సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నాం...

 ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);




సామాన్య భక్తుల దర్శనానికి 

ప్రాధాన్యత ఇస్తున్నాం...



శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలిరోజు గుర్తించిన లోపాలను సరిదిద్దడంతో పాటు సామాన్య భక్తులు దర్శనం కోసం వచ్చే క్రమంలో ఎదురవుతున్న సమస్యలను సైతం చక్కదిద్దినట్లు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.  సోమవారం మంత్రి కొండ కింది నుంచి క్యూలైన్లను పరిశీలించారు. ఏ ఏ ప్రాంతాలలో భక్తులు ఇబ్బంది పడుతున్నారో గుర్తించి తక్షణమే ఆయా ఇబ్బందులను చక్కదిద్దాలని సిబ్బందికి ఆదేశించారు. ఇబ్బందులను సరి చేసిన అనంతరం తిరిగి మళ్లీ పరిశీలించారు. అనంతరం ప్రచారం మాధ్యమాల ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కల్పించాలన్న లక్ష్యం మేరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఎక్కడైనా భక్తులకు ఇబ్బంది కలిగితే అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.  ఇంత పెద్ద కార్యక్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడం సహజమైనప్పటికీ, అటువంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఉద్యోగులు నిబద్ధతతో విధులు నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఏ భక్తుడి నుంచి ఎటువంటి ఫిర్యాదు రాకుండా తాను కూడా నిరంతరం పర్యవేక్షిస్తానన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఏ శాఖ ఉద్యోగులైనా ఉపేక్షించబోమని కఠినంగా హెచ్చరించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శన భాగ్యం కోసం వస్తున్న భక్తులకు ఏ అంశంలోనూ ఇబ్బందులు కలగకుండా సంతృప్తికరమైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయంలో మాత్రం భక్తులు సహనంతో ఉండాలని కోరారు. అటువంటి సమయాలలో దర్శనంలో కొంత ఎక్కువ సమయం వేచి ఉండటం తప్పదని వివరించారు. అంతకుముందు దేవస్థానం కార్య నిర్వహణ అధికారి కె. ఎస్. రామరావు, దేవదాయ శాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.



Comments