ఎన్‌టీఆర్ జిల్లా, నవంబర్ 7 (ప్రజా అమరావతి);
*ఆలయ అభివృద్ధిలో తుది మాస్టర్ ప్లాన్‌కు భక్తుల సౌకర్యాలే గీటురాయి
*
- దేవాలయ, రెవెన్యూ, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలతో మాస్టర్ ప్లాన్ రూపొందిద్దాం
కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ఇంద్రకీలాద్రిపై సుమారు రూ. 200 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తయితే భక్తులు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారిని దర్శనం చేసుకునేలా దేవాలయ, రెవెన్యూ, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధుల సూచనలతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధికి ముసాయిదా ప్రణాళికను మంగళవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు.. స్థానిక ప్రజాప్రతినిధి, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు రూ. 200 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భక్తుల సౌకర్యాలే గీటురాయిగా తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీతో పాటు దసరా మహోత్సవాలు, భవానీ దీక్షల విరమణ రోజుల్లో అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధునాతన సౌకర్యాలు కల్పించేలా తుది ప్రణాళిక రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, నగరపాలక సంస్థ, ఇరిగేషన్, విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులు సూచనలు, సలహాలను తీసుకొని తుది ప్రణాళికను రూపొందిస్తే భవిష్యత్తుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని కలెక్టర్ తెలిపారు. మహాద్వార రాజగోపురం నిర్మాణంతో పాటు కనకదుర్గానగర్ నుంచి మహామండపం వరకు నాలుగు లైన్ల సిమెంటు రోడ్లు, సర్వీసు రోడ్ల నిర్మాణంతో పాటు ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ల్యాండ్ స్కేపింగ్, హార్డ్ స్కేపింగ్ వంటి పనులతో పాటు భక్తులకు అవసరమైన ఇతర సౌకర్యాలను కల్పించేందుకు డ్రాఫ్ట్ ప్లాన్‌ను రూపొందించడం జరిగిందన్నారు. టోల్‌ప్లాజా నుంచి అన్నదానం భవనం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్‌ల ఏర్పాటు, అన్నదాన భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అన్నదాన భవనం, టోల్‌ప్లాజాల నుంచి మల్లికార్జున మహా మండపం టెర్రస్‌కు మెట్ల మార్గం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రసాదాలు తయారు చేసేందుకు అవసరమైన లడ్డూ పోటు భవన నిర్మాణం, ప్రస్తుత మహామండపం భవనంలో క్యూ కాంప్లెక్స్ విస్తరణ, ప్రస్తుతం ఉన్న అన్ని మరుగుదొడ్లను ఆధునికీకరించడంతో పాటు క్యూలైన్లలో భక్తులకు అవసరమైన ప్రదేశాల్లో, అన్ని అంతస్తుల్లో అవసరమైన మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. పాత అరండాల్ సత్రం, కార్పొరేషన్ హెడ్ వాటర్ వర్క్స్ కు ఎదురుగా కేశఖండన శాల భవనాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని డార్మెటరీ హాల్స్, రూమ్‌లు, సూట్‌లు నిర్మాణంతో పాటు పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కనకదుర్గా నగర్ వద్ద మల్టీ లెవెల్ కారు పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసి భక్తుల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒకవిడతకు 500 మంది వరకు అన్నప్రసాదం తీసుకునేందుకు ఏర్పాట్లు ఉన్నాయని.. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా విడతకు 2,500 మంది ప్రసాదం తీసుకునేలా అన్నదానం ప్రాంగణాన్ని ఏర్పాటుచేయనున్నట్లు వివరించారు. అదే విధంగా కొత్త కేశఖండన శాల, 22 గదులతో ఆరు డార్మెటరీలు కూడా ప్రతిపాదించినట్లు తెలిపారు. దుర్గాఘాట్‌లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా 75 మీ. మేర విస్తరణ పనులు చేపట్టడంపైనా యోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముసాయిదా ప్రణాళికపై సమన్వయ శాఖల అధికారుల అభిప్రాయాలను తీసుకొని.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తుది బృహత్ ప్రణాళికను రూపొందిద్దామని కలెక్టర్ సూచించారు. అభివృద్ధి పనులు పూర్తయితే ఇంద్రకీలాద్రి ప్రాంగణానికి విద్యుత్ సరఫరా నిమిత్తం ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటుచేయాల్సిన అవసరముందని.. ఇందుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కనకదుర్గ ఘాట్‌ను మరికొంత మేరకు విస్తరించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.
భక్తులు కొండ దిగువ నుంచి సాఫీగా పైకి చేరుకొని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను దర్శనం చేసుకునేలా చేపట్టాల్సిన పనులను ప్రతిపాదించాలని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆలయ అధికారులకు సూచించారు. సాధారణ రోజులతో పాటు ఉత్సవాల రోజుల్లోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు ఉండాలన్నారు.
సమావేశంలో మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితిసింగ్, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్, ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్ రామరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజీనర్లు కోటేశ్వరరావు, రమ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సురేష్ రెడ్డి, ఇరిగేషన్ ఈఈ కృష్ణారావు, విద్యుత్ ఈఈ తదితరులు హాజరయ్యారు.
addComments
Post a Comment