అర్చకులకు/ఫౌండర్ ట్రస్టీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు చర్యలు.

 *రూ.5.00 లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాలు 23,600*

*•కోర్టు ఆదేశానుసారం అర్చకులకు/ఫౌండర్ ట్రస్టీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు చర్యలు


*

*•37 ధరఖాస్తులు అందాయి, ధరఖాస్తు చేసుకోని దేవాలయాలు యదాతదంగా కొనసాగుతాయి*

*•హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించేందుకు 7 గురుసభ్యులతో కమిటీ*  

*ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*


అమరావతి, ఆగస్టు 22 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలో 23,600 దేవాలయాలు రూ.5.00 లక్షల లోపు ఆదాయం కలిగిఉన్నవాటిగా గుర్తించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్  సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ప్రతి వారం మాదిరిగానే నేడు దేవాదాయ, ధర్మాదాయ శాఖ  కార్యకలాపాలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు రూ.5.00 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ బాధ్యతను ఫౌండర్ ట్రస్టీలకు / అర్చకులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.  రూ.5.00 లక్షల లోపు ఆదాయం ఉన్నట్లుగా గుర్తించిన మొత్తం 23,600 దేవాలయాలకు గాను ఇప్పటి వరకూ  37 దేవాలయాలకు సంబందించిన ధరఖాస్తులు మాత్రమే అందాయని ఆయన తెలిపారు. అయితే ధరఖాస్తు చేసుకోని దేవాలయాల నిర్వహణ ప్రస్తుతం ఏవిధంగా ఉందో అదే విధంగా కొనసాగుతుందని ఆయన స్పష్టంచేశారు. 


సనాతన హిందూ  ధర్మం యొక్క ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ నెల 6 న అన్నవరంలో  ప్రారంభం అయిన ధర్మ ప్రచార  కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. ఇప్పటికే నిర్ణయించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం  ఈ నెల 14 న శ్రీకాళహస్తిలో నిర్వహించడం జరిగిందని, తదుపరి వరుసగా కాణిపాకం శ్రీ విఘ్నేశ్వర దేవాలయం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయం, ద్వారకా తిరుమల, సింహాచలం తదితర దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది పాటు   హిందూ ధర్మ ప్రచారం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఈ  ప్రచార కార్యక్రమాల నిర్వహణ వల్ల స్థానిక కళాకారులకు చేయూత లభిస్తున్నదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటే కొన్ని ప్రచార మాద్యమాలు పనిగట్టుకుని నా పై వ్యక్తిగత దుష్ప్రచారం చేసే విధంగా ప్రవర్తించడం ఎంతో దురదృష్టకరమైన విషయమన్నారు.


పట్టణాల్లో దేవాదాయ శాఖ సత్రాలు, మఠాలు, ఆలయాలకు సంబందించి అన్యాక్రాతం అయిన వాణిజ్య స్థలాలు, ఇతర ఆస్తుల సమగ్ర వివరాలను సేకరించడం జరుగుచున్నదన్నారు.  దేవాదాయ శాఖ కు చెందిన ఏ భూమి అయినా చట్టపరంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్సు జారీచేయడం జరిగిందని, ఆ ఆర్డినెన్సు ప్రకారం అన్యాక్రాంతం అయిన వాటిని నిలువరించేందుకు, తిరిగి వాటిని స్వాదీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.  అయితే పట్టణాల వారీగా దేవాలయాలు, మఠాలు, సత్రాల వారీగా ఉన్న ఆస్తుల వివరాలపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు.  అదే విధంగా దేవాదాయ శాఖకు సంబందించి దాదాపు 4.60 లక్షల ఎకరాల భూమి, 1.65  కోట్ల గజాల వాణిజ్య స్థలం ఆక్రమణలో ఉన్నట్లు  ఆయన తెలిపారు. 


Comments