అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలి.

 *అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలి


*


*గనులశాఖపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష*


*నెల్లూరు క్వార్డ్జ్ మైనింగ్ పై మూడు బృందాలతో ప్రత్యేక తనిఖీలు*


*వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం*


*గ్రావెల్, లైమ్ స్టోన్ మైనింగ్ పై దృష్టి సారించాలి*


*అక్రమ మైనింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు*


*ఫిర్యాదులు వచ్చిన ప్రతిచోటా విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు*


*మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*


అమరావతి (ప్రజా అమరావతి): రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయంలో గనులశాఖ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరుజిల్లాలో క్వార్డ్జ్ మైనింగ్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే తనిఖీలకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వారం రోజుల్లో ఈ టీంలు నివేదికను సమర్పిస్తాయని, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అప్పటి వరకు మైనింగ్ ను నిలిపివేయాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్ కు బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో లైమ్ స్టోన్, ఎన్టీఆర్ విజయవాడ, కృష్ణాజిల్లాల్లో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పోలవరం కాలువ గట్లపై ఉన్న గ్రావెల్, కొండ ప్రాంతాల్లోని గ్రావెల్ నిల్వలను అనధికారికంగా తరలిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు. విజిలెన్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, గనులశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎడిఎంజి డబ్ల్యుబి చంద్రశేఖర్, గనులశాఖ జెడి రాజబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments