లబ్ధిదారుల ఇళ్లకే రేషన్ సరకుల పంపిణీ హర్షించదగ్గ పరిణామం.*లబ్ధిదారుల ఇళ్లకే రేషన్ సరకుల పంపిణీ హర్షించదగ్గ పరిణామం**ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ ఆచరణీయం*


*లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందిస్తున్న ప్రభుత్వానికి అభినందన*


*కర్ణాటక రాష్ట్రంలో ఈ తరహా విధానాన్ని అమలు చేస్తామని వెల్లడి*


-  *కర్ణాటక రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖామాత్యులు కె.హెచ్. మునియప్ప*


విజయవాడ (ప్రజా అమరావతి) అని: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్లకే అందిస్తున్న విధానం వినూత్న ప్రయత్నమని, ఆచరణీయమని కర్ణాటక రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖామాత్యులు కె.హెచ్. మునియప్ప ప్రశంసించారు. వ్యక్తిగత పనులపై విజయవాడ వచ్చిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయంను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మునియప్పకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పుష్పగుచ్ఛం అందించి కార్యాలయంలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం గోడౌన్, ఎండీయూ వాహనం, పంపిణీకి సిద్ధంగా ఉన్న రేషన్ సరుకులను కె.హెచ్. మునియప్ప పరిశీలించి లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులను అందిస్తున్నందకు అభినందనలు తెలిపారు. అంతే గాక రాయలసీమ జిల్లాల్లో పంపిణీ చేస్తున్న రాగులు, జొన్నలు పరిశీలించి ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను కొనియాడారు. రేషన్ సరుకుల్లో ఫోర్టిఫైడ్ బియ్యం అందించటం వల్ల లబ్ధిదారులకు పుష్కలంగా పోషకాహారం అందుతుందని, మధ్యాన్న భోజనంలో చిన్నారులకు ఫోర్టిఫైడ్ బియ్యంతో చేసిన అన్నం వడ్డించటం వల్ల వారు మరింత ఆరోగ్యంగా ఉంటారని మెచ్చుకున్నారు. బాలింతలు, గర్భిణీలు ఫోర్టిఫైడ్ బియ్యం తీసుకోవటం వల్ల రక్తహీనత తదితర వ్యాధులు దరిచేరవన్నారు. రేషన్ ద్వారా పంపిణీ చేస్తున్న గోదుమపిండి తదితర సరుకుల నాణ్యత మెరుగ్గా ఉందని అన్నారు.  


ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న విధానంపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ను పలు వివరాలు మునియప్ప అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహనాలను పరిశీలించి ఈ పద్ధతి ఎంతో చక్కగా ఉందని తమ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ తరహా విధానం అమలు చేయటానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కె. హెచ్. మునియప్పను సత్కరించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Comments