టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలు.

 టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో ముఖ్య నిర్ణ‌యాలు

తిరుమ‌ల‌,  న‌వంబ‌రు 14 (ప్రజా అమరావతి);


: టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఇందులో తీసుకున్న కొన్ని ముఖ్య నిర్ణ‌యాలు ఇవి.

– టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగుల‌ రెగ్యుల‌రైజేషన్ ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వ జి.ఓ.114 విధివిధానాల‌కు లోబ‌డి టీటీడీలో అమలుకు నిర్ణయం. వ‌చ్చే బోర్డు స‌మావేశంలో వివ‌రాలు తెలియ‌జేస్తాం.

– శ్రీ శ్రీ‌నివాస దివ్యానుగ్ర‌హ విశేష హోమం ఈ నెల 23న అలిపిరి వ‌ద్దగ‌ల స‌ప్త‌గోప్ర‌ద‌క్షిణ మందిరంలో ప్రారంభం కానుంది. మొద‌ట కొద్దిమందితో ప్రారంభించి ఆ త‌రువాత విస్తృత స్థాయిలో స్లాట్ల విధానంలో నిర్వ‌హిస్తారు. ఇందుకోసం టికెట్ ధ‌ర రూ.1000/-గా నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో టికెట్లు కేటాయిస్తారు. ప్ర‌త్య‌క్షంగా, వ‌ర్చువ‌ల్‌గా పాల్గొన‌వ‌చ్చు.

– వ‌డ‌మాలపేట మండ‌లం పాదిరేడు అర‌ణ్యం వ‌ద్ద టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థ‌లాలు అందించ‌డానికి అవ‌స‌ర‌మైన ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఇందుకోసం ఆ భూమిలో రూ.25.67 కోట్ల‌తో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి టెండ‌రు ఖ‌రారు చేశాం.

అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉద్యోగుల‌కు అద‌నంగా కేటాయించిన 132 ఎక‌రాల్లో కూడా గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి రూ.15 కోట్ల‌తో టెండ‌ర్లు పిల‌వ‌డానికి పాల‌క‌మండ‌లి ఆమోదం తెలిపింది. ఇందుక‌య్యే ఖ‌ర్చును ఉద్యోగులు భ‌రిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులు స‌హా అంద‌రికీ ఇవ్వ‌డానికి ఇంకా భూమి కోరాం. త్వ‌ర‌లో మ‌రిన్ని ఎక‌రాల వ‌స్తాయి.

– తిరుప‌తిలో టీటీడీ ఉద్యోగులు నివ‌సిస్తున్న‌ రామ్‌న‌గ‌ర్ క్వార్ట‌ర్స్‌లో రూ.6.15 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేయ‌డానికి టెండ‌ర్ల‌ను ఆమోదించాం.

– తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి రెండు బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి, బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌క్క‌టి సేవ‌లు అందించిన రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌కు రూ.6,850/- బ్ర‌హ్మోత్స‌వ బ‌హుమానం అందించాల‌ని నిర్ణ‌యించాం.

– మ్యాన్‌ప‌వ‌ర్ స‌ర్దుబాటులో భాగంగా ప్ర‌స్తుతం టైపిస్ట్‌, టెలెక్స్ ఆప‌రేట‌ర్‌, టెలిఫోన్ ఆప‌రేట‌ర్ గ్రేడ్-1 హోదాల్లో ఉన్న ఉద్యోగుల‌ను జూనియ‌ర్ అసిస్టెంట్ క్యాడ‌ర్‌గా మార్పు చేసేందుకు ఆమోదం.

– టీటీడీ అన్న‌ప్ర‌సాదం విభాగంలో భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించ‌డానికి ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గ‌వ‌ర్న‌మెంట్ సంస్థ త‌ర‌ఫున క్లీనింగ్‌, స‌ర్వింగ్‌,లోడింగ్‌, అన్‌లోడింగ్ సేవ‌లు అందిస్తున్న‌ 528 మంది కార్మికుల‌ను మ‌రో మూడు నెల‌ల పాటు కొన‌సాగించేందుకు రూ.2.40 కోట్లు మంజూరుకు చేశాం.

– తిరుమ‌ల ఆరోగ్య విభాగం ఆధ్వ‌ర్యంలో ఐదు ప్యాకేజీల కింద సేవ‌లందిస్తున్న 1694 మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను మ‌రో ఏడాది పాటు కొన‌సాగించేందుకు రూ.3.40 కోట్లు మంజూరుచేశాం.

– అదేవిధంగా తిరుమ‌ల‌లో ఎఫ్ఎంఎస్ సేవ‌లను మ‌రో ఏడాది పాటు పొడిగించేందుకు గాను సౌత్ ప్యాకేజీ రూ.13.20 కోట్లు, ఈస్ట్ ప్యాకేజి రూ.9.60 కోట్లు మంజూరుకు ఆమోదం.

– శ్రీ‌వారి ఆల‌యం, ఇత‌ర అనుబంధ ఆల‌యాల్లో నైవేద్యం, ప్ర‌సాదాలు, మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్నప్ర‌సాద కేంద్రంలో అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి అవ‌స‌ర‌మైన ప‌ప్పు దినుసులు, చ‌క్కెర‌, మిర‌ప‌కాయ‌లు, నెయ్యి డ‌బ్బాలు నిల్వ ఉంచ‌డానికి తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద గ‌ల మార్కెటింగ్ గోడౌన్ల ప్రాంగ‌ణంలో రూ.11.05 కోట్ల‌తో నూత‌న గోడౌన్ నిర్మాణానికి టెండ‌ర్లు ఆమోదించాం.

ప్ర‌స్తుతం ఉన్న మూడు గోడౌన్ల‌లో టీటీడీ అవ‌స‌రాల‌కు 15 రోజులకు స‌రిప‌డా స్టాక్ నిల్వ ఉంచేందుకు మాత్ర‌మే అవ‌కాశముంది. నూత‌న గోడౌన్ నిర్మాణం ద్వారా 60 రోజుల నుండి 90 రోజుల వ‌ర‌కు స్టాక్ నిల్వ ఉంచుకునే సామ‌ర్థ్యం క‌లుగుతుంది.

– తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నం కోసం వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తున్న భ‌క్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. భ‌క్తుల సంఖ్య‌కు త‌గిన‌ట్లుగా ర‌వాణా స‌దుపాయాలు పెంచాల్సిన బాధ్య‌త టీటీడీపై ఉంది. ఇందుకుగానూ ట్రాఫిక్ ఇబ్బందులు త‌గ్గించేందుకు మంగ‌ళం ఆర్‌టిఓ కార్యాల‌యం నుండి రేణిగుంట రోడ్డులోని ప‌ద్మావ‌తి ఫ్లోర్‌మిల్ వ‌ర‌కు గ‌ల 2.90 కి.మీ రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్త‌రించేందుకు రూ.15.12 కోట్లు మంజూరుచేశాం.

– అలాగే రేణిగుంట రోడ్డులోని నారాయ‌ణాద్రి ఆసుప‌త్రి జంక్ష‌న్ నుండి తిరుచానూరు వ‌ద్దగల హైవే రోడ్డు వ‌ర‌కు ఉన్న రోడ్డును డివైడ‌ర్ల‌తో కూడిన నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు రూ.13.29 కోట్ల‌తో టెండ‌రు ఆమోదించాం.

– శ్రీ‌వారి భ‌క్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొల‌గించ‌డంలో భాగంగా రేణిగుంట రోడ్డులోని హీరో షోరూమ్ నుండి తిరుచానూరు గ్రాండ్ రిడ్జి హోట‌ల్ వ‌ర‌కు 1.135 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.3.11 కోట్ల‌తో టెండ‌ర్ల‌ను ఆమోదించాం.

– తిరుప‌తిలోని ఎంఆర్‌.ప‌ల్లి జంక్ష‌న్ నుండి పాత తిరుచానూరు రోడ్డు జంక్ష‌న్ వ‌ర‌కు (అన్న‌మ‌య్య మార్గం), 2వ స‌త్రం నుండి అన్న‌మ‌య్య మార్గం వ‌ర‌కు ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, సెంట్ర‌ల్ డివైడ‌ర్ త‌దిత‌ర అభివృద్ధి ప‌నుల కోసం రూ.4.89 కోట్ల మంజూరు చేశాం.

– శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి త‌ల్లి అయిన శ్రీ వ‌కుళామాత ఆల‌యానికి వ‌స్తున్న భ‌క్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. భ‌క్తుల స‌దుపాయం కోసం తిరుప‌తి స‌మీపంలోని పుదిప‌ట్ల జంక్ష‌న్ నుండి వ‌కుళమాత ఆల‌యం వ‌ద్ద గ‌ల జాతీయ ర‌హ‌దారి వ‌ర‌కు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.21.10 కోట్ల‌తో టెండ‌రు ఆమోదించాం. ఇది పూర్త‌యితే తిరుప‌తికి పూర్తిగా ఔట‌ర్ రింగ్ రోడ్డు ఏర్ప‌డుతుంది.

– రోగుల‌కు చ‌క్క‌టి ఆయుర్వేద వైద్య సేవ‌లు అందిస్తున్న ఎస్వీ ఆయుర్వేద ఆసుప‌త్రిలో రోగుల‌కు మ‌రింత సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి రూ.1.65 కోట్ల‌తో గ్రౌండ్ ఫ్లోర్ అభివృద్ధి ప‌నుల‌కు టెండ‌రు ఆమోదం.

– తిరుప‌తిలో శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల సూప‌ర్‌స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఆసుప‌త్రి నిర్మాణం కోసం రుయా ఆసుప్ర‌తిలో గ‌ల పాత టిబి వార్డు స్థ‌లాన్ని వినియోగించుకోవ‌డం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో రుయా ఆసుప‌త్రికి వ‌స్తున్న టిబి రోగుల‌కు మంచి స‌దుపాయాల‌తో కూడిన నూత‌న టిబి వార్డు నిర్మాణానికి రూ.1.79 కోట్ల‌తో టెండ‌రు ఆమోదించాం.

– రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానిక‌మైన స్విమ్స్ ఆసుప‌త్రికి రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతూ ఉంది. రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చిన వారు చెట్ల‌కింద విశ్రాంతి తీసుకుంటూ ఇబ్బందులు ప‌డుతుండ‌టంతో వారి కోసం ఇటీవ‌ల వ‌స‌తి భ‌వ‌నం నిర్మించ‌డం జ‌రిగింది. కానీ మ‌రింత‌మంది రోగుల సౌక‌ర్యం కోసం రూ.3.35 కోట్ల‌తో ప్ర‌స్తుతం ఉన్న భ‌వ‌నంపై మ‌రో రెండు అంత‌స్తుల నిర్మాణానికి టెండ‌రు ఆమోదించాం.

– స్విమ్స్‌కు వైద్యం కోసం వ‌చ్చే రోగుల‌కు మ‌రింత ఆధునిక వైద్య స‌దుపాయాలు అందుబాటులోకి తేవ‌డంలో భాగంగా నూత‌న‌ కార్డియో న్యూరో బ్లాక్ నిర్మాణానికి రూ.74.24 కోట్ల‌తో టెండ‌రు ఖరారు చేశాం.

– అదేవిధంగా స్విమ్స్ ఆసుప‌త్రి భ‌వ‌నాల ఆధునీక‌ర‌ణ‌కు, పున‌ర్నిర్మాణానికి రూ.197 కోట్లతో ప‌రిపాల‌న అనుమ‌తికి ఆమోదం. మూడేళ్ల‌లో ద‌శ‌ల‌వారీగా ఈ అభివృద్ధి ప‌నులు చేప‌డ‌తాం.

– న‌డ‌క దారుల్లో తిరుమ‌ల‌కు వ‌స్తున్న భ‌క్తుల భ‌ద్ర‌త కోసం తిరుప‌తి డిఎఫ్‌వో ఆధ్వ‌ర్యంలో డిజిట‌ల్ కెమెరా ట్రాప్‌లు, వైల్డ్ లైఫ్ మానిట‌రింగ్ సెల్‌, కంట్రోల్ రూమ్‌కు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల కొనుగోలుకు రూ.3.50 కోట్లు మంజూరుకు ఆమోదం.

– క‌రీంన‌గ‌ర్‌లో శ్రీ ప‌ద్మావ‌తి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య నిర్మాణానికి రూ.15.54 కోట్ల‌తో టెండ‌రు ఆమోదం తెలిపాం.

– సంప్ర‌దాయ క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డంలో భాగంగా తిరుప‌తిలోని ఎస్వీ శిల్ప‌క‌ళాశాల‌లో సంప్ర‌దాయ క‌ళంకారీ, శిల్ప‌క‌ళలో ప్రాథ‌మిక శిక్ష‌ణ సాయంకాలం కోర్సులు ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యం.

ఈ స‌మావేశంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ స‌త్య‌నారాయ‌ణ‌, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, బోర్డు స‌భ్యులు పాల్గొన్నారు.

Comments