స్కిల్ యూనివర్స్' పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు : నైపుణ్యాభివృద్ధి,శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.

*'స్కిల్ యూనివర్స్' పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు : నైపుణ్యాభివృద్ధి,శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలలో అధ్యాపక నియామకాలకు దిశానిర్దేశం*


*విజయవాడ  క్యాంపు కార్యాలయంలో  మంత్రి బుగ్గన అధ్యక్షతన సమీక్ష*


అమరావతి,సెప్టెంబర్,08 (ప్రజా అమరావతి); 'స్కిల్ యూనివర్స్' పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. పులివెందుల న్యాక్ సెంటర్, పీఏడీఏ(పడ) యువతకు మరింత ఉపయోగపడేలా మంత్రి ఆదేశాలు ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతోన్న ఈ డాష్ బోర్డును త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ఆటోనగర్ లోని  క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన అధ్యక్షతన శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ట్రైనింగ్, ప్లేస్ మెంట్ లకు సంబంధించిన సమగ్ర  సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్ సంయుక్త శిక్షణ వివరాలు  పోర్టల్ లో అప్ లోడ్ చేసేలా కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర యువతీ, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునే వారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో ప్లేస్ అయినవారు; ఇలా సమగ్ర సమాచారం ఆన్ లైన్ పోర్టల్ లో అప్ డేట్ చేయనున్నట్లు మంత్రి వివరించారు. యువత నమోదు చేసిన వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్ వీటే(రెజ్యుమె) తయారయ్యే అత్యాధునిక వెసులుబాటు కల్పిస్తున్నట్లు డాష్ బోర్డు సౌకర్యాల గురించి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మంత్రికి తెలిపారు. ఆధార్ లాగ్ ఇన్, కాప్చ పాస్ వర్డ్ తో ఎవరైనా సులభంగా లాగిన్ అయ్యేలా  తీర్చిదిద్దుతున్నామని  ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్ కుమార్ మంత్రి బుగ్గనకు వివరించారు. వెబ్ పోర్టల్ పై తుది కసరత్తు జరుగుతుందన్నట్లు తెలిపారు.  వాటర్ మేనేజ్ మెంట్&ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్ లో  ఏపీఎస్ఎస్డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. ఈ సందర్బంగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కార్యదర్శులు, ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. 


*సాంకేతిక విద్య, ఉపాధి శిక్షణపైనా మంత్రి బుగ్గన సమీక్ష*


 సాంకేతిక, నైపుణ్య విద్య నేర్చుకునే యువతీయువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ల్యాబ్ టెక్నిషిన్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఆవశ్యకతే ప్రామాణికంగా ఔట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగాల ప్రాధాన్యత తెలిసేలా ఒక నివేదిక అందించాలని ఉపాధి, శిక్షణ శాఖ, సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్లను మంత్రి బుగ్గన ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు, హాస్టల్ లలో తక్షణం చేపట్టాల్సిన నియామకాల వివరాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాగరాణి మంత్రి బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ల నియామకానికి చొరవ చూపాలని  ఉపాధి,శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య మంత్రిని కోరారు. మంత్రి బుగ్గన సానుకూలంగా స్పందిస్తూ ..తన సూచనల మేరకు ఉద్యోగాలపై స్పష్టమైన జాబితా సిద్ధం చేయాలని మంత్రి బుగ్గన మార్గనిర్దేశం చేశారు.


ఈ సమీక్షా సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సాంకేతిక విద్య శాఖ డైరెక్టర్ నాగరాణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్, ఉపాధి,శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థసారధి, ఏపీఎస్ఎస్డీసీ ఈడీ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.Comments