రాజ్యాధికారంలో బీసీలకు భాగస్వామ్యం - ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ సజ్జల .

 రాజ్యాధికారంలో బీసీలకు భాగస్వామ్యం

- ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ సజ్జల 


విజయవాడ (ప్రజా అమరావతి);


సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యతను తమ ప్రభుత్వం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం విజయవాడ శ్రీరామ ఫంక్షన్ హాలులో బీసీ వెల్ఫేర్ జెఏసి సంఘం ఆధ్వర్యంలో బీసీల ఐక్యత, సమగ్రాభివృద్ది అనే అంశంపై రాష్ట్రంలో బీసీ సంఘాల నాయకులతో బీసీ వెల్ఫేర్ జెఏసి వ్యవస్థాపక అధ్యక్షుడు అంగిరేకుల ఆదిశేషు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రపంచం, కాలం  మారుతున్నప్పుడు వాటితో పాటు మనం కూడా మారాలన్నారు. అవకాశాలు  పెరుగుతున్నప్పుడు, సాంకేతికత వచ్చినపుడు  కులవృత్తులు  కూడా  మారుతాయన్నారు. కుల వృత్తుల వారికి కత్తెర్లు, ఇస్త్రిపెట్టెలు ఇవ్వడం కాకుండా వారి పిల్లల ఉన్నత చదువులతో పాటు మెరుగైన వైద్యం అందిస్తున్న ప్రభుత్వం తమదన్నారు. సామాజిక న్యాయానికి తమ పార్టీ   కట్టుబడి ఉందన్నారు.  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవుల్లో పెద్దపీట వేశామన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్యాస్ట్ కాదు,  బ్యాక్‌ బోన్‌ క్యాస్ట్ అన్నారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యున్నత  పదవులు ఇచ్చామన్నారు. ఓట్ల కోసం నినాదాలు ఇచ్చే పార్టీ తమది కాదని, వారిని అధికారంలో భాగస్వామ్యం చేయడమే తమ  కర్తవ్యమన్నారు. అట్టడుగు వర్గాల రాజకీయ  సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఆర్ధిక  వెనకబాటుతనం  పోగొట్టాలన్నదే ఆయన ఆలోచన అన్నారు. అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి ఎస్సీ, ఎస్టీ బీసీలు వచ్చేలా తమ ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. మంత్రి మెరుగు నాగార్జున, ప్రభుత్వ విప్ లెళ్ళ అప్పిరెడ్డి లు బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అన్నారు.  అంగిరేకుల ఆదిశేషు మాట్లాడుతూ  చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలో బీసీలకు పటిష్టంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రాష్ట్ర రాజధానిలో బీసీ భవన ప్రధాన కార్యాలయ నిర్మాణానికి 2 వేల గజాలు స్థలం కేటాయించాలన్నారు. ప్రతి మండలంలో బీసీ భవనం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ వెనుకబడిన కులాలలకు కేంద్రంలో తక్షణమే ఓబీసీ లుగా గుర్తించాలన్నారు.  బీసీ మహిళ సాధికారత కు సాంకేతిక శిక్షణ, ఉపాధి కల్పించాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. బీసీ అట్రాసీటీ చట్టం ప్రవేశపెట్టి పటిష్టంగా అమలు చేయాలన్నారు. ముందుగా మహాత్మా  జ్యోతిరావు సావిత్రి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేదికపై నృత్య కళాకారిణి కావేరి  కూచిపూడి నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ జెఏసి గౌరవ అధ్యక్షుడు పి వెంకట్రావు, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు, డాక్టర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ ఆర్ నాగేశ్వరి, ధనలక్ష్మి,  బొడ్డు కృష్ణ భగవాన్, అశ్వని, ఉమా,  వివిధ బీసీ సంఘాల అధ్యక్షులు నరసింహారావు, మల్లేశ్వరరావు, మేకల హనుమతురావు, మారేష్, కే శ్రీనివాస్, ఎన్వీ రావు, యనమల మాధవి, హుస్సేన్, మెడుబోయిన గంగా, ఎంవీవీయస్ మూర్తి, వరప్రసాదరావు,   నాగరాజు, నరసింహరావు, పెచ్చెట్టి లక్ష్మి విమల, కృపా మణి తదితరులు ఉన్నారు.

Comments