నెల్లూరు నగరానికి తలమానికంగా నగరవనం.


నెల్లూరు: నవంబర్26 (ప్రజా అమరావతి);


నెల్లూరు నగరానికి తలమానికంగా నగరవనం


సుమారు 90% పనులు పూర్తి

త్వరలో ప్రారంభిస్తాం

          మంత్రి కాకాణి వెల్లడి.


నెల్లూరు నగరానికి తలమానికంగా అటవీశాఖ అన్ని  సదుపాయాలతో నగరవనం ను తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ , మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  అన్నారు. నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు సమీపంలో అటవీశాఖ నిర్మించిన నగరవనం ను మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదివారం ఉదయం సందర్శించారు. సుమారు మూడు కిలోమీటర్ల పైగా కాలినడకన నగరవనంలో తిరుగుతూ  జరుగుతున్న పనులను పరిశీలించారు. నగరవనం  లో మొక్కలు నాటారు. అటవీ శాఖ ద్వారా చేపట్టిన పనులను జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ మంత్రికి వివరించారు. ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా, ఉల్లాసంగా నగరవనాన్ని దర్శించే విధంగా అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. నెల్లూరు నగరం కాంక్రీట్ జంగిల్ గా మారిన పరిస్థితుల్లో ప్రకృతిని ఆస్వాదించడానికి, నగరవాసులకు  పరిసర ప్రాంత ప్రజలకు ఇది పెద్ద ఊరట అన్నారు. పిల్లలు ఆడుకునే ఆటస్థలం, ఓపెన్ జిమ్, షటిల్ కోఆర్ట్స్, యోగా సెంటర్, వాకింగ్ ట్రాక్, వ్యూ పాయింట్, మ్యూజికల్ ఫౌంటెన్ , ఓపెన్ థియేటర్ ఎంతో సుందరంగా నిర్మించారని మంత్రి అన్నారు. ఇంటి వద్ద స్థలం లేని ప్రకృతి ప్రేమికులకు మొక్కలు పెంచుకోవడానికి స్థలం కేటాయిస్తారని మంత్రి చెప్పారు.. ప్రతి కుటుంబం  సెలవు దినాలలో వచ్చి ఆనందించడానికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. 145 హెక్టార్లలో నిర్మించిన ఈ నగర వనం పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి , అటవీ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితరులను ఆహ్వానించి త్వరలో ప్రారంభోత్సవం చేసుకోనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

జిల్లా అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ నేతృత్వంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, మనసుకు హత్తుకునే విధంగా నగరవనాన్ని అద్భుతంగా రూపొందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు నగర పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం  చేసుకోవాలని మంత్రి కోరారు.

పర్యాటకులు ఆకర్షించే విధంగా రూపొందించిన నగరవనం గురించి ప్రజలకు తెలిసే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి అటవీ అధికారులకు సూచించారు. ప్రస్తుతం చేపడుతున్న పనులు, వసతులతో పాటు టాయ్ ట్రైన్, జిప్పర్ లైన్, వాటర్ ఫాల్స్ తో స్విమ్మింగ్ పూల్ అనుసంధానం చేయడం, జింకల సంఖ్యను వృద్ధి పొందించడం ,  వ్యూ పాయింట్ నుండి రోప్ వే కనెక్షన్ అనుసంధానం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ శ్రీ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీఎఫ్ఓ చంద్రశేఖర్ తో పాటు రేంజ్ అధికారులు మాల్యాద్రి, రవీంద్రబాబు, మహేశ్వర్ రెడ్డి, మోహన్ రావు అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.Comments