నిడదవోలు, అనపర్తి రైల్వే స్టేషన్లకు మహర్దశ..

 నిడదవోలు, అనపర్తి రైల్వే స్టేషన్లకు మహర్దశ..



- 'అమృత్ భారత్' పథకం నిధులు రూ.47 కోట్లతో అభివృద్ధి


*ఆగస్టు 6న ప్రధాన మంత్రి మోదీచే వర్చువల్ విధానంలో శంకుస్థాపన*


- ఢిల్లీ నుండి రాజమండ్రి మీడియాకు వివరాలు వెల్లడించిన ఎంపీ భరత్


రాజమండ్రి, ఆగస్టు 1 (ప్రజా అమరావతి): రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గల నిడదవోలు, అనపర్తి రైల్వే స్టేషన్లకు మహర్దశ. ఈ రెండు స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రూ.47 కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి రాజమండ్రి మీడియాకు ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. 'అమృత్ భారత్' పథకంలో భాగంగా నిడదవోలు రైల్వే స్టేషను ను అభివృద్ధి చేసేందుకు రూ.27 కోట్లు, అలాగే అనపర్తి రైల్వే స్టేషను అభివృద్ధికి రూ.20 కోట్లు రైల్వే శాఖ శాంక్షన్ చేసిందన్నారు. ఈ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల‌ 6న వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి, అభివృద్ధి పనులజు శ్రీకారం చుట్టనున్నారని ఎంపీ భరత్ తెలిపారు. రైల్వే శాఖకు ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేయాలని కోరుతూ నేను రాసిన లేఖలపై స్పందిస్తూ

ఇటీవలే రైల్వే శాఖ ఉన్నతాధికారులు నిడదవోలు, అనపర్తి రైల్వే స్టేషన్లను సందర్శించారన్నారు. వారికి ఆయా రైల్వే స్టేషన్లలోని సమస్యలు, ప్రయాణికులకు కావాల్సిన సౌకర్యాలు తదితర విషయాలను సవివరంగా తెలియజేశానన్నారు. ఈ నేపథ్యంలో నిడదవోలు, అనపర్తి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి  'అమృత్ భారత్' పథకంలో నిధులు మంజూరు కావడమే కాకుండా ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం చాలా సంతోషకరమని ఎంపీ భరత్ తెలిపారు.

Comments