కాంగ్రెస్‌ అధ్యక్షుడి అహంకారానికి హద్దులే లేవ్‌..! రేవంత్‌పై మండిపడ్డ సీఎం కేసీఆర్‌.

 కాంగ్రెస్‌ అధ్యక్షుడి అహంకారానికి హద్దులే లేవ్‌..! రేవంత్‌పై మండిపడ్డ సీఎం కేసీఆర్‌


అశ్వారావుపేట (ప్రజా అమరావతి);

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అహంకారానికి హద్దులే లేవని.. ఆయనేం పడగొడుతడో తెల్వదని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.


'ఇవాళ కాంగ్రెస్‌ బాధ్యతా రహిత్యంగా మాట్లాడుతున్నది. ఇదే జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు అందరూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. వాళ్లు వచ్చేది లేదు సచ్చేది లేదు. వస్తే వేస్తరనుకుందాం. వేస్తే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. గతంలో ప్రభుత్వంలో రూపాయి సాంక్షన్‌ కావాలంటే ఎన్ని ఆఫీసులు తిరిగేది ? ఎంతమంది పైరవీకారులు ఉండేది ? ఈ రోజుల అట్ల లేదు' అన్నారు.


'ధరణి పుణ్యమాని హైదరాబాద్‌లో డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్‌ఫోన్లు టింగుటింగుమని మోగుతున్నయ్‌. ధాన్యం అమ్మిన డబ్బులు కూడా ఖాతాల్లో జమవుతున్నయ్‌. రైతులపట్ల సానుభూతి లేని పార్టీ ధరణిని తీసివేస్తమని మాట్లాడుతున్నది. మరి రైతుబంధు ఎలా వస్తుంది ? అని నేను అడిగితే వాళ్లు సమాధానం చెప్పడం లేదు. మళ్లీ పహానీ నకళ్లు, దళారులు, పైరవీకారులు డబ్బులు ఇవ్వాల్సిందే. మళ్లీ మొదటికే వెళ్తుంది. దరఖాస్తులు పెట్టడం.. ఆఫీసుల చుట్టూ తిరుగడం జరుగుతుంది. పారదర్శకంగా రూపాయి పొల్లుపోకుండా మేం ఎంత డబ్బు వేస్తే అంత డబ్బు మీ ఖాతాల్లో జమవుతున్నది. అందుకే నేను కోరింది ఏ పార్టీ వైఖరి ఏంది అనేది మీరు చూడాలి. ఆలోచన సరళి ఏంది అనేది చూడాలి. చూడకుండా గుడ్డిగా ఓటు వేస్తే కష్టమైతుంది. దయ చేసి ఆలోచించి పార్టీల వైఖరిపైనే ఓటుండాలి' అంటూ పిలుపునిచ్చారు.


'పీసీసీ అధ్యక్షుడు ఒకటి రెండు, మూడు, నాలుగుసార్లు చెబుతున్నడు. ఆయన అహంకారానికి హద్దులే లేవు. ఆయన ఏం పడగొడుతడో.. ఏం చేస్తడో నాకు తెల్వది కానీ.. ఆయనకు ఉన్న అవగాహన ఏంటో నాకు తెల్వదు. ఆయనకు తెలివి ఏంటో తెలియదు. నేను కూడా రైతునే. కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. ఒకాయనేమో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆయన చెబుతున్నడు. కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన ట్యాక్స్‌ డబ్బంతా రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నడు అంటున్నడు. రైతుబంధు కావాలి అంటూ ప్రజలు నినదించారు. రైతుబంధు కావాలంటే మెచ్చ నాగేశ్వర్‌రావు గెలవాలి. ధరణిని బంగాళాఖాతంలో వేస్తరటా.. రైతుబంధు దుబారనట.. ఇంకో మాట చెబుతున్నరు డేంజరస్‌గా. కరెంటు 24గంటలు వేస్ట్‌.. కేసీఆర్‌ డబ్బులన్నీ చెడగొడుతున్నడు.. మూడు గంటలు ఇస్తే సరిపోతది అంటున్నడు. మరి మూడు గంటల కరెంటు సరిపోతుందా? కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అదే పనైతది. అందుకే నేను చెప్పేది. ఎవరి వైఖరి ఏంది.. ఏ పార్టీ ఏం చెబుతున్నది ఆలోచించకుండా ఓటు వేస్తే ఆగమైపోతాం. మూడు గంటల కరెంటు పొలాలు పారుతాయా.. పామాయిల్‌ తోటలైనా పారుతాయా? 24 గంటల కరెంటు కావాలంటే మెచ్చ నాగేశ్వర్‌రావు గెలవాలి' అన్నారు.


'ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికతోనే కథ ఆగిపోదు. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే.. హైదరాబాద్‌లో ఆ పార్టీ గర్నమెంట్‌ ఏర్పడుతుంది. పైన ఏ గవర్నమెంట్‌ రావాల్నో.. ఆ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనే మనకు లాభమైతది. ఈ రెండు విషయాలు ఇబ్బంది పెట్టే విషయాలు. గత కాంగ్రెస్‌ రాజ్యంలో 20-30 ఏళ్లు ఏడ్చాం. ఈ విషయాలన్నీ బాధలు అనుభవించారు కాబట్టి.. మీకు తెలుసుది. కాబట్టి జాగ్రత్తగా ఓటేయాలి. పోడు భూములు ఈ నియోజకవర్గంలో 26వేల ఎకరాల పట్టాలు ఇచ్చాం. పట్టాలు ఇచ్చి వదిలేయకుండా కేసులన్నీ ఎత్తివేయడంతో పాటు రైతుబంధు ఇస్తున్నాం. రైతుబీమా పథకం పెట్టాం. లాండాలు, ఆదివాసీ గిరిజనులు, గోండు సోదరులు మావనాటే మావ రాజ్‌.. మా గూడెంలో మా రాజ్యం.. మా తండాలో మా రాజ్యం అని పోరాటం చేశారు. రిజర్వేషన్‌లు పెంచాలని పోరాటం చేశారు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోడు భూములు ఇచ్చింది. చాలాకాలంగా కోరుతున్న తండాలన్నీ గ్రామ పంచాయతీలను చేశాం. అశ్వారావుపేటలో 47 గూడెలను గ్రామ పంచాయతీలను చేశాం. గిరిజన సోదరులే రాజ్యం నడిపిస్తున్నరు. రిజర్వేషన్లు పది శాతానికి పెంచుకున్నాం. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి' అన్నారు.


'రోడ్ల విషయం చెబితే పక్క రాష్ట్రం వాళ్లను విమర్శించామని అంటున్నరు. మన రాష్ట్రం పక్కనే ఆ రాష్ట్రం ఉన్నది. మన రోడ్లు ఎట్టున్నయో.. వాటిని చూస్తే మీకు అర్థమవుతున్నది. మనం ఎంత బాగా చేసుకుంటున్నమనేది ఆలోచించాలి. ఇలా అనేక కార్యక్రమాలు చేశాం. అశ్వారావుపేటలో డిగ్రీ కాలేజీ పెట్టుకున్నాం. వంద పడకల ఆసుపత్రి పెట్టుకున్నాం. డయాలసిస్‌ పెట్టుకున్నాం. మెచ్చ నాగేశ్వర్‌రావు మాకు ఒక్కటే ఫ్యాక్టరీ ఉంది.. మరో ఫ్యాక్టరీ కావాలంటే.. అప్పారావుపేటలో మరో ఫ్యాక్టరీ పెట్టుకున్నాం. 60టన్నుల ఫ్యాక్టరీ పెట్టుకున్నాం. మూడోది కావాలని కోరారు. ఇది ఉద్యానవన పంటలు ఎక్కువ ఉండే ప్రాంతం. ఇక్కడ కరెంటు ముఖ్యం. గోదావరి పరీవాహక ప్రాంతం కాబట్టి గ్రౌండ్‌ వాటర్‌ ఉంటుంది. కానీ, కరెంటు చాలా ముఖ్యం. లేకపోతే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపిస్తే 24 గంటల కరెంటు కొనసాగించే బాధ్యత నాది. రైతాంగానికి తప్పకుండా రూ.16వేలకు తీసుకుపోతాం. పేదసాదలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.5వేలకు పెంచుకుందాం. ఒకటే రోజు పెంచుకోకున్నా.. మొదట రూ.3వేలు ఇచ్చి.. రూ.5వేలకు పెంచుకుంటూ పోతాం. ఇప్పుడిప్పుడే రైతుల అప్పులు తేరుతున్నయ్‌. రైతుల మొఖాల్లో వర్చస్సు వస్తున్నది. ఇది పోగొట్టుకోకూడదని చెబుతున్న'నన్నారు.


'తెలంగాణ తెచ్చిన వాడిగా.. నాయకుడిగా.. మీ బిడ్డగా మీ అందరికీ మనవి చేసేది ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే.. మీ దీవెనలు ఉంటే.. రాష్ట్రాన్ని ఇదేబాటలో ముందుకు తీసుకుపోతా.. మెచ్చ నాగేశ్వర్‌రావు చక్కటి మనిషి. హైదరాబాద్‌లో ఉండే రకం కాదు. హైదరాబాద్‌ వస్తే ఒకటి రెండు మూడురోజుల కంటే ఎక్కువ ఉండరు. అశ్వారావుపేటలో సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్లు కావాలని అడిగి తెచ్చారు. ఇవాళ అశ్వారావుపేట రూపురేఖలు మారాయి. భవిష్యత్‌లో ఇంకా చేయాల్సి ఉంది. తాటి వెంకటేశ్వర్లు ఇవాళ పార్టీలో చేరారు. ఇద్దరు కలువడంతో తిరుగే లేదు. వందశాతం మళ్లీ బీఆర్‌ఎస్‌ గవర్నమెంటే వస్తుంది. మళ్లీ రాష్ట్రాన్ని ఉజ్వలమైన తెలంగాణగా ముందుకు తీసుకెళ్లేందుకు నాగేశ్వర్‌రావుకు, బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉండాలని కోరుకుంటున్నా'నన్నారు.

Comments