పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానంపై పరిశీలన చేసి నివేదిక సమర్పించండి.

 ఉద్యోగుల ఇళ్ళ స్థలాలపై సిఎస్ సమీక్ష.


పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానంపై పరిశీలన చేసి నివేదిక సమర్పించండి.విజయవాడ,12 ఆగష్టు (ప్రజా అమరావతి):రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంపై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.

ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వివిధ ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీగా ఇళ్ళ స్థలాలకు ఎంత మేర భూమి అవసరం ఉంది పరిశీలన జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్ కు సిఎస్ సూచించారు. అంతేగాక ఈవిషయమై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ళ స్థలాలు అంశంపై ముఖ్యమంత్రి వర్యులు సమీక్షించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు.


పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి సూచించారు.దానివల్ల పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళు లేనివారు, ఇళ్ళు ఉన్నా రోడ్లు,పుట్ పాత్ లు,కాలువలు,డ్రైన్లు వంటి వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చిన్న చిన్న గుడిసెలు,గుడారాలు వంటివి ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే వారిని కట్టడి చేసి వారికి ప్రభుత్వమే పబ్లిక్ హౌసింగ్ విధానంలో నిర్మించిన ఇళ్ళలో నివసించేలా చేయవచ్చని తెలిపారు.దాంతో పట్టణాలను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ద వఛ్చని సిఎస్ పేర్కొన్నారు.దీనిపై అన్ని పట్టణాల్లో పరిశీలన జరిపి సియం సమావేశం నాటికి ఒక నివేదికను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి రెవెన్యూ,మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు.


ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల ఇళ్ళ స్థలాలపై ఉద్యోగ సంఘాల ప్రతి నిధులతో మాట్లాడి వారి నుండి వివరాలు సేకరించి నివేదిక సమర్పిస్తానని చెప్పారు.ఇంకా ఉద్యోగుల ఇళ్ళ స్థలాలపై ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై పరిశీలన చేసి నివేదిక సమర్పిస్తానని చెప్పారు.ఈసమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు,గృహ నిర్మాణ సంస్థ ఎండి. డా.లక్మీషా,సిఆర్డిఏ అదనపు కమీషనర్ అలీమ్ భాషా, దివాన్ మైదీన్,జెడి డేవిడ్ రాజు,అదనపు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రవీంద్ర బాబు,తదితర అధికారులు.


Comments