ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేయాలి:సిఎస్ డా.జవహర్ రెడ్డి.

 ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేయాలి:సిఎస్ డా.జవహర్ రెడ్డి


అమరావతి,8నవంబరు (ప్రజా అమరావతి):రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాసుపత్రులు,పిహెచ్సిలు,సిహెచ్చ్సిల్లో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం లో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలు, బోధనాసు పత్రులు,జిల్లా ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పనితీరుపై ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వాసుపత్రులు,ఏరియా ఆసుపత్రులు,కమ్యూనిటీ హెల్తు సెంటర్లు,ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలను పెద్దఎత్తున అందించాలని ఆదేశించారు.అదే విధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రీ ఆధరైజేషన్లను మరింత మెరుగు పర్చాలని ఆదేశించారు.అంతేగాక ఆరోగ్యశ్రీ సేవలను పొందిన రోగుల పోస్టు ఆపరేటివ్ కేర్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.వచ్చే సమావేశంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆసుపత్రుల వారీ పనితీరును సమీక్షించడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న వివిధ లాబరేటరీలను త్వరిత గతిన ఏర్పాటు చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అన్నిప్రభుత్వాసుపత్రులు,ఏరియా ఆసుపత్రులు,సిహెచ్చి,పిహెచ్చిల్లో ఆసుపత్రి ప్రసవాలను మరింత పెద్దఎత్తున జరిగేలా చూడాలని ఆదేశించారు.జగనన్నఆరోగ్య సురక్ష,ఫ్యామిలీ డాక్టర్ తదితర కార్యక్రమాల్లో ప్రజల నుండి మంచి సంతృప్త స్థాయి రావాలని ఆయన స్పష్టం చేశారు. 

ఈసమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సిఎస్ కు వివరించారు.రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె.నివాస్ వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు,సిహెచ్చిల ద్వారా అందిస్తున్నఆరోగ్య సేవలు, ఆరోగ్యశ్రీ సిఇఓ హరీంద్ర ప్రసాద్ ఆరోగ్యశ్రీ పధకం అమలు,ఎపి వైద్య విధాన పరిషత్ కమీషనర్ డా.ఎస్.వెంకటేశ్వర్లు ఎపి వైద్య విధాన పరిషత్ పరిధిలోని వివిధ ఏరియా ఇతర ఆసుపత్రులు ద్వారా అందిస్తున్న ఆరోగ్య సేవలు వాటి పనితీరు తదితర అంశాలను వివరించారు.

ఇంకా ఈసమావేశంలో డియంఇ డా.నర్సింహం పాల్గొన్నారు.


Comments