సందేహంలేదు...2024లో వచ్చేది టిడిపి-జనసేన ప్రభుత్వమే!.*సందేహంలేదు...2024లో వచ్చేది టిడిపి-జనసేన ప్రభుత్వమే!*


*విజయదశమి పర్వదినాన రాష్ట్రానికి మేలు చేసే కలయిక!*

*రాజమండ్రి వేదికగా చారిత్మాత్మక జెఎసి సమావేశం*

*ప్రజాసమస్యలపైనే ఉమ్మడి సమావేశంలో చర్చించాం*

*ఈనెల 29,30,31 తేదీల్లో జిల్లాస్థాయిల్లో ఉమ్మడి సమావేశాలు*

*నవంబర్ 1నుంచి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళతాం*

*రాజమండ్రిలో జెఎసి సమావేశం అనంతరం యువనేత లోకేష్*

రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): విజయదశమి రోజున టిడిపి-జనసేన కలయిక రాష్ట్రానికి మేలుచేసే కలయిక, 2014లో నవ్యాంద్రకు రాజధానిలేదు, సమర్థవంతమైన నాయకుడు కావాలని ఆనాడు పవన్ మాకు మద్దతు తెలిపారు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రప్రయోజనాలకోసమే కలసి ప్రయాణం చేయాలని నిర్ణయం తీసుకున్నామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం మంజీరా హోటల్ లో టిడిపి-జనసేన జెఎసి తొలి సమావేశం అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ... రాబోయే వందరోజుల్లో ఎలా కలసి ముందుకెళ్లాలనే విషయమై ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు.  గత నాలుగున్నర సంవత్సరాలుగా సామాజిక అన్యాయం జరుగుతోంది. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. తన అక్కను వేధిస్తున్న వాడిని ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని వైసిపి నాయకుడు కొడుకు పెట్రోలు పోసి తగులబెట్టారు, బిసి సంక్షేమ పథకాలు రద్దు చేయడంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10శాతం రిజర్వేషన్ ను వైసిపి ప్రభుత్వం రద్దుచేసింది. డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం వరకు ఎందరో దళితులను వెంటాడి చంపారు, దళితులకు రావాల్సిన 27సంక్షేమ పథకాలు కూడా ఈ ప్రభుత్వం రద్దుచేసింది. ఇస్లాంలో ఆత్మహత్య మహా పాపం, నంద్యాలలో అబ్దులో సలాంను వైసిపి నేతలు వేధించడంతో వారి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పలమనేరులో మిస్బా అనే బాలిక వైసిపి నాయకుడి వత్తిడితో ఆత్మహత్య చేసుకుంది. 

*కరువు-జగన్ కవలపిల్లలు*

కరువు, జగన్ కవలపిల్లలు, రాష్ట్రంలో 34లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం చేతగానితనం వల్ల సాగునీటి ప్రాజెక్టులు గాలికొదిలేశారు, మిగులు జలాలు సముద్రం పాల్జేశారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ లేదు, కాల్వల్లో నాచు తీసే పరిస్థితి లేదు. రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. జగన్ అసమర్థ పాలన కారణంగా రైతు ఆత్మహత్యల్లో ఎపి 3వ స్థానం, కౌలు రైతుల్లో 2వస్థానంలో ఉంది. కరెంటుబిల్లు, ఇంటిపన్నుల పెంపుతో వైసిపి ప్రభుత్వం పెద్దఎత్తున ప్రజలపై భారం మోపింది. గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు, 2.3లక్షల పోస్టులు భర్తీచేస్తామని ఒక్క పోస్టుకూడా భర్తీచేయలేదు. ఉద్యోగాలు, ఉపాధి లేక పక్కరాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది. తీవ్రకరువు పరిస్థితుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు, టిడిపి-జనసేన నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితి తెలుసుకుని దీనిపై భవిష్యత్ కార్యాచరణ చేపడతాం.

*వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు!*

గత నాలుగున్నరేళ్లుగా ప్రజల సమస్యలపై పోరాడిన వారిపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వేధిస్తున్నారు, అచ్చెన్నాయుడిని ఎలా హింసపెట్టారో అంతా చూశారు. ఏ తప్పుచేయని చంద్రబాబునాయుడును 44రోజజులుగా జైలులో పెట్టారు, ఈ కేసులో 36రోజులకు మించి ఎవరూ రిమాండ్లో లేరు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నారు.  పవన్ కళ్యాణ్ మంగళగిరి రావడానికి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ల్యాండ్ కానీయలేదు, 3గంటలు బార్డర్ లో ఆపేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినవారి గొంతునొక్కాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల తరపున పోరాడటానికి, సమస్యల పరిష్కారానికే టిడిపి-జనసేన జెఎసి ఏర్పాటైంది. జెఎసి తొలి సమావేశంలో వందరోజుల కార్యాచరణపై చర్చించాం, ఈనెల 29,30,31 తేదీల్లో టిడిపి-జనసేన నాయకులతో జిల్లాస్థాయిల్లో ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించుకొని నవంబర్ 1నుంచి డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం.

*ఇది ఖచ్చితంగా చారిత్రాత్మక సమావేశమే!*

రాజమండ్రిలో నిర్వహించిన తొలి జెఎసి సమావేశంలో 3తీర్మానాలు చేశాం. 1). టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ తీర్మానం. 2). అరాచకపాలననుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని నిర్ణయం. 3). అన్నివర్గాలను అభివృద్ధిబాటలో నడిపించాలి. తొలి సమావేశం పవన్ చెప్పినట్లు ఒక చారిత్రాత్మక కలయికే, నాకు ఎలాంటి సందేహం లేదు... 2024లో టిడిపి-జనసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. ఎపికి మంచిరోజులు తీసుకొచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. సమావేశంలో ప్రజల సమస్యల గురించి చర్చించాం, రాష్ట్రప్రజలకు ఏం మేలు చేయాలో, రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం. జిల్లాస్థాయిల్లో నిర్వహించే సమావేశాల్లో ఏమైనా సమస్యలుంటే పరిష్కరిస్తాం. ఈనెల 26న తుది ఓటరు లిస్టు వస్తుంది, ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తాం. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి, అప్పుల చేసి సంక్షేమం చేయడం కాదు, అభివృద్ధి చేసి సంక్షేమం చేయాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యసాధన కోసం మేం కృషిచేస్తాం.


Comments