తెప్పోత్సవానికి సర్వం సిద్ధం*.

   ఎన్టీఆర్ జిల్లా, అక్టోబర్ 22 (ప్రజా అమరావతి );                                                                    *తెప్పోత్సవానికి సర్వం సిద్ధం*.   


                                       దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన  శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నదీ విహారానికి సర్వం సిద్ధమయ్యాయి. ఆదివారం సాయంత్రం దుర్గా ఘాట్ వద్ద హంస వాహనం ట్రైల్ రన్ ను అధికారులు నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు; రహదారులు, భవనాలు; ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ హంస వాహనంపై తెప్పోత్సవాన్ని  విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నదీ విహారంలో ఉన్న స్వామి, అమ్మవార్లను చూసి తరించేందుకు భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల తెప్పోత్సవం జరగనందున ఈసారి ఈ ఉత్సవాన్ని ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా, వరదలు కారణంగా మూడేళ్లపాటు తెప్పోత్సవం జరగలేదని ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. బోటు సామర్థ్యం మేరకు మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. బోట్ సపోర్టింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఘాట్ సామర్థ్యం ఎనిమిది వందల వరకు ఉంటుందని ఆ మేరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని వివరించారు. రాష్ట్ర విపత్తు స్పందన దళ బృందాలను కూడా మోహరించనున్నట్లు వెల్లడించారు.  ట్రయల్ రన్ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్ రామారావు, జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తదితరులు పాల్గొన్నారు. 

Comments