*యావత్ ప్రపంచం నిద్రించినా మేల్కొని కాపాడేది.. పోలీస్ వ్యవస్థ ఒక్కటే*
*పోలీస్ అమరవీరులకు నివాళి అర్పించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*
*పరిపాలన వ్యవస్థలో నంద్యాల జిల్లాది అత్యుత్తమ స్థానం*
*పోలీసులు , వారి కుటుంబాలకు అండగా ప్రభుత్వం*
నంద్యాల జిల్లా, అక్టోబర్, 21 (ప్రజా అమరావతి); యావత్ ప్రపంచం నిద్రపోయినా ప్రజలను కాపాడుకోవడానికి మేల్కొనే ఉండి రక్షించే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఒక్కటేనని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. నంద్యాల పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన అక్టోబర్ 21 అమరవీరులను స్మరించుకునే రోజు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. సమాజమే కుటుంబంగా భావించి సొంత కుటుంబాలను కూడా పక్కనపెట్టి నిర్విరామంగా పని చేసే వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరిపాలనలో కీలక భాగమైన సామాన్యుల ధన, మాన, ప్రాణ రక్షణలో పోలీసులదే ముఖ్య భూమిక అన్నారు. విధులు నిర్వర్తించే పోలీసులతో సమానంగా వారి కుటంబాన్ని నడిపించే సభ్యుల భాగస్వామ్యం కూడా వెలకట్టలేనిదన్నారు.
శాంతిభద్రతలకు సంబంధించిన అంశంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్ర భాగంలో ఉందన్న విషయం తాను సదరన్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనడం వల్ల మరింత అర్థమైందన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం తీవ్రవాదం, అసాంఘిక శక్తుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడే తరుణంలో విధులు నిర్వర్తిస్తూ 188 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లాకు చెందిన కానిస్టేబుల్ నరేంద్రనాథ్, హోంగార్డు రాజశేఖర్ లు రౌడీ మూకలను నిలువరించే ప్రయత్నంలో చనిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందించవలసిన సహాయ కార్యక్రమాలలో తన పూర్తి స్థాయి తోడ్పాటు ఉంటుందని మంత్రి బుగ్గన హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో పోలీసులకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి విద్య, వైద్య సేవలందించడం అభినందనీయమన్నారు. తన చిన్నతనంలో తన తండ్రి ఆర్మీకి పంపాలనుకుని తమపై ప్రేమ వల్ల పంపలేక పోయిన విషయం తరచూ చెప్పేవారని మంత్రి బుగ్గన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దేశ సేవలో ఒకటైన రాజకీయ రంగం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశం వల్ల ప్రజా సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా అంటే ఫ్యాక్షన్ ప్రాంతమనే ముద్ర తొలగించుకుని అత్యున్నత పరిపాలన వ్యవస్థ ఉన్న జిల్లాగా అవతరించామని..అందుకు కృషి చేస్తోన్న పోలీసుల సేవలను మంత్రి బుగ్గన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి, నందికొట్కూరు శాసన సభ్యులు ఆర్థర్ ఎమ్మెల్సీ ఫరూక్, ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్, హబీబుల్లా, కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ఎస్పీ రఘువీర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment