మంగళగిరి చేనేతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు.

 *మంగళగిరి చేనేతకు ప్రపంచ వ్యాప్తంగా  గుర్తింపు.*



*- ఇతర నియోజకవర్గాలకు మంగళగిరి నియోజకవర్గం ఆదర్శం.*


*-రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.*


*- తాడేపల్లిలో టంగుటూరి ప్రకాశం పంతులు, మంగళగిరి లో నేతన్న  విగ్రహాలను ఆవిష్కరించిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి.*


మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి చేనేతకు ప్రపంచ వ్యాప్తంగా  గుర్తింపు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్యేయమని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు.  మంగళగిరి -తాడేపల్లి కార్పోరేషన్ పరిధి చినకాకాని వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నేతన్న సర్కిల్, నేతన్న విగ్రహాన్ని  శనివారం ఆయన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK)తో కలిసి ఆవిష్కరించారు.  అనంతరం  ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విలేకరులతో  మాట్లాడుతూ... ఆంధ్ర రాష్ట్రం లోనే మంగళగిరి చేనేతకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, వృత్తి లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు లు  అందరి సహకారంతో నేతన్న సర్కిల్ ను తీర్చిదిద్దడం ఎంతైనా అభినందనీయమని కొనియాడారు.  ప్రతి నేతన్న కు గుర్తింపు రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిలో  నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ధిష్ట సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని గుర్తు చేశారు.  ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు లతో పాటు అధికార యంత్రాంగం చాలా చక్కగా పనిచేస్తున్నారన్నారు.  కొద్ది సేపటి క్రితం తాడేపల్లి ప్రకాశం బ్యారేజి వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు.  ప్రకాశం పంతులు మహనీయుడిని కొనియాడారు.  అటువిలువలు, విశ్వసనీయత పద్ధతులు ఒకవైపు...ఇటు శ్రామికుడు,కష్టం, గుర్తింపు ఒకవైపు అనే విధంగా ప్రకాశం పంతులు విగ్రహాన్ని, నేతన్న విగ్రహాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) మాట్లాడుతూ... దేశంలోనే వ్యవసాయం తర్వాత అతిపెద్ద వృత్తి  చేనేత వృత్తి అని, ఇది ఒక గొప్ప కళ అన్నారు.   మంగళగిరి లో ఒకప్పుడు 10వేల మగ్గాలు ఉండేవని, నేడు కేవలం రెండువేల మగ్గాలకు పరిమితమైన నేటి తరుణంలో చేనేత వృత్తిని, కళను బ్రతికించుకుని ప్రపంచానికే  తెలియజేయాలన్నదే తమ‌ధ్యేయమన్నారు.  దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24వేల ఆర్థిక సహాయంతో పాటు పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు.  మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ లో ఐదు అంతస్తులతో 40షాపులతో చేనేత బజార్ ను నిర్మించడం జరిగిందని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.  రాజీవ్ గృహ కల్ప ఆవరణలో చేనేతలకు వాక్ టు వర్క్ పేరుతో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో చేనేత షెడ్లను నిర్మించాలనుకున్నారని, దురదృష్టవశాత్తూ ఆయన మృతి చెందడంతో షెడ్ల నిర్మాణం నిలిచిపోయిందన్నారు.  నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చేనేత షెడ్లను నిర్మించి 150మంది చేనేత కార్మికులకు కేటాయించడం జరిగిందన్నారు.  మంగళగిరి కి ఐకానిక్ గా  నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ... ఆనాడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేనేత కార్మికుల  ఇళ్ల నిర్మాణకోసం 25ఎకరాలను కేటాయించి సుమారు ఐదు వందల నివాసాలను నిర్మించడం జరిగిందన్నారు. ఆయన హయాంలో నిలిచిన చేనేత షెడ్లను నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో నిర్మించి 150మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. నగరంలోని పాత బస్టాండ్ సెంటర్ లో ప్రగడ కోటయ్య, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పేరుతో సుమారు రూ.2కోట్లతో చేనేత దుకాణాలను నిర్మించడం జరిగిందన్నారు.  నగరంలోని వై జంక్షన్ వద్ద నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి చేనేతకు మరింత గుర్తింపు తీసుకువచ్చిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంతైనా అభినందనీయుడని కొనియాడారు. భవిష్యత్తులో చేనేత కార్మికులకు చేయూతనందించే విధంగా మంగళగిరి నగరాన్ని తీర్చిదిద్దడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్ఆర్ సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి, జిల్లా వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, బుర్రముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, ఈదులమూడి డేవిడ్ రాజు, మార్కెట్ యార్డ్  ఛైర్ పర్సన్ మునగాల భాగ్యలక్ష్మి,  పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్,  నగర కమిషనర్ నిర్మల్ కుమార్,  అడిషనల్ కమిషనర్ హేమమాలిని, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, డీఈ కృష్ణారెడ్డి, ఏఈ కిషోర్, హ్యాండ్ లూమ్ ఏడీ వనజ, పట్టణ పార్టీ మహిళా అధ్యక్షురాలు సంకె సునీత,  తదితరులు పాల్గొన్నారు.


Comments