స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జగన్ ప్రభుత్వం జరిగింది అంటున్న అవినీతి నేతి బీరలో నెయ్యి చందమే.


 అమరావతి (ప్రజా అమరావతి);


*స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జగన్ ప్రభుత్వం జరిగింది అంటున్న అవినీతి నేతి బీరలో నెయ్యి చందమే*


 • ఒక ప్రైవేట్ సంస్థ కు చెందిన రూ.7కోట్ల జీఎస్టీ ఎగవేత అంశాన్ని మొత్తం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు ఆపాదించడం కొండకు వెంట్రుక వేయడమే.

• డిజైన్ టెక్, స్కిల్లర్ సంస్థల మధ్య తలెత్తిన జీఎస్టీ చెల్లింపుల వివాదానికి, చంద్రబాబుకి సంబంధం ఏమిటి?

• ప్రభుత్వ సలహాదారు సజ్జల సాక్షి మీడియాకు పనికొచ్చే సరుకును మీడియా ముందు వండివార్చాడు తప్ప చంద్రబాబు పాత్ర, ప్రమేయానికి  సంబంధించిన ఆధారాలు చూపలేదు.

• వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోప్రధాన పాత్ర పోషించిన అధికారుల్ని సీఐడీ విచారించలేదా?


నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ కాబడిందని, జగన్ రెడ్డి రాజకీయ కుట్రలో భాగమే చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ అని, స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో చంద్రబాబు చేశాడంటున్న అవినీతి నేతిబీరలో నెయ్యి చందమేనని, సదరు ప్రాజెక్ట్ ఏ నేపథ్యంలో ఏర్పడిందో, దానివల్ల యువతకు ఎంత లబ్ధి కలిగిందో ప్రజలు తెలుసుకోవాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి  ఆలపాటి రాజేంద్రప్రసాద్ సూచించారు. 


మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డుతు 


“ టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించడం కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో కలిసి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 2015లో రాష్ట్రం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాక, నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐ.వై.ఆర్ కృష్ణా రావు కొందరు ఐపీఎస్ అధికారులతో సదరు కార్పొరేషన్ పనితీరు, నిర్వహణ నిమిత్తం రెండు కమిటీలు వేశారు. ఐపీఎస్ అధికారి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో జవహర్ నాలెడ్జ్ కేంద్రాల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసిన గంటా సుబ్బారావుల్ని కూడా కమిటీలో సభ్యులుగా నియమించడం జరిగింది. నైపుణ్యాభివృ ద్ధి  శిక్షణకోసం సీమెన్స్ సంస్థ రాష్ట్రంలో 40 శిక్షణాకేంద్రాలు ఏర్పాటుచేసింది. శిక్షణా కేంద్రాల్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ, విశాఖ ఇంజనీరింగ్ కళాశాల, జీఎంఆర్, కాకినాడ జేఎన్టీయూ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. శిక్షణ కోసం అయ్యే వ్యయంలో రాష్ట్రప్రభుత్వ వాటా కేవలం 10శాతమైతే, సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థల వాటా 90శాతంగా నిర్ణయించి జీవోలద్వారా నిధులు విడుదల చేయడం జరిగింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి జరిగింది అంటున్న జగన్ ప్రభుత్వం శిక్షణా కేంద్రాల్లో విచారించి, ఎలాంటి వాస్తవాలు సేకరించిందో చెప్పాలి.  శరత్ చంద్రా ఆడిట్స్ సంస్థ కేంద్రాల్లో  భౌతిక విచారణ జరపకుండా జగన్ ప్రభుత్వం ఎందుకు అడ్డు చెప్పింది? అలానే సెంట్రల్ టూల్ డిజైనింగ్ (కేంద్రప్రభుత్వ సంస్థ) శిక్షణా కేంద్రాల్లో ఆడిట్ నిర్వహించి, యువత శిక్షణకు అవసరమైన సాంకేతికపరిజ్ఞానం, ఇతరత్రా పరికరాలు అన్నీ ఉన్నాయని నిర్దారించి ఇచ్చిన నివేదికను జగన్ ప్రభుత్వం గానీ, ఏపీ సీఐడీ గానీ పరిగణనలోకి తీసుకున్నాయా? 3,300కోట్ల స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ సక్రమేనని, దానిలో రాష్ట్రప్రభుత్వం తనవాటాగా కేటాయించిన రూ.330కోట్ల నిధులు సద్వినియోగమయ్యాయని, సెంట్రల్ టూల్ డిజైన్ నిర్ధారణకు వచ్చిందా..లేదా ? ఇవన్నీ పరిశీలిస్తే ఈ ప్రాజెక్ట్ లో అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉందో జగన్ సర్కార్ చెప్పాలి. దేన్ని ప్రామాణికంగా తీసుకొని వైసీపీప్రభుత్వం చంద్రబాబునాయుడు తప్పు చేశాడని చెబుతుందో స్పష్టంచేయాలి.

 

*డిజైన్ టెక్, స్కిల్లర్ సంస్థల మధ్య తలెత్తిన జీఎస్టీ చెల్లింపుల వివాదానికి, చంద్రబాబుకి సంబంధం ఏమిటి?*

జీఎస్టీ చెల్లింపుల వివాదంపై మాట్లాడుతున్న జగన్ ప్రభుత్వం, ఆ అంశానికి నాటి టీడీపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదనే విషయాన్ని ఎందుకు తొక్కిపెడుతోంది? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగస్వామి అయిన డిజైన్ టెక్ సంస్థ, స్కిల్లర్ అనే సంస్థకు చేసిన చెల్లింపుల్లో జీఎస్టీ పన్ను ఎగవేస్తే, దానికి టీడీపీప్రభుత్వానికి సంబంధం ఏమిటో జగన్ రెడ్డి, ఏపీ సీఐడీ చెప్పాలి. రూ.7కోట్ల జీఎస్టీకి, రూ.330కోట్ల చెల్లింపులకు సంబంధం ఏమిటో చెప్పాలి. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన రూ.7కోట్ల పన్నుఎగవేతను మొత్తం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు ఆపాదించడం కొండకు వెంట్రుక వేయడమే. ఇదంతా గమనిస్తే జగన్ రెడ్డి కావాలనే చంద్రబాబుని తప్పుడు కేసులో అరెస్ట్ చేయిం చాడని స్పష్టమవుతోంది. కేవలం గుడ్డకాల్చి మీద వేయడం తప్ప, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని రూఢీ అవుతోంది.


*సజ్జల సాక్షి మీడియాకు పనికొచ్చే సరుకు మాత్రమే అందించి వాస్తవాలు దాచాడు* 


స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లో రూ.330కోట్ల అవినీతి జరిగిందని ఏ అంశాల ప్రాతిపదికన జగన్ ప్రభుత్వం, ఏపీ సీఐడీ చెబుతున్నాయి? సీఐడీ ఇన్ ఛార్జ్ సంజయ్ జగన్ ప్రభుత్వ మోచేతి నీళ్లుతాగుతూ, కావాలనే చంద్రబాబుని అరెస్ట్ చేశారు. నోటీసు ఇస్తే విచారణకు వచ్చే వ్యక్తిని అర్థరాత్రి, హడావుడిగా అదుపులోకి తీసుకోవడాన్ని సంజయ్ నిస్సిగ్గుగా సమర్థిస్తున్నాడు. ప్రభుత్వ సలహాదారు సజ్జల సాక్షి మీడియాకు పనికొచ్చే సరుకును మీడియా ముందు వండివార్చాడు తప్ప ఆధారాలు చూపలేక పోయాడు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు న్యాయపరంగా నిలవవు.

 

*స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి టీడీపీ ప్రభుత్వం వేసిన కమిటీల్లో కీలక పాత్ర పోషించి, నేడు వైసీపీప్రభుత్వంలో కీలకస్థానాల్లో ఉన్న అధికారుల్ని ఎందుకు విచారించలేదు?*


25/02/2015న జీవోనెం-55 ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నాటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 21/08/2015న సీమెన్స్ సంస్థ  ఎండీ నాటి ముఖ్యమంత్రి కి ఒక లేఖరాశారు. ప్రాజెక్ట్ అమల్లో భాగంగా సీమెన్స్, డిజైన్ టెక్, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నందున, ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన నిధులు సెప్టెంబర్ 30 లోపు చెల్లించాలని, లేకపోతే శిక్షణాకేంద్రాలు నిర్వహణ నుంచి వైదొలుగుతామని లేఖలో పేర్కొన్నారు. అనంతరం 05/09/2015న నాడు చీఫ్ సెక్రటరీగా ఉన్న కృష్ణారావు, రవిచంద్రారెడ్డి, గంటాసుబ్బారావు, లక్ష్మీనారాయణ వంటివారు, సీమెన్స్ ప్రతినిధులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి మినిట్స్ రూపొందించారు. దానిలో భాగంగా రెండు కమిటీలు వేశారు. ఆనాడు వేసిన కమిటీల్లో ప్రస్తుతం వైసీపీప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఎల్.ప్రేమచంద్రారెడ్డి, రావత్, ఉదయలక్ష్మి ఉన్నారు. సెలక్షన్ కమిటీలో సభ్యులుగా కూడా వారున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్  లో అవినీతి అంటున్న జగన్ ప్రభుత్వం ఏనాడూ సదరు అధికారుల్ని ఎందుకు విచారించలేదు? కేవలం గంటాసుబ్బారావు, లక్ష్మీనారాయణలను మాత్రమే విచారించి, మిగిలిన వారిని ఎందు కు వదిలేసింది? వైసీపీ ప్రభుత్వంలో కీలకశాఖల్లో పనిచేస్తున్నారని సంకోచించిందా? ఇలా అసమగ్రంగా విచారించి, తమకు అవసరమైనవారిని వదిలేసి తూతూమంత్రంగా దర్యాప్తు జరిపించి చంద్రబాబుని అరెస్ట్ చేయడాన్ని కక్షసాధింపు అనక ఏమనాలి? 


*స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో ఈడీ విచారణలో రాని చంద్రబాబు పేరు ఇప్పుడెందుకు వచ్చింది?*


జగన్ రెడ్డి నాలుగేళ్లుగా సహజవనరులదోపిడీతో పాటు, ప్రజల ఆస్తుల్ని కొట్టేస్తూ  అవినీతి పాలన సాగిస్తూ, నిస్సిగ్గుగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో  రూ.330కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం సిగ్గుచేటు కాదా? అరెస్ట్ కు ముందు చంద్రబాబుకి ఇచ్చిన నోటీసులు, దానిలో పేర్కొన్న సెక్షన్లు సమాచారమంతా తప్పులతడకే. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే, ఇదే జగన్ ప్రభుత్వం 2020లో సదరు ప్రాజెక్ట్ లో భాగస్వామి అయిన డిజైన్ టెక్ ను ఎలా ప్రశంసించింది? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై వచ్చిన ఆరోపణలపై ఈడీ విచారించినప్పుడు ఎక్కడా చంద్రబాబు పేరు రాలేదు. కానీ జగన్ కు ఊడిగం చేసే సీఐడీకి మాత్రమే చంద్రబాబు కనిపించాడు. ప్రజల పక్షాన పనిచేస్తూ, వారికి జరుగుతున్న అన్యాయంపై నిలదీసేవారిపై దాడి చేయడం, తప్పుడుకేసులతో వేధించడం తప్ప జగన్ రెడ్డి నాలుగేళ్లలో సాధించిందేమీ లేదు. బెయిల్ పై బయట ఉండి, సీబీఐ ఈడీ కేసుల విచారణకు హాజరకాకుండా కుంటి సాకులతో తప్పించుకుంటున్న జగన్ రెడ్డి.. చంద్రబాబు తప్పుచేశాడని చెప్పడం విడ్డూ రంగా ఉంది. నిజంగా జగన్ కు చిత్తశుద్ధి ఉంటే, తాను తప్పుచేయకపోతే తన అవినీతి కేసుల విచారణను ఏపీకి బదిలీచేయాలని, అలాచేస్తే తాను క్రమంతప్పకుండా విచారణ కు హాజరవుతాననిని ఎందుకు కోర్టుల్ని కోరడంలేదు? చంద్రబాబు దోషి అంటున్న జగన్ కు తగిన విధంగా బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.” అని  ఆలపాటి స్పష్టం చేశారు.

Comments