అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష.*అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష**భద్రత,  వసతుల ఏర్పాట్లపై చీఫ్ విప్, విప్ లతో చర్చించిన మంత్రి బుగ్గన*


అమరావతి, సెప్టెంబర్, 15 (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ శాసనసభ స‌మావేశాలు సెప్టెంబర్ 21వ తేదీన  ప్రారంభమవనున్నట్లు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సమావేశాల ఏర్పాట్లపై అసెంబ్లీలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ నుంచి శాసనసభ ఉదయం 9గం.లకు, శాసన మండలి సమావేశాలు 10గం.లకు ప్రారంభమవుతాయని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రత,  వసతుల ఏర్పాట్లు, తదితర విషయాలపై చీఫ్ విప్ , విప్ లతో  చర్చించారు. అదే రోజు శాసనసభ వ్యవహారాల  కమిటీ సమావేశం, ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చ జరగాలనే అంశాలపై నిర్ణయం జరుగుతుందన్నారు. శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని బుగ్గన తెలిపారు.  గతంలో లాగానే ఈ సమావేశాలకు అధికార యంత్రాంగం పూర్తి సహకారం అందించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షలో చీఫ్ విప్ ముదునూరి నాగరాజ వర ప్రసాద రాజు, విప్ లు జంగా కృష్ణమూర్తి, కాపు రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.Comments