మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు

 

మనుబోలు, అక్టోబర్ 3 (ప్రజా అమరావతి): గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క మనుబోలు మండలంలో ఇప్పటివరకు రూ. 12.30 కోట్లతో విడతలవారీగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు 

 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.


బుధవారం ఉదయం  మనుబోలు మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు.మనుబోలులో  జగనన్న కాలనీలకు జలజ్జీవన్ మిషన్ ద్వారా తాగునీటి వసతి, పలుచోట్ల నూతనంగా నిర్మించిన అంతర్గత సిమెంటు రోడ్లు, డ్రైన్లు మొదలైన రూ. 95 లక్షల విలువైన అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ప్రారంభించారు. 


ఈ సందర్భంగా మనుబోలు సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, అలాగే గ్రామాల్లో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను సంపూర్ణంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో కేవలం అభివృద్ధి శంకుస్థాపన శిలాఫలకాలకే పరిమితమైందని, తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మనుబోలు మండలంలో అనేక అభివృద్ధి పనులకు ఇప్పటివరకు 12.30 కోట్ల రూపాయలు విడతలవారీగా మంజూరు చేశామని, తమ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ కూడా మనుబోలులో జరగలేదని చెప్పారు.  ప్రతి ఒక్క వీధిలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించామని, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించినప్పుడు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపించామని చెప్పారు. భవిష్యత్తులో గ్రామాల సంపూర్ణ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 


ఈ కార్యక్రమంలో నుడా వైస్ చైర్మన్ బాపిరెడ్డి, మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments