రాష్ట్రం కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా.?

                         

*రాష్ట్రం కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా.?**ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ*


*సింహంలా బయటకొచ్చి మీకోసం మళ్లీ పని చేస్తారు*


*ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం కాదు మాది*


*మద్ధతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు*


*జగ్గంపేట నిరసన దీక్షలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి*


జగ్గంపేట (ప్రజా అమరావతి):- రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని అన్నారు.  ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసత దీక్షలో సొమవారం భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన అనంతరం ఆమె ప్రసంగించారు. 

‘‘చంద్రబాబు సింహంలా బయటకు వచ్చి మీ కోసం మళ్లీ పని చేస్తారు.   

ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉంది. ప్రజల్ని ముందుకు నడిపించడమే చంద్రబాబు లక్ష్యం.

అవినీతి మరక అంటించి 17 రోజులుగా జైల్లో పెట్టారు. ఆయనేం తప్పు చేశాడని జైల్లో నిర్బంధించారు.? ప్రజల సొమ్ము ఆయనేమీ తీసుకోలేదు..మా కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరం లేదు. నేను హెరిటేజ్ కంపెనీ నడుపుతున్నా..అందులో 2 శాతం అమ్ముకున్నా రూ.4 వందల కోట్లు వస్తాయి. 

మీ అందరికీ ఎన్టీఆర్ తెలుసు..సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు అని నమ్మే వ్యక్తి. అలాంటి వ్యక్తి నీడలో నేను పెరిగాను. నేను, బ్రాహ్మణి ఏనాడూ బయటకు రాలేదు.. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నాను. 

మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం కంటే ఎన్టీఆర్ ట్రస్టు ముందుంటుంది.  సొమ్ముకోసం కాదు..మీకోసం, ప్రజల కోసం మేము వస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 2 వేల మంది అనాథ పిల్లలను ఉచితంగా చదివిస్తున్నాం..అలాంటి సేవే మాకు ఎన్టీఆర్ చూపించిన మార్గం. 

చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు..ప్రజలు అనే తపిస్తుంటారు. ప్రజలకు ఏం చేద్దాం అన్నదానిపై ఆయన ఆలోచిస్తారు. 

హైదరాబాద్ లో రాళ్లు, రప్పలున్న ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మించారు. కనీసం సదుపాయాలు లేని ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటని ఆనాడు అందరూ నవ్వారు..కానీ ఇప్పుడు అక్కడ వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. చంద్రబాబు సంపద సృష్టించే నాయకుడు. 

కానీ నేడు ఆయన్ను జైల్లో నిర్బంధించారు. కుటుంబం ఏమైనా పర్వాలేదు..ప్రజలు ముందు అని ఆలోచించే వ్యక్తిని జైల్లో పెట్టినందుకు బాధ కలుగుతోంది. 

బ్రిటిష్ పాలకుల కాలంలో మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తులు జైలుకు వెళ్లారు..ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజల కోసం జైలుకు వెళ్లారు. రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటం తప్పా.? 

స్కిల్ డెవలెప్మెంట్ ద్వారా లబ్ది పొందిన వారు ఉన్నత స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు..యువత జీవితాలు మార్చడం తప్పా.? 

మా కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం వస్తుంటే పోలీసులు భయపెట్టి ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సెల్ ఫోన్లు కూడా లాక్కున్ని వారి సమాచారం తెలుసుకున్నారు..దీన్ని నేను ఖండిస్తున్నా. 

తెలంగాణ నుండి ఏపీకి రావడానికి  వీసా కావాలా.? ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలకు ఎక్కడికైనా వెళ్లే హక్కుంది. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఎప్పుడూ బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం బయటకు వచ్చారు. 

మహిళల్లో ఝాన్సీ, దుర్గాదేవి శక్తి ఉంది..  మనందరినీ ముందుకు నడిపిస్తారు. మీ ప్రేమ, అభిమానం చంద్రబాబుకు కొండంత బలం. ప్రభుత్వం అనవసరంగా రెచ్చగొడుతోంది..ఆయన సింహంలా బయటకొచ్చి మళ్లీ మీకోసం పని చేస్తాడు.’’ అని భువనేశ్వరి అన్నారు.

*అన్నవరం సత్యనారాయణస్వామికి ప్రత్యేక పూజలు*

జగ్గంపేట నిరసన దీక్షలో పాల్గొనకముందు అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి వారిని నారా భువనేశ్వరి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జ్యోతుల నవీన్, ఎన్.ఎస్.వీ.వర్మ, యనమల దివ్య, యనమల కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు.

Comments