రాష్ట్ర ఇంధన రంగంలో కీలక ముందడుగు.


- రాష్ట్ర ఇంధన రంగంలో కీలక ముందడుగు


- ఎపిఎండిసి, జెన్కో అధికారులతో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంయుక్త సమావేశం

- ఎపి జెన్కో ప్లాంట్లకు సుల్యారీ గనుల నుంచి బొగ్గు సరఫరాపై చర్చ

-  బొగ్గు కేటాయింపులకు మార్గం సుగమం

-  రాబోయే రోజుల్లో క్యాప్టీవ్ బొగ్గుగనులపై దృష్టి

- ఇకపై కొత్త బొగ్గుగనులకు జరిగే వేలంలో ఎపిజెన్కో-ఎపిఎండిసి జాయింట్ వెంచర్ గా పాల్గొంటాయి

- కోల్ మైన్స్ ప్రాంతంలోనే ఎపిజెన్కో ఆధ్వర్యంలో ప్లాంట్లు

- ఎపిఎండిసి ద్వారా బొగ్గు వెలికితీత- జెన్కో ద్వారా విద్యుత్ ఉత్పత్తి

- సీఎం శ్రీ వైయస్ జగన్ ఆలోచనలతో ఇంధన రంగంలో పురోగతి

- ఇకపై థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా ముందుచూపుతో నిర్ణయాలు


మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


 

అమరావతి (ప్రజా అమరావతి):


1) రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు సరఫరాలో ముందడుగు పడింది. ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎపిఎండిసి మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో సొంతగా బొగ్గు గనులను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం అక్కడి నుంచి ఈ బొగ్గును తెచ్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎపిఎండిసి-ఎపి జెన్కోల మధ్య కీలక చర్చలు జరిగాయి.

2) ఈ మేరకు వెలగపూడిలోని సచివాలయంలో శుక్రవారం రాష్ట్ర ఇంధన, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఎపిఎండిసి, మైన్స్, ఇంధనశాఖ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు కె.విజయానంద్ (ఎనర్జీ), గోపాలకృష్ణ ద్వివేది (మైన్స్) సమక్షంలో ఎపి జెన్కో, ఎపిఎండిసి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలకు బొగ్గుసరఫరాపై చర్చించారు. ఎపిఎండిసి ఆధ్వర్యంలోని గనుల ద్వారా వెలికితీస్తున్న బొగ్గును రాష్ట్ర అవసరాల కోసం వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా జెన్కో అధికారులను మంత్రి ఆదేశించారు. సుల్యారీ గనుల నుంచి బొగ్గు సరఫరా వల్ల అందుబాటు ధరలో ఎపిజెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు అవసరాలు తీరే వీలుందని, దీనికి గానూ నిబంధనల ప్రకారం అనుసరించాల్సిన విధానంను ఖరారు చేయాలని ఇరు విభాగాల అధికారులకు సూచించారు. త్వరలోనే ఎపిఎండిసి నిర్వహించే టెండర్ల ప్రక్రియలో నిబంధనల ప్రకారం పాల్గొని, తమ అవసరాలకు అనుగుణంగా బొగ్గు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జెన్కో అధికారులను ఆదేశించారు. దీనికి ఎపిఎండిసి నుంచి కూడా పూర్తి సహకారంను అందించాలని కోరారు.  3) రాష్ట్రంలో ఇంధన రంగాన్ని పటిష్టం చేసేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ ముందుచూపుతో అనేక నిర్ణయాలు తీసుకున్నారని ఈ సందర్భంగా మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న ఎపిఎండిసి ద్వారా ఇతర రాష్ట్రాల్లో బొగ్గుగనులను నిర్వహించేందుకు అవసరమైన చేయూతను అందించారని తెలిపారు. అందువల్లే మధ్యప్రదేశ్ లోని సుల్యారీలో ఎపిఎండిసి బొగ్గుగనుల్లో ఉత్పత్తి ప్రారంభించగలిగామని, నేడు విజయవంతంగా బొగ్గు వెలికితీత జరుగుతోందని అన్నారు. ఇప్పుడు ఈ బొగ్గును మన రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం లభించిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  


4) ఇదే క్రమంలో రాష్ట్రంలోని విద్యుత్ అవసరాలకు కావాల్సిన బొగ్గు గనుల కేటాయింపు లపై కూడా దృష్టి సారించాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ ఆలోచనల్లో భాగంగానే నేడు ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇకపై కేంద్రప్రభుత్వం జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతాల్లో కోల్ మైన్స్ కోసం నిర్వహించే వేలంలో ఎపిఎండిసి-ఎపి జెన్కో జాయింట్ వెంచర్ గా పాల్గొంటాయని తెలిపారు. ఎపిఎండిసి ద్వారా బొగ్గు వెలికితీత, ఎపిఎ జెన్కో ద్వారా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. బొగ్గు లభించే ప్రాంతంలోనే జెన్కో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, బొగ్గు రవాణా భారం లేకుండా నేరుగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ద్వారా మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. 

5) ఎపిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మన రాష్ట్రానికే చెందిన ఎపిఎండిసి ద్వారా వెలికితీసే బొగ్గును వినియోగించుకోవడం ద్వారా అధిక విద్యుత్ డిమాండ్ ఉండే వేసవికాలంలోనూ బొగ్గు కొరత లేకుండా జాగ్రత్త పడవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. అటు గనులు, ఇటు విద్యుత్ రంగంలోనూ దీనివల్ల మరింత పురోగతి సాధ్యపడుతుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు వీలవుతుందని అన్నారు. 


6) ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు కె.విజయానంద్ (ఎనర్జీ), గోపాలకృష్ణ ద్వివేది (మైన్స్), జెన్కో ఎండి కెవిఎన్ చక్రధర్ బాబు, గనులశాఖ డిఎంజి విజి వెంకటరెడ్డి, ఎపిఎండిసి సలహాదారులు డిఎల్ఆర్ ప్రసాద్, కె.నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ బిపిన్ కుమార్, జెన్కో డైరెక్టర్ ఆంథోనిరాజా  తదితరులు పాల్గొన్నారు.

Comments