అబ్బురపరిచిన పోలీస్ జాగిలాల సాహస విన్యాసాలు.విజయవాడ (ప్రజా అమరావతి);*అబ్బురపరిచిన పోలీస్ జాగిలాల సాహస విన్యాసాలు* 

*పాసింగ్ అవుట్ పరేడ్ లో డాగ్ స్క్వాడ్(కెనైన్) తో నిర్వహించిన డెమో ప్రదర్శనను తిలకించిన మంత్రి డాక్టర్ తానేటి వనిత*


*8 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకున్న 21వ బ్యాచ్ కి చెందిన 5 రకాల జాతుల 35 జాగిలాలు, 54 మంది డాగ్ హ్యాండ్లర్స్ ను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి*


*మామూలు జాగిలాన్ని పోలీసు జాగిలంగా తీర్చిదిద్ది సమాజ సేవకు అంకితం చేసిన పోలీసు అధికారుల కృషి అభినందనీయం* 


*నేర పరిశోధనకు, నియంత్రణకు, తీవ్రవాద చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన శిక్షణ జాగిలాలకు ఇవ్వడం సంతోషకరం* 


*జాగిలాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి*


: *రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత*


         ప్రస్తుత సమాజంలో పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా నేర పరిశోధనకు, నియంత్రణకు, తీవ్రవాద చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రముఖుల భద్రతా చర్యలకు అవసరమైన శిక్షణ జాగిలాలకు ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మంగళగిరి 6వ బెటాలియన్ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్ లో 8 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకున్న పాసింగ్ అవుట్ పరేడ్ లో 21వ బ్యాచ్ కి చెందిన డాగ్ స్క్వాడ్(కెనైన్) తో నిర్వహించిన డెమో ప్రదర్శనను ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి తిలకించారు. జెర్మన్ షెఫర్డ్ ఇంగ్లీష్ కాకర్ స్పానియల్, గోల్డెన్ రిట్రైవర్, లాబ్రాడర్, బెల్జియన్ మెలినాయిస్ వంటి 5 జాతులకు చెందిన జాగిలాల విన్యాసాల ప్రదర్శనను, పోలీసుల ఔట్ పరేడ్ మార్చ్ ఫాస్ట్ ను మంత్రి ఆసక్తిగా చూశారు. అత్యంత శ్రమకోర్చి ఒక మామూలు జాగిలాన్ని పోలీసు జాగిలంగా తీర్చిదిద్ది సమాజ సేవకు వాటిని అంకితం చేసిన పోలీసు అధికారుల కృషిని మంత్రి కొనియాడారు. రాష్ట్ర విభజనానంతరం ప్రతికూల పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు జాగిలాలకు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి రాష్ట్ర పోలీసు వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా జాగిలాలకు శిక్షణ ఇచ్చి, విధులకు సన్నద్ధం చేస్తున్న సంబంధిత అధికారులను మంత్రి బహుమతులు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. జాగిలాల సేవలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా  2005 బ్యాచ్ కు చెందిన నంద్యాల జిల్లాకు చెందిన ఏ. స్వాములు ఆధ్వర్యంలో 23.01.2023న శిక్షణ ప్రారంభమై నేటితో 8 నెలల కాలంలో మూడు దశల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 21వ బ్యాచ్ కు చెందిన 35 జాగిలాలు, 54 మంది డాగ్ హ్యాండ్లర్స్ ను మంత్రి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందించారు. 

       

     పోలీస్ శాఖలో అనేక విభాగాలతో పాటు డాగ్ స్క్వాడ్ (కెనైన్) పాత్ర అత్యంత కీలకమైనదని మంత్రి తానేటి వనిత అన్నారు. నేర విచారణలో, నేరస్తుల జాడ పసిగట్టే ప్రక్రియలో, మత్తు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో, శాంతి భద్రతల పరిరక్షణలో జాగిలాల పాత్ర ప్రశంసనీయమన్నారు.  రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు నేర పరిశోధనకు, నేర నియంత్రణకు, ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత భద్రత విధుల్లో, కొత్తగా ఏర్పాటు అయిన జిల్లాల అవసరాలకు అనుగుణంగా మరిన్ని జాగిలాలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. జిల్లాల విభజన అనంతరం ప్రతి జిల్లాలో డాగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం పెరిగిందన్నారు. తదనుగుణంగా ట్రైనింగ్ సెంటర్లను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందుకుగాను అన్ని సదుపాయాలతో కూడిన పూర్తిస్థాయి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి వెల్లడించారు. 


         ప్రత్యేకించి 21వ బ్యాచ్ లో రాష్ట్ర పోలీసు వ్యవస్థలోని స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అవసరాలకు అనుగుణంగా తొలిసారిగా 7 జాగిలాలకు నార్కోటిక్ విభాగంలో శిక్షణ ఇచ్చామన్నారు. అంతేగాక తొలిసారిగా 10 జాగిలాలకు ప్రమాదకరమైన నార్కోటిక్ పదార్థాలను గుర్తించడంలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా అసాల్ట్ డాగ్స్, రెడ్ సాండల్ డిటెక్షన్ డాగ్స్ కు శిక్షణ ఇచ్చిన ఘనత కెనైన్ ట్రైనింగ్ సెంటర్, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కు దక్కుతుందన్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన 154  జాగిలాలు పోలీసు కేంద్రాల్లో, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లలో,  నేర పరిశోధనల్లో, వీవీఐపీ భద్రతా విధుల్లో, టీటీడీ బ్రహ్మోత్సవాలు, దేవీ నవరాత్రుల ఉత్సవాలు, రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ వంటి ప్రముఖులు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వహించాయన్నారు. 


    గతంలో పాసింగ్ అవుట్ పెరేడ్ లో కోరిన విధంగా డాగ్ ఫీడింగ్, మెడిసిన్, ఇతర ఛార్జీలను పెంచడం జరిగిందని మంత్రి తెలిపారు. అంతేగాక కెనైన్ ట్రైనింగ్ సెంటర్ లోని 215 పోలీసు జాగిలాల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక వెటర్నరీ డాక్టర్ పోస్టును ఇంటలిజెన్స్ కు కేటాయించడం జరిగిందన్నారు.  


           కార్యక్రమంలో పోలీసు శాఖకు జాగిలాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చూపేందుకు నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. బాంబులను గుర్తించడం, వీఐపీలపైకి దాడికి పాల్పడేవారిని నిరోధించడం, ఆగంతకులపై దాడి చేయడం, నేర పరిశోధనతో పాటు నేరస్థులను పట్టుకోవడంలో జాగిలాల పాత్రను తెలిపే పలు రకాల ఈవెంట్లతో కన్నులకు కట్టినట్లుగా ప్రదర్శించారు. 


                   కార్యక్రమంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటలిజెన్స్ డీజీపీ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు, ఫైర్ డిపార్ట్ మెంట్ సర్వీసెస్ డీజీపీ పి.వి. సునీల్ కుమార్, ఏపీఎస్పీ అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్, ఎస్ఐబీ ఐజీపీ వినీత్ బ్రిజ్ లాల్, ఇంటలిజెన్స్ డీఐజీ కె. రఘురామ్ రెడ్డి, ఏపీఎస్పీ డీఐజీ శ్రీమతి రాజకుమారి, ఏపీఎస్పీ డీఐజీ వెంకటేశ్వర్లు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ ఎ. బాపూజీ, ఏసీబీ ఎస్పీ అద్నాన్ అస్మి, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఎస్ఐబీ ఎస్పీ సుమిత్ సునీల్ గర్డ్, 6వ బెటాలియన్ కమాండర్ సుబ్బారెడ్డి, పీటీవో ఎస్పీ శివారెడ్డి,  ఐఎస్ డబ్ల్యూ ఇంటలిజెన్స్ అధికారులు, వారి కుటుంబసభ్యులు, పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments