కలెక్టర్ చొరవతో దశాబ్దాల నాటి పేదల సమస్య పరిష్కారమైన వైనం.

 పుట్టపర్తి నియోజకవర్గం


కలెక్టర్ చొరవతో దశాబ్దాల నాటి పేదల సమస్య పరిష్కారమైన వైనం




కలెక్టర్ ఆదేశాలతో ఆగమేఘాలమీద రెవిన్యూ అధికారులు జనన ధ్రువీకరణ పత్రాలు అందజేత


సంచార జాతుల వారు ఆధార్ కార్డులు పొందటానికి అవకాశం


పేదల ముఖాల్లో ఆనందం


 పుట్టపర్తి, సెప్టెంబర్ 6 (ప్రజా అమరావతి): దశాబ్దాల కాలం నుంచి జనన ధ్రువీకరణ పత్రాలు ఆధార్ కార్డులు లేక సంచారజాతుల వారు ఎటువంటి సంక్షేమ పథకాలలో పొందలేక పేద పరిస్థితిలోనే మగ్గుతున్న విషయాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు స్పందించడంతో దశాబ్దాల కాలంనాటి సమస్య పరిష్కారమైంది. వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రమైన కొత్తచెరువులో దాదాపు 73 మంది దాకా సంచార జాతి వారు ఉన్నారు. వీరు దశాబ్దాల క్రితం  చిలమత్తూరు, కర్ణాటక  సరిహద్దు,ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కొత్త చెరువులో గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. పల్లెల మీద వెళ్లి వ్యాపారాలు చేసుకొని వచ్చి ఇక్కడే సంసారాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి స్థిర నివాసం లేకపోవడంతో ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు పొందలేకపోయారు. ఆధార్ కార్డు లేని కారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు అందుకోలేకపోయారు. జనన ధ్రువీకరణ పత్రం లేనందున ఆధార్ కార్డు పొందే అవకాశం ఉండదు. మొదట జనన ధ్రువీకరణ పత్రం తీసుకుంటేనే ఆధార్ కార్డును తీసుకోవచ్చు. దశాబ్దాల నుంచి వీరి సమస్య అలాగే కొనసాగుతూ వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్న వీరికి ఓటు లేని కారణంగా వీరిని గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు,

ఎటువంటి సంక్షేమ పథకాలు పొందలేక పేదరికంలోనే మగ్గుతున్నారు. ఎట్టికెలకు వీరందరూ కలిసి శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు దృష్టికి  సోమవారం స్పందన సమయంలో వారి సమస్యలు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వీరికి తక్షణమే జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసి, ఆధార్ కార్డు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక రెవిన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు ఆగ మేఘాల మీద జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. మొత్తము 74 మందికి జనన ధ్రువీకరణ పత్రాలను మంగళవారం/ బుధవారం కొత్తచెరువులోని పంచాయతీ కార్యాలయం వద్ద అందజేశారు. జనన ధ్రువీకరణ పత్రాలు మంజూరు కావడంతో ఆధార్ కార్డులు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. దీంతో దశాబ్దాల నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు పొందలేకపోయినా పేద ప్రజల ముఖాల్లో ఆనందం వ్యక్తం అయింది.


జిల్లా కలెక్టర్ చొరవతో సమస్య పరిష్కారమైందన్న  క్రిష్టప్ప:- 45 సంవత్సరాలు వయసు ఉన్న ఇంతవరకు తనకు ఆధార్ కార్డు లేదని భావన అనే  కృష్ణప్ప తెలిపారు. ఆధార్ కార్డు సెంటర్ వద్దకు వెళ్తే జనన ధ్రువీకరణ పత్రం లేనందున ఆధార్ కార్డు తీయడం వీలు కాదని చెప్పారన్నారు. ఇంతవరకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో కలెక్టర్ సార్ కృషివల్లే జనన ధ్రువీకరణ పత్రాలు పొందామని ఆయన ఆనందం వ్యక్తపరిచారు.


 సుంకమ్మ వయసు 60 సంవత్సరాలు దాటిన ఇంతవరకు ఎటువంటి సంక్షేమ పథకాలు పొందలేదు. పింఛను గాని ఇతర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకము పొందలేదని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. ప్రతి పథకానికి ఆధార్ కార్డు అవసరమున్నందున ఆధార్ కార్డు లేకపోవడంతో పథకాలు రాలేదని కనీసం రేషన్ కార్డు కూడా లేదని వా పోయారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇప్పుడు అధికారులు జనన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని, వీటి ద్వారా ఆధార్ కార్డు వస్తుందన్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని అధికారులు పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


 గంగ వయసు 23 సంవత్సరాలు కానీ ఇంతవరకు జనన ధ్రువీకరణ పత్రం కానీ ఆధార్ కార్డు లేనందున ఇంటి స్థలం పొందలేక గుడిసెల్లోని నివాసం ఉంటున్నాడు. శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం జరిగిన జనన ధ్రువీకరణ పత్రం పొందానని ఆధార్ కార్డు తీయించుకుంటానని ప్రభుత్వం స్పందించి ఇంటి పట్టా మంజూరు చేయాలని కోరారు.  కలెక్టర్  మండల రెవెన్యూ అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


 కడప జిల్లాలోని కమలాపురం కు చెందిన కుమారి మాట్లాడుతూ  నేను నా భర్త పది సంవత్సరాల నుండి గుడిసెలో నివసించుచున్నామని, నిన్నటి రోజున నా బిడ్డకు, నా భర్తకు నాకు, ఆధార్ కార్డు అందజేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


 

Comments