రక్తహీనత లేని సమాజ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలి !



మచిలీపట్నం: సెప్టెంబర్ 22 , (ప్రజా అమరావతి);



*రక్తహీనత లేని సమాజ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలి !


!*


 *-- జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు*



*ఎనీమియా రిడక్షన్ వర్క్ షాప్ లో పలు సూచనలు* 




రక్తహీనత లేని సమాజ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని, కోవిడ్ -19 సమయంలో ఎంత అప్రమత్తంగా, శ్రద్ధాశక్తులతో, బాధ్యతగా విధులు నిర్వహించారో  అదే మాదిరిగా  వైద్యాధికారులు కృషిచేసి "ఎనీమియా ఫ్రీ కృష్ణా " గా జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టర్ పి. రాజాబాబు కోరారు.


శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో భాగంగా మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై ( ఎనీమియా రిడక్షన్ ) వర్క్ షాప్ నిర్వహించారు. 


తొలుత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ గీతాబాయి మాట్లాడుతూ, ఇటీవల తమ శాఖ నిర్వహించిన యాదృచ్ఛిక సర్వే వివరాల ప్రకారం, కృష్ణాజిల్లాలో 650 మంది రక్తహీనత లోపంతో  ఉన్నారని, వారిలో 132 మందికి ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం అందజేసి ఆ లోపాన్నీ సవరించినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు మాట్లాడుతూ, రక్తహీనత లేని సమాజ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గర్భిణీ స్త్రీల హిమోగ్లోబిన్ శాతాన్ని గుర్తించి అవసరమైన పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన వారికి కల్పించాలని సూచించారు. బాలింతలు, చిన్నపిల్లలు బరువు తక్కువ ఉండడం, చురుకుదనం, ఎదుగుదల లోపం శాతాన్ని తగ్గించడానికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి సరైన పోషకాహారాన్ని అందించాలన్నారు.18 సంవత్సరాల లోపు జరిగే బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలుంటాయని ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. భోజన అనంతరం కాఫీలు టీ వంటి పానీయాలు తాగడం ద్వారా ఐరన్ లోపం కలుగుతుందని, నిమ్మరసం పిండిన నీటితో ఐరన్ మాత్రలు తీసుకోవడం మంచిదని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విద్యార్థులు, మహిళల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించాలని,వయసు తగిన ఎత్తు,బరువు లేని పిల్లలను గుర్తించి పోహకాహార లోపాన్ని నివారించాలని, గర్భిణీ మహిళల్లో రక్తహీనతను తగ్గించి జిల్లాలో మాతృ మరణాలను అరికట్టాలని  జిల్లా కలెక్టర్‌ అన్నారు. పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహారం, రక్తహీనతను తగ్గించే తదితర అంశాలపై సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు విస్తృతంగా పర్యవేక్షించాలన్నారు.

పౌష్టికాహార లోపం గల పిల్లలు,గర్భిణులను గుర్తించి అవసరమైన ప్రోటీన్లు అందించాలని కలెక్టర్ పి. రాజబాబు తెలిపారు. వయసుకు తగిన బరువు, ఎత్తులేని వారిని తగ్గ ఎత్తు లేని వారిని మిషన్‌ మోడ్‌లో ప్రత్యేక కార్యక్రమం కింద న్యూట్రిషన్‌ భోజనాన్ని అందించాలని కలెక్టర్ సూచించారు. జన్యుపరమైన లోపాలను గుర్తించి అంగన్‌వాడీ, పాఠశాలల ద్వారా పౌష్టికాహారాన్ని అం దించాలన్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ వారు గర్భిణీ మహిళల్లో రక్తహీనత శాతాన్ని కొంతమేరకు నమోదు చేశారని, వాటిని అంగన్వాడీ కార్యకర్తల ద్వారా పునః పరిశీలించాల్సిందిగా సూచించారు. కృష్ణాజిల్లాలో ఏ గ్రామంలోనూ రక్తహీనతతో బాధపడే గర్భిణీలు ఉండకూడదని సూచించారు. పిల్లల ఆరోగ్య స్థితిగతులు, మహిళల ఆరోగ్యం, ప్రసవాలు, పారిశుధ్య అంశాలపై చర్చించి పనులను చేపట్టాలన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కు రక్తహీనతతో బాధపడే బాలికలు మహిళల వివరాలు అందజేసి వైద్య సంరక్షణలో వారు ఉండేలా చూడాలని కలెక్టర్ అన్నారు.


అదేవిధంగా జిల్లాలో రక్తహీనత గూర్చి బాలికలకు మహిళలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని  కళాజాతాలు, చిన్ని లఘు నాటికలు ప్రదర్శించాలన్నారు. రక్తహీనత నివారణ సమాచారం కరపత్రాలు, పోస్టర్లు, వీడియో సందేశాలు రూపొందించి వాటిని విస్తృతంగా ప్రజల్లో చేరుకునేలా ప్రచారం చేయాలన్నారు. దాదాపు 2 గంటలకు పైగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించారు.


ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్, డి ఎంహెచ్ ఓ డాక్టర్ గీతాబాయి,ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ, డివైఈవో సుబ్బారావు, పలువురు మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.



Comments