నవంబరు 15 నుండి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర క్యాంపెయిన్ ప్రారంభం:కేబినెట్ కార్యదర్శి .

 నవంబరు 15 నుండి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర క్యాంపెయిన్ ప్రారంభం:కేబినెట్ కార్యదర్శి 


అమరావతి,31 అక్టోబరు (ప్రజా అమరావతి):దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నవివిధ సంక్షేమ పధకాలను పూర్తి స్థాయిలో లబ్దిదారులకు చేర్చేందుకు వారిలో అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార కార్యక్రమాన్నిచేపడుతున్నట్టు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ ఫ్లాగ్ షిప్పు సంక్షేమ పధకాల ప్రయోజనాలు పొందని లబ్ధిదారులకు వేగంగా చేరేలా చూడాలన్నదే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.ఈఅంశంపై మంగళవారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ ముందుగా 110 గిరిజన జనాభా గల జిల్లాల్లో నవంబరు 15వ తేదీన ఈవికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదగా ప్రారంభం అవుతుందని ఆతర్వాత నవంబరు మూడో వారం నుండి దేశంలోని మిగతా జిల్లాలన్నిటిలో ఈకార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. దేశంలో మొత్తం 7లక్షల వరకూ గ్రామ పంచాయితీలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాల సహకారం,సమన్వయంతో అన్నిపంచాయితీల్లో ఈమెగా సంతృప్త డ్రైవ్‌ను చేపటడ్డం జరుగు తుందని కేబినెట్ సెక్రటరీ రాజీబ్ గౌబ వివరించారు.రానున్న రెండు నెలల్లో అన్ని సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహనకు ఈకార్యక్రమాన్ని చేపడుతున్నట్టు స్పష్టం చేశారు.

ముఖ్యంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్), జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్,స్వచ్చ భారత్,పీఎం కిసాన్,ఫసల్ బీమా యోజన,పోషణ్ అభియాన్,ఉజ్వల యోజన,పియం విశ్వకర్మ,పియం స్వానిధి,పియం ముద్రా రుణాలు,స్టార్ట్ అఫ్ ఇండియా,స్టాండ్ అఫ్ ఇండియా,ఆయుష్మాన్ భారత్,జనౌషధి యోజన,పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన,పియం ఆవాస యోజన(అర్బన్),స్వచ్చభారత్ అభియాన్(అర్బన్),పియం ఇ-బస్ సేవ,అమృత్,డిజిటల్ పేమెంట్ ఇన్ప్రాస్ట్రక్చర్,ఖేలో ఇండియా,వందే భారత్ రైళ్ళు,జల్ జీవన్ మిషన్,నైపుణ్యాభివృద్ధి వంటి పలు ఫ్లాగ్ షిప్పు పథకాలను సంతృప్తి పరిచేలా ఈవికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార అవగాహనా కార్యక్రమం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ్ వివరించారు.

ఈకార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జాతీయ,రాష్ట్ర,జిల్లా,గ్రామ పంచాయితీల స్థాయిలో వివిధ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసి ఈకార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాల్సి ఉందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు.ఇందుకు గాను రాష్ట్ర స్థాయిలో సిఎస్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ లను కోరారు.అదే విధంగా జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్ నేతృత్వంలో జిల్లా అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని,అలాగే గ్రామ పంచాయితీ స్థాయిలో గ్రామ కమిటీని ఏర్పాటు చేసి ప్రజలందరికీ వివిధ సంక్షేమ పధకాలపై పూర్తి అవగాహన కలిగించి అర్హుడైన ప్రతి లబ్దిదారునికి ఆయా సంక్షేమ పధకాలు అందేలా చూడాలని సిఎస్ లకు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సూచించారు.ప్రధాన మంత్రి సందేశాలతో కూడిన ఆడియో,వీడియోలతో కూడిన ఐఇసి వ్యాన్లతో ప్రచారం చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే అవసరమైన ప్రచార సామాగ్రిని రాష్ట్రాలకు,జిల్లాలకు పంపనున్నట్టు తెలిపారు. ఈకార్యక్రమానికి సంబంధించిన పొటోలు,వీడియోలను మొబైల్ ద్వారా ఐటి పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.కావున వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని విజయంవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో కృషి చేయాలని కేబనెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లకు విజ్ణప్తి చేశారు.

ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈసమావేశంలో రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్,సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి,ప్రణాళికాశాఖ కార్యదర్శి గిరిజా శంకర్,వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ జె.నివాస్,వ్యవసాయశాఖ స్పెషల్ కమీషనర్ హరికిరణ్ ఇంకా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments