వినియోగదారుల రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.. జిల్లా జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్.

 వినియోగదారుల రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి..

జిల్లా జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్


పుట్టపర్తి ,నవంబర్ 14 (ప్రజా అమరావతి):

వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని  మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం వినియోగదారుల రక్షణ చట్టం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వినియోగదారుల రక్షణ చట్టం అమలవుతున్న తీరుపై సంబంధిత శాఖ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన వినియోగదారుల రక్షణ చట్టంపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 డిసెంబర్ 24న భారత రాష్ట్రపతి ఆమోదం పొంది అమల్లోకి వచ్చిందని తెలిపారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రధాన లక్ష్యం లోపభూయిష్ట వస్తువులు , అసంతృప్తికరమైన సేవలు,  మోసపూరితమైన వాణిజ్య పద్ధతులు వంటి వివిధ రకాల దోపిడీకి వ్యతిరేకంగా వినియోగదారులకు సమర్థవంతమైన భద్రతలను అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య  ఉద్దేశ్యమని జాయింట్ కలెక్టర్ తెలిపారు. 1986 లో వినియోగదారుల రక్షణ చట్టం అమలు సమయంలో  కొన్ని లోటుపాట్ల ను సమీక్షించి తిరిగి 2019లో కొత్త చట్టం తీసుకువచ్చి వినియోగదారులకు సాధ్యమైనంత సత్వర నాయాన్ని చేకూర్చే విధంగా అమలు అవుతున్నదని తెలిపారు. వినియోగదారుల రక్షణ మండలి ఆధ్వర్యంలో వినియోగదారులకు మరిన్ని హక్కులు కల్పించడం వాటికి తగినంత ప్రాచుర్యం కల్పించడం కోసం విస్తృతంగా చట్టంపై ప్రజలను అవగాహన చేసేందుకు చైతన్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. అంతేగాక ఈ కొత్త చట్టం ద్వారా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లను మరింత శక్తివంతంగా చేయడంతో పాటు వాటి పరిష్కారానికి కమిషన్ లను ఆశ్రయించి సత్వర పరిష్కారం పొందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే లోక ఆదాల తరహా మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు. వినియోగదారుని బాధ్యతలో భాగంగా ప్రతి వినియోగదారుడు తాను కొనుగోలు చేసే వస్తు సేవలు చెందిన పెద్దవైన రసీదు తీసుకోవాలని తద్వారా వస్తు సేవల పన్ను ప్రభుత్వానికి చేరుతుందని తెలిపారు. వినియోగదారులు ఫిర్యాదు చేయాలనుకుంటే తప్పనిసరిగా బిల్లు పొంది ఉండాలని బిల్లు తీసుకుంటే వ్యాపారులు ప్రభుత్వానికి పనులు సక్రమంగా చెల్లిస్తారని అంతేకాకుండా వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేయాలంటే బిల్లు తిరుగులేని సాక్ష్యంగా ఉంటుందని 

జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో వినియోగదారుల రక్షణ మండల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇందులో స్వచ్ఛంద సేవా సంస్థలు చురుకైన పాత్ర వహించాలని సూచించారు. ఈ సందర్భంగా వినియోగదారుల రక్షణ మండలి లోని స్వచ్ఛంద సేవా సంస్థలు ఇతర ప్రతినిధులు  తమకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని జాయింట్ కలెక్టర్ ను కోరగా దీనిపై జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ జిల్లా పౌరసరఫరాల అధికారి ద్వారా చర్యలు చేపట్టి గుర్తింపు కార్డులో మంజూరు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వంశీకృష్ణ, డిఎంహెచ్ ఓ డా. ఎస్ వి కృష్ణారెడ్డి, జిల్లా కొలతలు తూనిక శాఖ అధికారి గౌస్, ఫుడ్ సేఫ్టీ శాఖ శ్రీధర్, రీజినల్ మేనేజర్ ఆర్టీసీ మధుసూదన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ రషీద్ ఖాన్, వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు తాడిమర్రి వెంకటేష్, కదిరి గఫూర్ రామిరెడ్డి, భవ్య, పెనుగొండ వెంకటేష్, హిందూపూర్ నాగజ్యోతి, పరిగి వెంకట రామప్ప, ధర్మవరం నారాయణమ్మ, పోలా ప్రభాకర్, గోరంట్ల మణిమాల తదితరులు పాల్గొన్నారు.


Comments