చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ఏపీకి ప్రతిష్టాత్మక అవార్డులు.



*చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ఏపీకి ప్రతిష్టాత్మక అవార్డులు*



అమరావతి,నవంబర్ 20 (ప్రజా అమరావతి): చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన కృషి కి గాను కేంద్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మక  అవార్డుల్ని అందజేసింది.

ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అవార్డులతో ప్రశంసించింది.  2022, 2023 సంవత్సరాలకు డయేరియా నియంత్రణా పక్షోత్సవాల ప్రచార  నిర్వహణలో అత్యుత్తమ పనితీరును కనబర్చి అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు ప్రతిష్టాత్మక ముస్కాన్  అవార్డు లభించింది.  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన నవజాత శిశు సంరక్షణ వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ అవార్డులను అందచేశారు.  నవజాత శిశువులు, వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ చూపిన చొరవకు ఈ అవార్డులు నిదర్శనంగా నిలిచాయి.  గర్భస్థ, నవజాత శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించటంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చూపిన పనితీరుపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ బాలల ఆరోగ్య విభాగం ప్రశంసల జల్లు కురిపించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమీషనర్, బాలల ఆరోగ్య పరిరక్షణా విభాగం  ఇన్ఛార్జ్ డాక్టర్ శోభనా గుప్తా  ఈ అవార్డుల్ని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు అందచేశారు.   రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తమ కర్తవ్య నిర్వహణలో చూపిన పనితీరును వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ ఎం.డి జె నివాస్  ప్రశంసించారు. నవజాత శిశువులతో పాటు వారి తల్లులకు అత్యుత్తమ స్థాయి ఆరోగ్య సేవలందచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషిని వారు కొనియాడారు.  చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి శ్రీవైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ అవార్డులు ప్రతీకగా నిలుస్తున్నాయి.  గర్భస్థ, నవజాత శిశు మరణాల రేటును తగ్గించటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన విజయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, నిలుస్తున్నాయనటంలో ఎటువంటి సందేహమూ  లేదనే చెప్పాలి. 

  ఆరోగ్య పరిరక్షణ, రోగనిరోధక శక్తి పెంపుదల, నాణ్యమైన వైద్యసేవల విషయంలో అంకిత భావంతో పనిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ, ప్రజారోగ్య పరిరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోంది.  

 ఎన్ హెచ్ఎం రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వెంకట రవికిరణ్, ఛైల్డ్ హెల్త్ ఇమ్యునైజేషన్  జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె. అర్జునరావు సోమవారం నాడు మంగళగిరిలోని  ఎపిఐఐసి టవర్స్  లో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ జె. నివాస్ ను ఆయన ఛాంబర్లో  కలిసి ఈ అవార్డుల్ని చూపించారు.  శిశుఆరోగ్య విభాగం రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ వి. విజయ్ కుమార్, చిలకా పాములు, డాక్టర్ రామారావు, డాక్టర్ నరేంద్ర, జ్యోతి, వినోద్ కుమార్ తదితరులు కమీషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు. 

Comments