రెండు మాసాల్లోగా ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు పటిష్టత పనులు పూర్తి చేయాలి:సిఎస్ .

 రెండు మాసాల్లోగా ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు పటిష్టత పనులు పూర్తి చేయాలి:సిఎస్  


విజయవాడ,15నవంబరు (ప్రజా అమరావతి):విజయవాడ ఇంద్రకీలాద్రిపై గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఘాట్ రోడ్డు పటిష్టత పనులను రెండు మాసాల్లోగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఇంద్రకీలాద్రిపై గల శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు పటిష్టత పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు.భక్తులకు అసౌకర్యం కలగని రీతిలో ఘాట్ రోడ్డు పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేసేందుకు టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టాలని ఆదేశించారు.చిన్న ఘాట్ రోడ్డే అయినందున త్వరిత గతిన పటిష్టమైన రాక్ మిటిగేషన్ పనులు చేపట్టాలని అన్నారు. గతంలో తిరుమల కొండ ఘాట్ రోడ్డుపై కొండచర్యలు విరిగిపడి పెద్ద పెద్ద బండరాళ్ళు దిగువ రెండు మూడు వరసల్లో ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నదని గుర్తు చేశారు.అటువంటి ప్రమాదాలను ముందుగానే తెలుసుకుని అప్రమత్తమై ట్రాఫిక్ ను నియంత్రించేందుకు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నచోట్ల సెన్సార్లను ఏర్పాటు చేయగా వాటి ద్వారా అలాంటి ప్రమాదాలను రెండు మూడు గంటల ముందుగానే తెలిసుకుని ట్రాఫిక్ ను నియంత్రించి ఆప్రమాదాలను అధికమించడం జరుగుతోందని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.అదే రీతిలో ఇంద్రకీలాద్రిపై కూడా అలాంటి అవసరం ఉంటుందేమో పరిశీలన చేయాలని సిఎస్ అధికారులకు సూచించారు.

అనంతరం ఇంద్రకీలాద్రిపై మాస్టర్ ప్రణాళిక అమలులో భాగంగా చేపడుతున్నఎలివేటెడ్ క్యూ కాంప్లెక్సు నిర్మాణం,మల్టీలెవెల్ వాహనాల పార్కింగ్ విధానం,శివాలయం పునరుద్ధరణ, ప్రసాదం పోటు నిర్మాణ పనులు మొదలైన పనుల వివరాలను సిఎస్ జవహర్ రెడ్డి దేవాదాయశాఖ అధికారులను అడిగి తెల్సుకున్నారు.

ఈసమావేశంలో దేవాదాయశాఖ కమీషనర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 2కోట్ల రూ.ల అంచనా వ్యయంతో 180 మీటర్ల పొడవున ఈఘాట్ రోడ్డును పట్టిష్టం చేయనున్నట్టు వివరించారు.అదే విధంగా దేవాలయంలో చేపడుతున్నఇతర అభివృద్ధి పనులను సిఎస్ కు వివరించారు.ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు,విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఘాట్ రోడ్డు పటిష్టతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.

ఇంకా ఈసమావేశంలో విజయవాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్,శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఈఓ కెఎస్.రామారావు,మున్సిపల్ కార్పొరేషన్ సిఇ ప్రభాకర రావు,దేవాదాయశాఖ ఇఇలు కోటేశ్వరరావు,రమ తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments