రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం.

 *రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం*



*పంట పొలాలకు సాగునీరు అందించాలని దుగ్గిరాల డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా*


*అఖిలపక్ష రైతు సంఘాలు, హైలెవల్ ఛానల్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా*


*పెద్ద ఎత్తున మద్దతు తెలిపిన టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం నాయకులు, రైతులు*


దుగ్గిరాల, అక్టోబర్ 25 (ప్రజా అమరావతి): పెదవడ్లపూడి హైలెవల్ ఛానల్ ఎత్తిపోతల పథకానికి వెంటనే నిధులు మంజూరు చేసి పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘాలు, హైలెవల్ ఛానల్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం దుగ్గిరాల డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఇంజనీరు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. మొదటిగా దుగ్గిరాల టీడీపీ కార్యాలయం నుంచి ఇంజనీర్ కార్యాలయం వరకు సాగునీరు అందించలేని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు రాజీనామా చేయాలంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఏఈ విద్యావతికి రైతుల పరిస్థితి గురించి వివరించారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడం వలనే పనులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే నిధులను విడుదల చేసి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చి సాగు భూమికి 6 వేల క్యూసెక్యుల నీరు అందించాలని, కాల్వలలో పేరుకుపోయిన తూటుకాడ, గుర్రపుడెక్కను తొలగించాలని కోరారు. రైతు సమస్యలను పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్ళి రెండు రోజుల్లో పరిష్కరిస్తామని ఏఈ వై విద్యావతి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


  ఈ సందర్భంగా తెలుగు రైతు నాయకులు మాట్లాడుతూ నీరు అందక పొలాలు నెర్రెలిచ్చి ఎండిపోతున్నాయన్నారు. పెదవడ్లపూడి హైలెవల్ ఛానల్ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పెదవడ్లపూడి హైలెవల్ ఛానల్ ఎత్తిపోతల పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 80 శాతం పూర్తి చేయగా నాలుగున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం 20 శాతం లిప్ట్ ఇరిగేషన్ పనులను పూర్తి చేయలేకపోయిందని ఫలితంగా ఈ ప్రాంతంలో పొలాలకు నీరు అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సాగునీరు విడుదల చేయకపోవడంతో సుమారు 25 వేల ఎకరాల్లో సాగు ఇబ్బందుల్లో పడిందన్నారు. జలవనరుల శాఖ మంత్రి నోటి పారుదల శాఖమంత్రి అని, తన శాఖపై ఆయనకు ఏ మాత్రం అవగాహన లేదని విమర్శించారు. వైసీపీ పార్టీ పేరులోనే రైతు అని పెట్టుకుంది కానీ ఏ మాత్రం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వంలో సాగునీటి కొరత ఏర్పడిన సమయంలో అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు అండగా ఉండేవారని అన్నారు. అధికారులు హామీ మేరకు రెండు రోజుల్లో రైతుల సమస్యలను పరిష్కరించకుంటే తదుపరి కార్యచరణ రూపొందించి ఉద్యమిస్తామన్నారు. 


  జనసేన, సీపీఐ, సీపీఎం నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందని విమర్శించారు. హైలెవల్ ఛానల్ కింద ఉన్నటువంటి 26,232 ఎకరాలలో పంట ఎండిపోతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు రైతు సమస్యలపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కృష్ణా డెల్టాకు నీరు తీసుకువచ్చి తూర్పు, పశ్చిమ కెనాల్ ఆయకట్టల కింద ఉన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


   రైతులు మాట్లాడుతూ జూన్, జూలైలో నీరు అందక పంట ఎండిపోయిందని, సెప్టెంబర్‌లో కురిసిన వర్షాల వల్ల మరల పంట మునిగిపోగ ఇప్పుడు సాగునీరు లేక కళ్ళెదుటే ఎండిపోతున్న పంటను కాపాడుకోలేక దైన్య స్థితిలో ఉన్నామని రైతులు విలపించారు. కాల్వల మరమ్మత్తులు చేపట్టకపోవడం, తూటుకాడ తీయకపోవడంతో అరకొరగా వస్తున్న నీరు పొలాలకు చేరడం లేదన్నారు. సాగునీరు అందడం లేదని ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీటి కోసం ఒక్కొక్క రైతు రూ. 10 వేలు ఖర్చు చేస్తుంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. సాగునీరు అందకపోవడంతో పంట చేతికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి విడుదలలో అలసత్వం తగదని, పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతుల అవస్థలను దృష్టిలో పెట్టుకొని, పంటలకు సరిపడా 6 వేల క్యూసెక్యుల సాగునీటిని విడుదల చేయాలని, కాంట్రక్టర్లకు రూ. కోటి 32 లక్షల పాత బకాయిలు విడుదల చేసి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 


ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన, సీపీఐ, సీపీఎం, నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments