ గ్రేడ్ లోకి దిగజారిన సంఘాలు సున్నావడ్డీ, ఆసరా, చేయూత పథకాలతో తిరిగి ‘ఎ’ ‘బి’ గ్రేడ్ లోకి చేరాయన్నారు. అంతేగాక గతంలో 8.71 లక్షలుగా ఉన్న స్వయం సహాయక సంఘాల సంఖ్య ప్రస్తుతం 11.16 లక్షలకు పెరిగిందని చెప్పారు.

పొదుపు సంఘాలు చేపట్టే వివిధ సుస్థిరమైన ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు కావలసిన పెట్టుబడిని బ్యాంకు లింకేజీ ద్వారా విరివిగా రుణాలను ఎప్పటికప్పుడు బ్యాంకులతో మాట్లాడి మహిళలకు అందించడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం బ్యాంకులు డ్వాక్రా సంఘాలకు రూ.20 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు అందిస్తున్నాయన్నారు. ప్రతి ఏటా రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు సుమారు రూ.30 వేల కోట్లకు పైనే రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. ఈ తీసుకున్న రుణాలను మన సంఘాలు నూటికి 99.55% రికవరీ చేయడంతో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 


వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా లబ్ధితో మహిళలు రిటైల్ రంగంలో 38 వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్స్ ను ఏర్పాటు చేశారని, తద్వారా ఇప్పటివరకు సుమారు రూ.37 కోట్లు మేర అమ్మకాలు చేయడం జరిగిందన్నారు.  వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్స్ ద్వారా పొదుపు సంఘాల తయారు చేస్తున్న ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సుమారు 16 లక్షల మంది మహిళలకు తమ వ్యాపారాలైన రిటైల్, టెక్స్ టైల్స్, పాడి, ఆహార ఉత్పత్తులు మొదలుగు కార్యక్రమాలను అభివృద్ధి చేసుకొనుటకు బ్యాంకుల ద్వారా అదనంగా రూ.5,585 కోట్ల వ్యక్తిగత రుణాలు అందించడం జరిగిందన్నారు. అంతేకాకుండా బిగ్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ లో భాగంగా (ఆగ్రో బేసేడ్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్ టైల్స్ మరియు హ్యాండ్లూమ్స్) రూ.60 కోట్లతో 12 జిల్లాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల నుంచి గ్రామీణ మరియు పట్టణ డ్వాక్రా సంఘాలు రూ.1,16,667 కోట్ల రుణాలు తీసుకున్నాయన్నారు. తద్వారా మహిళలు వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు, వారి జీవనోపాధి మెరుగుపడేలా ఐ.టి.సి, హెచ్.యు.యల్, పి&జి, రిలయన్స్, అమూల్ వంటి  వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నావడ్డీ వంటి పథకాలతో వారి కాళ్ళపై మీద వారు నిలబడేలా చేయడంతో జరుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముందుగానే సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించి క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఇంతియాజ్ ఈ సందర్భంగా వెల్లడించారు.


Comments