వెంగళరాయసాగరం నీరు విడుదల చేసిన డిప్యూటీ సిఎం.*వెంగళరాయసాగరం నీరు విడుదల చేసిన డిప్యూటీ సిఎం*మక్కువ (పార్వతీపురం మన్యం), ఆగస్టు 3 (ప్రజా అమరావతి): వెంగళరాయసాగరం జలాశయం నుండి పంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర నీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మక్కువ మండలంలో జలాశయం వద్ద గురు వారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర మాట్లాడుతూ ప్రతి ఎకరాకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. జిల్లాలో నీటి వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని లాభదాయక పంటలు దిశగా అడుగులు వేయాలని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ పంటకు నీటిని అందించుటకు వివిధ జలాశయాల నుండి నీటిని విడుదల చేశామని ఆయన తెలిపారు. నీటి వనరులలో బంగారు భూములుగా చేయాలని తద్వారా అధిక దిగుబడులు సాధించి ఆదాయం వృద్ది చెంది కుటుంబాల జీవన స్థితిగతులు మారతాయని అన్నారు. రైతులు తమ భూముల్లో ఏ పంట వేయాలి, ఎటువంటి విత్తనాలు వినియోగించాలి, ఏ విధమైన ఎరువులు వాడాలి అని స్పష్టమైన అవగాహన ఉండాలని ఆయన చెప్పారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో వ్యవసాయ సహాయకులు ద్వారా విత్తనం నుండి విక్రయం వరకు సమాచారం అందించే ఏర్పాటును ప్రభుత్వం చేసిందని ఆయన పేర్కొన్నారు. కియస్క్ ల ద్వారా ఎప్పటి కప్పుడు సమాచారం లభిస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కస్టమ్ హైర్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధునిక వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తేవడం జరిగిందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు కుటుంబానికి రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయంను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కల్పిస్తున్నారని ఆయన అన్నారు. సుమారు 63.50 కోట్ల రూపాయల జైకా నిధులతో  ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. హెడ్ వర్క్స్ లో మట్టికట్ట, రక్షణ గోడ, జనరేటర్ రూమ్, గేట్ల మరమ్మతులు, ప్రధాన కాలువ తూములు మరమ్మతులు చేయడం జరిగిందని ఆయన వివరించారు. కాలువల్లో 38.545 కి.మీ. లైనింగ్ పనులకు దాదాపు 9 కి.మీ. లైనింగ్ పనులు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దీని వలన అనవసర లీకులు లేకుండా వృధా నీటిని అరికట్టి చివర భూములకు నీరు సమృద్ధిగా అందించుటకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ పనులు వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి అదనంగా 5 వేల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా చేయడం లక్ష్యంగా నిర్ణయించామని ఆయన అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ కు నవంబర్ 15 నాటికి కాలువలో నీటి సరఫరా నిలిపివేసి ఆధునీకరణ పనులు పునః ప్రారంభిస్తామని రైతులు కాలువ ఆధునీకరణ పనులుకు సహకరించగలరని కోరారు. 


వెంగళరాయసాగరం ప్రాజెక్ట్  పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 1.683 టి.యం.సిలు కాగా 24700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడం జరుగుతోంది. జలాశయం క్రింద మక్కువ మండలంలో 14798 ఎకరాలు, బొబ్బిలి మండలంలో 6178 ఎకరాలు, సీతానగరం మండలంలో 3724 ఎకరాలు సాగు అవుతుంది. కుడి ప్రధాన కాలువ ద్వారా 306 క్యూసెక్లు నీటితో 16150 ఎకరాలకు,  ఎడమ ప్రధాన కాలువ ద్వారా 193 క్యూసెక్లు నీటితో 8550 ఎకరాలకు నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం జలాశయంలో 1.25 టి.యం.సిల నీరు ఉంది. నీరును ఆయకట్టుదారులు పొదుపుగా వాడుకోవడం వలన  ఖరిఫ్ కు నీరు సమృద్ధిగా సరిపోతుంది. 


ఈ కార్యక్రమంలో బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట చిన అప్పల నాయుడు, జెడ్పీటీసీ మావుడి శ్రీనివాస రావు, జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ ఆర్. అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments