గిరిజనులను విజ్ఞానవంతులుగా చేయడమే ఈఎంఆర్ఎస్ లక్ష్యం.

 గిరిజనులను విజ్ఞానవంతులుగా చేయడమే ఈఎంఆర్ఎస్ లక్ష్యం



- అవసరమైతే మరిన్ని ఈఎంఆర్ఎస్ లు


- 20 వేలు గిరిజన జనాభా ఒక బ్లాకుగా..


- ఏపీలో ఇప్పటికే 28 ఈఎంఆర్ఎస్ లు ఏర్పాటు..


- లోక్‌సభలో రాజమండ్రి ఎంపీ భరత్ ప్రశ్నలకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి రేణుకా సింగ్ సరుత సమాధానం


రాజమండ్రి, ఆగస్టు 1 (ప్రజా అమరావతి): ఎక్కడైనా గిరిజన (ఎస్టీ) జనాభా 50 శాతం కన్నా ఎక్కువ అంటే కనీసం 20 వేలమంది గిరిజనులు ఉంటే దానిని ఒక బ్లాక్ గా గుర్తించి..అక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి రేణుకా సింగ్ సరుత తెలిపారు. గిరిజనులను సంపూర్ణ అక్షరాస్యులుగా, విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ 'ఏకలవ్య' రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రధాన ఉద్దేశం అని మంత్రి పేర్కొన్నారు. లోక్‌సభలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఈఎంఆర్ఎస్ ఏర్పాటు, అందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తదితర విషయాలపై అడిగిన ప్రశ్నలకు సంబంధిత కేంద్ర శాఖ మంత్రి రేణుకా సింగ్ సరుత లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018-19లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 (1), ఆర్టికల్ 14 కింద ఈఎంఆర్ఎస్ లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు తెలిపారు. ‌2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో 14 బ్లాకులను గుర్తించి ఆయా బ్లాకులో 14 ఈఎంఆర్ఎస్ లు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు. అవి కాకుండా జనాభా ప్రాతిపదికన మరో 14 ఈఎంఆర్ఎస్ లు కొత్తగా మంజూరు చేశారని...మొత్తం ఏపీలో 28 ఈఎంఆర్ఎస్ లు ఏర్పాటు చేసినట్టు కేంద్ర మంత్రి  రేణుకా సింగ్ సరుతా ఎంపీ భరత్ కు తెలిపారు. ఒక జిల్లాలో ఒకటి కంటే ఎక్కువ బ్లాక్ లలో ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 17, మన్యం పార్వతీపురం జిల్లాలో 5, తిరుపతి జిల్లాలో 2, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కోటి చొప్పున ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని ఆ లేఖలో కేంద్ర మంత్రి రేణుకా సింగ్ సరుత ఎంపీ మార్గాని భరత్ రామ్ కు వివరించారు.

Comments