అధికారం అంటే ఆజమాయిషీ చేయడం కాదు.

 అమరావతి (ప్రజా అమరావతి);


*అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం కూడా ఇచ్చి మరీ ఏడాదికి రెండు పర్యాయాలు లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వం.*


*డిసెంబరు 2022 నుంచి జూలై 2023 వరకు అమలైన వివిధ సంక్షేమపథకాలకు సంబంధించి ఏ కారణంచేతనైనా లబ్ది అందని 2,62,169 మంది అర్హులకు లబ్ధి చేకూరుస్తూ...  క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో  రూ.216.34 కోట్లు  జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.**ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


*అర్హులు మిస్‌ కాకూడదన్న తపనతో....*

దేవుని దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. ఇంటింటా, మనిషి, మనిషికీ మంచి చేస్తున్న ప్రభుత్వం, అలా మంచి జరగాలని తాపత్రయపడుతున్న ప్రభుత్వం మనది. ఎక్కడా లంచాలకు తావులేకుండా, వివక్షకు ఏమాత్రం చోటు ఇవ్వకుండా, కులం, మతం, ప్రాంతం చూడకుండూ.. చివరికి  ఏ రాజకీయ పార్టీ అన్న ప్రస్తావన చూడకుండా.. మనకు ఓటు వేయకపోయిన  ఫర్వాలేదు, అర్హత ఉంటే కచ్చితంగా అందించాలి, ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదు అన్న  తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్న పాలనే.. ఈ నవరత్నాల పాలనే.


ఏ పధకంలోనైనా అర్హత ఉండి, ఏ కారణంతో అయినా అందాల్సిన మంచి అందకపోయిన పరిస్థితులు ఉంటే.. అలాంటి వారికి న్యాయం చేస్తూ.. మంచి చేయడానికి మరోక్కసారి అవకాశం ఇస్తున్నాం. ఏ కారణం చేత అయినా ఆ రోజు మీకు అందకపోయి ఉంటే కంగారు పడకుండా మరలా మీరు దరఖాస్తు పెట్టుకొండి, పథకం వచ్చిన నెలరోజుల వరకూ మీకు అవకాశం ఇస్తున్నాం. మరలా వెరిఫికేషన్‌ చేయించి...  మీకు ఆ పథకం వచ్చేట్టు మిమ్నల్ని చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది అన్న మాట ప్రకారం ఇవాళ ఆ లెఫ్ట్‌ ఓవర్‌ బెనిఫీషియర్స్‌ కోసం  ఈ కార్యక్రమం జరుగుతోంది.  


*అధికారం అంటే ఆజమాయిషీ చేయడం కాదు.*అధికారం అంటే ప్రజల పట్ల మమకారం చూపడం. అధికారం అంటే ప్రజలకు మంచి చేయడం కోసం నాలుగు అడుగులు ముందుకువేసే బాధ్యత అని మరొక్కసారి ఆ బాధ్యతను తల్చుకుంటూ.. గత ఆరునెలలుగా వివిధ కారణాల వల్ల వివిధ పథకాలకు సంబంధించి అందుకోలేని 2.62 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు మరలా రీ వెరిఫికేషన్‌ చేసి వారికి అవకాశం కల్పిస్తున్నాం. రూ.216 కోట్లు నేరుగా బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబసభ్యుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 


*కొత్త ఫించన్‌, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు సైతం మంజూరు...*

అంతే కాకుండా... ఈ ఆరునెలల పీరియడ్‌లో కొత్తగా ఫించన్‌ కార్డులు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్ధలాలకు సంబంధించి కూడా కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే... వీటి వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేసుకుని.. వాటిని మంజూరు చేసే కార్యక్రమం కూడా ఇవాళ జరుగుతుంది. 


కొత్తగా మరో 1,49,875 మందికి పెన్షన్లు కూడా మంజూరు చేస్తున్నాం. వచ్చే నెల నుంచి వీరికి పెన్షన్లు కూడా అందుతాయి. అదే విధంగా 2,00,312 మందికి కొత్తగా బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నాం. వీరికి వచ్చే నెల నుంచి రేషన్‌ అందుతుంది. అదే మాదిరిగా 4,327 మంది ఆరోగ్యశ్రీ కార్డులు, 12,069 మందికి ఇళ్ల స్ధలాలు కూడా ఇస్తున్నాం.*64.27 లక్షల పెన్షన్‌లు.....*

పెన్షన్‌లకు సంబంధించి 1,49,875 మందికి కొత్తగా పెన్షన్‌లు ఇవ్వడంతో.. రాష్ట్రంలో మొత్తం పెన్షన్ల సంఖ్య దాదాపుగా  64.27 లక్షలకు చేరుకుంది.   

గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ఆరు నెలల మందు వరకు అంటే అక్టోబరు 2018 వరకు కేవలం 39 లక్షలు మాత్రమే ఉంటే... ఈ రోజు పెన్షన్ల సంఖ్య 64.27 లక్షలకు పెరిగింది. అప్పట్లో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే 4 సంవత్సరాల పది నెలల కాలం కేవలం రూ.1000 మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంటే.. ఇవాళ రూ.2750 పెన్షన్‌ ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా మంజూరు చేసిన 2,00,312 కార్డులతో కలుపుకుంటే.. మొత్తం బియ్యం కార్డుల సంఖ్య 1,48,12,934కు పెరిగింది. అదే విధంగా ఇవాళ కొత్తగా మంజూరు చేస్తున్న 4,327 ఆరోగ్యశ్రీ కార్డులతో కలుపుకుంటే... ఆరోగ్యశ్రీ కార్డుల సంఖ్య కూడా 1,42,15,820 కు చేరింది. అలాగే ఈ రోజు మంజూరు చేస్తున్న ఇళ్ల పట్టాలు 12,069 కలుపుకుంటే... మొత్తం ఇళ్ల పట్టాల సంఖ్య 30,84,935కు చేరుతుంది.  


వివిధ పథకాలకు సంబంధించి గత ఆరునెలల్లో అర్హత ఉండి వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన ఈ 2.62 లక్షల మందికి ఇవాళ మరలా అవకాశం కల్పిస్తూ.. మంజూరు చేస్తున్నాం.

జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా 43,170 మందికి మరలా బెనిఫిట్‌ ఇస్తున్నాం. 207 మందికి వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా అందిస్తున్నాం. వివిధ సాంకేతిక కారణాల వల్ల గతంలో  సున్నావడ్డీ పంటరుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందని 1,08,000 మంది రైతులకు .. సాంకేతక అంశాలను సరిదిద్ది నేడు వారికి అందిస్తున్నాం. జగనన్న విద్యాదీవెనలో మరో 32,770 మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన ద్వారా  36,898 మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 8,753 మందికి, 267 మందికి వైయస్సార్‌ నేతన్న నేస్తం కింద, జగనన్న అమ్మఒడి కింద 16,717 మందికి ... మొత్తంగా 2.62 లక్షల మందికి వివిధ కారణాల వల్ల ఆయా పథకాలు అందలేకపోయిన వారికి అందరికీ మరలా అవకాశం ఇచ్చి ఆ పథకాలను అందిస్తున్నాం.                                                                                        *జగనన్న సురక్ష–  94,62,184 మందికిసర్టిఫికేట్లు..*

వీటితో పాటు ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్టు సచివాలయాల పరిధిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రతి ఇంటికీ వెళ్లి... జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ పథకాలకు అర్హులైన వారెవరూ మిగిలిపోకూడదన్న తపనతో జగనన్న సురక్ష చేపట్టాం. ఇందులో భాగంగా 94,62,184 మందికి రకరకాల సర్టిఫికేట్లు ఇవ్వడంతో పాటు.. ఇలా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు 12,405 మంది అర్హులై ఉండి వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన వారికి కూడా లబ్ధి చేకూర్చున్నాం. 


జగనన్నకు చెబుదాం  కార్యక్రమం ద్వారా... కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసిన 1630 మంది కూడా అర్హులని తేలడంతో వారికి కూడా మంచి జరిగించే కార్యక్రమం చేస్తున్నాం.  ఏ ఒక్కరూ అర్హత ఉండి మిస్‌ కాకూడన్న తపన, తాపత్రయంతో ఇవాళ వీరందరికీ మంచి చేసే కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. 


దేవుడి దయతో వీళ్లందరికీ ఇంకా మంచి జరిగే పరిస్థితి రావాలని, దేవుడు మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

Comments