అసత్యాలతో విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దు.

 *అసత్యాలతో విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవద్దు* 


*•రాష్ట్ర విద్యా వ్యవస్థలో  విప్లవాత్మక  సంస్కరణలను అమలుచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి*  

*•రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో దీటుగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం*

*•ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో పాటు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఉచితంగా పంపిణీ*

*•విద్యార్థుల్లో ఆంగ్ల మాద్య సామర్థ్యాన్ని పెంచేందుకు 5, 9 తరగతి  స్థాయిల్లో టోఫెల్ పరీక్షలు*

*రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ*


అమరావతి, అక్టోబరు 12 (ప్రజా అమరావతి): కొన్ని రాజకీయ పార్టీలతో పాటు కొందరు వ్యక్తులు అవగాహనా రాహిత్యంతో విద్యార్థుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా అసత్యాలను మాట్లాడటం సరైన పద్దతి కాదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  హితవు పలికారు. విద్యా రంగానికి సంబందించి ఎటు వంటి ప్రశ్నలనైనా తమని నేరుగా అడిగితే సమాదానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని, అంతే గానీ బహిరంగ లేఖల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళాన్ని సృష్టించి, వారిని ఆందోళనకు గురిచేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.  గురువారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్  సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో  మాట్లాడుతూ      శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విద్యా, వైద్య రంగాల్లో పలు నూతన సంస్కరణలను అమలు చేస్తున్నారన్నారు.   జాతీయ విద్యా విధానానికి అనువుగా  రాష్ట్ర విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేయడంతో పాటు రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీ పరీక్షల్లో దీటుగా నిలిచే విధంగా పలు కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు. ఇందులో బాగంగా  ఉచితంగా ట్యాబ్ల పంపిణీ, బైజూస్ విద్యా కంటెంట్, టోఫెల్ శిక్షణ తదితర కార్యక్రమాలను రాష్ట్రంలో అమలు చేయడం జరుగుచున్నదన్నారు. 

                                                                                                                                                                                   రాష్ట్ర ప్రభుత్వం బైజూస్ తో కుదుర్చుకున్న ఒప్పందాల నేపథ్యంలో వేల కోట్ల అక్రమాలు జరిగాయనే పలు అవాస్తవ కథనాలు ప్రచారంలో ఉన్నాయని, వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. బైజూస్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా చెల్లించలేదని ఆయన స్పష్టం చేశారు.  ఈ మద్య కాలంలో దావోస్ లో జరిగిన ప్రపంచ పారిశ్రామిక సదస్సు సందర్బంగా   బైజూస్  సంస్థ వారే రాష్ట్ర  ముఖ్యమంత్రిని నేరుగా కలసి రాష్ట్ర విద్యార్థులకు బైజూస్ విద్యా కంటెంట్ ను ఉచితంగా అందజేస్తామని ముందుకు వచ్చారని ఆయన తెలిపారు.  రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందుబాటులోకి తీసుకువస్తే వారి విద్యా ప్రమాణాలు మరింత పెరుగుతాయనే ఉద్దేశ్యంతో బైజూస్  కంటెంట్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఫలితంగా రాష్ట్రంలో దాదాపు 35 లక్షల మంది విద్యార్థులకు మేలుకలుగుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే  బైజూస్ కంటెంట్ తో 8 వ తరగతి విద్యార్థులకు, ఉపాద్యాయులకు 5.18 లక్షల   ట్యాబ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. 


అదే విధంగా రాష్ట్ర విద్యార్థులకు ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధనతో పాటు ప్రపంచ స్థాయి టోఫెల్ పరీక్షలను కూడా రాష్ట్ర విద్యార్థులు ధీటుగా ఎదుర్కొనేందుకు   ఈ విద్యా సంవత్సరం నుండే ప్రాధమిక స్థాయి నుండి  వారికి శిక్షణ నిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.    ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీషులో నైపుణ్యాన్ని పెంచేవిధంగా టోఫెల్ పరీక్షలను ఈ ఏడాది నుండి నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం అమెరికన్ సంస్థ అయిన ETS  (Educational Testing Services) తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ప్రధానంగా 5 వ తరగతి వారికి టోఫెల్ ప్రైమరీ, 9 వ తరగతి స్థాయి వారికి టోఫెల్ జూనియర్ పేరుతో పరీక్షలను నిర్వహించి సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రైమరీ స్థాయిలో 6.31 లక్షల మందికి, జూనియర్ స్థాయిలో 14.39 లక్షమ మందికి వెరసి  మొత్తం 20.70 లక్షల మంది విద్యార్థులకు  ఆన్ లైన్ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకై ప్రతి విద్యార్థికి  రూ.7.50/-  ల పరీక్ష ఫీజు ఉంటుందని, అందుకు దాదాపు  రూ.1.55 కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు.  ఈ పరీక్షలో మెరిట్ సాధించిన వారిలో ప్రైమరీ టెస్టు నుండి  40 వేల మందిని, జూనియర్ టెస్టు నుండి మరో 40 వేల మందిని వెరసి మొత్తం 80 వేల మందిని సర్టిఫికేషన్ టెస్టు కోసం అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ సర్టిఫికేషన్ టెస్టుకు ప్రతి విద్యార్థికి రూ.600/- పరీక్ష ఫీజని, ఇందుకై  దాదాపు రూ.4.80 కోట్లు వెచ్చించడం జరుగుతుందన్నారు.  ఈ విధంగా ఏడాదికి రెడీనెస్ టెస్టు కోసం రూ.1.55 కోట్లు, ఆపరేషనల్ టెస్టు కోసం రూ.4.80 కోట్లు వెరసి మొత్తం రూ.6.35 కోట్లను మాత్రమే ప్రభుత్వం వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా  ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్యను కూడా పెంచుకుంటూ వెళ్లడం జరుగుతుందన్నారు. అదే విధంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి జూనియర్ స్పీకింగ్ కోర్సుకై  5 వేల విద్యార్థులతో మొదలు పెట్టి ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ పోవడం జరుగుతుందన్నారు.  ఈ విధంగా  వచ్చే ఐదు  విద్యా సంవత్సరాలకు అంటే 2023-24 నుండి 2027-28 వ విద్యా సంవత్పరం వరకూ వెచ్చించేందుకు ప్రణాళికను రూపొందించుకోవడం జరిగిందని ఇందుకై  దాదాపు రూ.145 కోట్లను వెచ్చించేందుకు అవకాశం ఉందని మంత్రి తెలిపారు.   ఈ విధంగా రాష్ట్ర విద్యార్థుల్లో  సృజనాత్మక శక్తిని పెంచాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పలు రాజకీయ పార్టీలు, వ్యక్తులు అవగాహనా రాహిత్యంతో  అడ్డుపుల్లలు వేయడం సరికాదన్నారు. 

                                                                                                                                                                                               

Comments