నిబంధనలకు విరుద్ధంగా బైక్ లు నడిపితే చర్యలు తప్పవు... అర్బన్ సిఐ హెచ్చరిక.

 నిబంధనలకు విరుద్ధంగా బైక్ లు నడిపితే చర్యలు తప్పవు... అర్బన్ సిఐ హెచ్చరిక.


  మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి అర్బన్ పరిధిలో యువకులు, మైనర్లు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్  రైడింగ్ చేయడం, లైసెన్సులు లేకుండా బైక్ లు నడపడం, సైలెన్సర్లు తీసివేసి పెద్ద పెద్దగా సౌండ్ చేయడం వంటివి విపరీతంగా జరుగుతున్నాయని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్బన్ సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నారు. సీఐ అర్బన్ పరిధిలో తిరుగుతూ ఆయా సెంటర్లలో ప్రత్యేక డ్రైవ్ చేస్తూ యువకులను, మైనర్లను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి, తిరిగి పునరావతం అయితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చే వారికి, మైనర్ల తల్లిదండ్రులకు కూడా మీడియా ద్వారా సిఐ సూచనలను, హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లను, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకులను, లైసెన్స్ లేని వారిని అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ పరిధిలో నిబంధనకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రజలకు ఇబ్బందులను కలుగజేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు.


Comments