స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి సకాలంలో పరిష్కరించాలి.

 


మచిలీపట్నం, సెప్టెంబర్ 4 (ప్రజా అమరావతి);


స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చి సకాలంలో పరిష్కరించాలని


జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.


సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, ఆర్డిఓ ఐ కిషోర్లతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి పలు ప్రాంతాల ప్రజల నుండి వినతి పత్రాలు  స్వీకరించారు.


ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఎంతో ఓపికగా ఆలకించారు.   సంబంధిత శాఖల అధికారులను పిలిపించి అర్జీల పరిష్కారంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.


ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం స్వీకరించిన కొన్ని అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి.


మండల కేంద్రమైన కృత్తివెన్ను గ్రామానికి చెందిన నేండ్రు సత్యనారాయణ, అడబాల నాగేశ్వరరావు, గుడియాల లక్ష్మి తదితరులు మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ లోని 181, 182  ఫ్లాట్లను కాలనీ వాసులు కమ్యూనిటీ హాలుగా నిర్ణయించుకున్నామని, ఆ ఫ్లాట్లను సీతనపల్లి విఆర్ఓ తమ్మినిడి నాగరాజు  ఆక్రమించుకున్నారని, ఆ ఫ్లాట్లను ఖాళీ చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.


మచిలీపట్నం నగరం గొడుగుపేటకు చెందిన పెండ్యాల రఘు,  జే. రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ డాక్టర్ జగన్ మోహన్ రావు వీధిలో ఘంటసాల వారి పాడుబడిన ఇంటి స్థలం వారసులు ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ స్థలంలో నీరు నిలిచి, పిచ్చి మొక్కలు, గొంగళి పురుగులు, దోమలు,పాములు  పెరిగి మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాల బారిన పడుతున్నామని, అక్కడి నుంచి మురికి నీరు తొలగించాలని తాము అనారోగ్యం పాలు కాకుండా కాపాడాలని కోరుతూ అర్జీ అందజేశారు.


ఈ సందర్భంగా  కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఎంతో శ్రమకోర్చి  వ్యయప్రయాసలతో జిల్లా కేంద్రానికి వస్తున్నారని స్పందన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సానుకూలంగా పరిష్కరించాలన్నారు.


కోర్టు కేసుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండి సకాలంలో  కౌంటర్  అఫిడవిట్లు దాఖలు చేయాలని  సూచించారు.


ముఖ్యంగా పంచాయతీరాజ్, రెవెన్యూ, పురపాలక శాఖల్లో కోర్టు ధిక్కరణ కేసులు వచ్చి  కలెక్టర్ను కోర్టుకు హాజరుకమ్మని ఆదేశాలు రావడం సరైనది కాదన్నారు. ఇకపై ఎవరు కూడా కోర్టు కేసుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ న్యాయవాదులతో సంప్రదించి కౌంటర్లను సకాలంలో దాఖలు చేయాలని, లేని పక్షంలో బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూసేకరణ, రీ సర్వే, స్థూల నమోదు నిష్పత్తి, జగనన్న పాల వెల్లువ, గృహ నిర్మాణం, ఉపాధి హామీ, ప్రాధాన్యత భవనాల నిర్మాణం, జగనన్నకు చెబుదాం

తదితర అంశాలపై క్రమంతప్పకుండా సమీక్షిస్తున్నారని అందుకు సంబంధించిన పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలన్నారు.


విద్యాశాఖలో స్థూల నమోదు నిష్పత్తి సర్వే కార్యక్రమాన్ని ఒక వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు


ఆర్డీవోలు, తహసిల్దార్లు రెవెన్యూ శాఖ పరిధిలో ముటేషన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు.


రి సర్వే కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేసి  సరిహద్దురాళ్ళను నాటాలన్నారు.


జిల్లా ఇన్చార్జి మంత్రితో పామర్రు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను వెంటనే పంపాలన్నారు. త్వరలో గన్నవరం, పెనమలూరు, పెడన నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తామన్నారు.


జిల్లాలో కారుణ్య నియామకాలను చేపట్టేందుకు  వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను వెంటనే పంపించాలన్నారు.


అనంతరం వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో ఈనెల 8 వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని రూపొందించిన గోడపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారుఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి పి ఎస్ ఆర్ ప్రసాద్, ముడా విసి రాజ్యలక్ష్మి, డిఎం హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, డీఈవో తహేరా సుల్తానా, డి సి హెచ్ శ్రావణ్ కుమార్,సర్వే భూ రికార్డుల ఏడి రంగారావు, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు ఐసిడిఎస్ పిడి సువర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, ఉద్యాన అధికారి జే.జ్యోతి,ఐసీడీఎస్ పీడీ సువర్ణ,  పంచాయతీరాజ్ ఎస్ఈ విజయ్ కుమారి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments