చురుగ్గా జరుగుతున్న గుండాల క్షేత్ర నిర్మాణ పనులు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.
*చురుగ్గా జరుగుతున్న గుండాల క్షేత్ర నిర్మాణ పనులు : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్


*


*రూ.10 కోట్లతో  ఆలయ గోపురం, కల్యాణమంటపం నిర్మాణం*


*రూ.3కోట్లతో నిర్మించనున్న కాపు సామాజిక కల్యాణ వేదిక భవనానికి భూమి పూజ*


*స్థల దాత ఐపీ ప్రసాద్ ను సత్కరించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన*


*డోన్ టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్ లకి ఛాలెంజ్ విసిరిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్*


*రూ.2500 కోట్ల అభివృద్ధి పనుల్లో ఏ ఒక్కటైనా అబద్ధమని నిరూపించగలరా?*


*ఇళ్ల పట్టాలిచ్చేది టీడీపీ పార్టీనా? డోన్ టీడీపీ ఇన్ఛార్జా? ప్రజలకు చెప్పాలి*


*డోన్ నియోజకవర్గంలోని 30వేల మంది పేదలకు రూ.1700కోట్లతో ఇళ్ల పట్టాలిస్తారా?*


*అమలుకాని మోసపు హామీలు...సీటివ్వరేమోననే ఆందోళనతోనే కదా?*


డోన్, నంద్యాల జిల్లా, నవంబర్ , 07 (ప్రజా అమరావతి); డోన్ మండలంలో కొలువైన గుండాల చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సందర్శించారు. రూ.10 కోట్లతో చురుగ్గా జరుగుతున్న గుడి నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. కల్యాణమంటపం, ఆలయ గోపురం సహా గుండాల క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.త్వరగా పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్ ను ఆయన ఆదేశించారు. అంతకు ముందు డోన్ పట్టణంలో రూ.3 కోట్లతో నిర్మించతలపెట్టిన కాపు సామాజిక వర్గానికి చెందిన కల్యాణ వేదికకు సంబంధించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థల దాత ఐపీ ప్రసాద్ ను మంత్రి బుగ్గన సత్కరించి అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ...సేవా రంగంలో అత్యధికులు..కాపు సామాజిక వర్గ సోదరులేనని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎంతో అనుభవంతో శివనాగిరెడ్డి ఇచ్చిన సలహాలు వెలకట్టలేనివన్నారు. నాటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కాపు సామాజికవర్గమంతా ఆదరించి తనకు అండగా నిలబడినట్లు తెలిపారు.


*డోన్ టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్ లకి  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఛాలెంజ్*


డోన్ టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్ లకి  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఛాలెంజ్ విసిరారు. రూ.2,500 కోట్లతో డోన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఏ ఒక్కటైనా టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి నిజం కాదని నిరూపించగలరా అన్నారు.  రూ.750 కోట్లతో ముమ్మరంగా పనులు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మించడం లేదని నిరూపించగలరా? అని ప్రశ్నించారు. డోన్ లో వెంకటనాయుడుపల్లి, రేకులకుంట లాంటి మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించలేదని ఫోటోలు తీయగలరా అన్నారు. రూ.350 కోట్లతో వేగంగా సాగుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు జరగడం లేదని చెప్పగలరా? అంటూ మంత్రి ప్నశ్నించారు. బుగ్గానిపల్లెలో 8 ఎకరాలలో నీటిని శుభ్రపరిచే వ్యవస్థ లేదని సెల్ఫీ తీసి పోస్ట్ చేయాలన్నారు.లేవు లేవంటున్న ప్రతిపక్ష నాయకులతో సహా డోన్ నియోజకవర్గంలోని  ప్రతి ఇంటికీ తాగునీరిస్తామని  మంత్రి బుగ్గన వెల్లడించారు. 36 చెరువులకు నీళ్లు నింపలేదని, పైపుల ద్వారా 24 గ్రామాలకు సాగునీరు సరఫరా చేయడంలేదని చూపించాలన్నారు. రూ.253 కోట్ల ప్రాజెక్టులో ఒక చోట వాల్వ్ లేకపోతే, ఒక చోట నీరు లీక్ అయితే ప్రాజెక్టే లేదనేలా ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఇల్లు కట్టుకునే సమయంలో ఎంతటి వారైనా ఏ చిన్న ఇబ్బంది జరగకుండా కట్టడం సాధ్యమా? అంటూ చురకంటించారు. బీసీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కట్టడాలు లేవని ఫోటోలు తీయండి?..కేంద్రీయ విద్యాలయం డోన్ కు రాలేదని పత్రాలు పంచండి? అంటూ మంత్రి బుగ్గన మండిపడ్డారు. ప్రశాంత వాతావరణంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం లేదని చాటగలరా? అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డోన్ లో టీటీడీ కల్యాణ మండపం, రైల్వే పనులు జరగడం లేదన్న ప్రతిపక్షాలు కళ్లు తెరచి చూడాలన్నారు. టీడీపీ హయాంలో రైల్వే బ్రిడ్జి ఎవరి కోసం కట్టారో, ఎక్కడి నుంచి ఎక్కడకి పోయిందో డోన్ ప్రజలకు తెలియదా అని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. అండర్ పాస్ బ్రిడ్జీ కట్టాలంటే సిమెంట్ మోల్డ్ ల తయారీకి చాలా సమయం పడుతుందన్న  ప్రాథమిక విషయం తెలుసా? అని ప్రశ్నించారు. రూ.వేలాది కోట్లతో వందలాది ప్రాజెక్టులు కట్టిన మాకు మీలాగా అబద్ధాలతో ప్రచారం చేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదని టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డికి సూటిగా బదులిచ్చారు.అధ్వాన్నమైన విష ప్రచారం మా నైజం కాదన్నారు. 


*డోన్ లో 30వేల మంది నిరుపేదలకు సెంటున్నర స్థలానికి రూ.1700 కోట్లు టీడీపీ ఇస్తుందా? ధర్మారెడ్డి ఇస్తారా?*


డోన్ లో 30వేల మంది నిరుపేదలకు సెంటున్నర స్థలానికి రూ.1700 కోట్లు టీడీపీ ఇస్తుందా? ధర్మారెడ్డి ఇస్తారా?* అంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూటిగా ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తారా? డోన్ టీడీపీ ఇన్ ఛార్జ్ ధర్మారెడ్డి ఇస్తారా? క్లారిటీ ఇవ్వాలన్నారు. ఏ ఆధారంగా ఇళ్లు ఇస్తారు? ఏ ప్రామాణికంగా అందజేస్తారో ప్రజలకి చెప్పాలన్నారు. ఇప్పటికే మా ప్రభుత్వం ఇళ్లు, ఇళ్ల పట్టాలిచ్చేసింది. కొత్తగా ఇంకో ఇల్లు ఇస్తారా? అది కూడా చెప్పాలన్నారు. డోన్ నియోజకవర్గవ్యాప్తంగా 700 ఎకరాలు సేకరించి..ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున రూ.1700 కోట్లు టీడీపీ ఖర్చు పెట్టి ఇళ్లిస్తుందా తెలియజేయాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడేవాళ్లు ఇచ్చే హామీలా ఇవి అంటూ సెటైర్లు వేశారు. కరవుపైన గణాంకాల శాఖ అధ్యయనం చేస్తుందని ఆ తర్వాత  విడతల వారీగా పరిశీలించి తుది నివేదిక తర్వాత కరవు మండలాలను ప్రకటించడం సాధ్యమవుతుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. టీడీపీ నాయకులంతా కలిసి వెళ్లి ప్రచారమే పరమావధిగా కాలక్షేపం చేశారన్నారు. అబద్ధాల సుబ్బారెడ్డి  రోడ్లపై తిరగగాలేనిది? అభివృద్ధి చేసిన తాను తిరగలేనా? అని మంత్రి బుగ్గన అన్నారు. సొంత తమ్ముళ్లను, డోన్ ప్రజలను మోసం చేసిన ధర్మవరం సుబ్బారెడ్డి కూడా విమర్శించడం హాస్యాస్పదమన్నారు. 


ఈ కార్యక్రమానికి  రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, డోన్ మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, కాపు సామాజికవర్గ సంఘ నాయకులు, తదితరులు హాజరయ్యారు.


Comments